Pakistan Economic Crisis: తీవ్రమైన ఆర్థిక ఇబ్బందులతో సతమతం అవుతోంది దాయాది దేశం పాకిస్తాన్. మిత్రదేశాలను అడిగినా అప్పు పుట్టడం లేదు. ఇప్పటికే చేసిన అప్పులు భారీగా ఉండటంతో అరబ్ దేశాలు, చైనా, ఇతర దేశాలు అప్పులు ఇచ్చేందుకు ముందుకు రావడం లేదు. దీంతో అంతర్జాతీయ ద్రవ్యనిధి సంస్థ(ఐఎంఎఫ్) సహకరిస్తే తప్పా ఈ సంక్షోభం నుంచి పాకిస్తాన్ బయటపడే అవకాశం లభించదు. అయితే ఐఎంఎఫ్ బెయిలౌట్ ప్యాకేజీ ఇవ్వాలంటే, షరతులకు అంగీకరించాల్సిందే అని ఐఎంఎఫ్ స్పష్టం చేసింది. అయితే ఈ షరతులకు అంగీకరిస్తే పాకిస్తాన్ ప్రజలు పరిస్థితి పెనం నుంచి పొయ్యిలోకి పడిపోతుంది. ప్రజలపై మరింత భారం పడుతుంది. అయినా కూడా పాకిస్తాన్ షరతులకు ఒప్పుకోవాల్సిన పరిస్థితి ఉంది.
Read Also: Viral Video: రోటీ చేసిన బిలియనీర్.. బ్లాగర్‌తో కలిసి బిల్‌గేట్స్ చెఫ్ అవతారం
ఇదిలా ఉంటే ఐఎంఎఫ్ బెయిలౌట్ ప్యాకేజీపై పాక్ ప్రధాని షహబాజ్ షరీఫ్ కీలక వ్యాఖ్యలు చేశారు. ఐఎంఎఫ్ షరతులు ఊహకు అందనివిగా ఉన్నాయిని.. అయినా కూడా అంగీకరించాల్సిందే అని అన్నారు. ఓ టీవీకి ఇచ్చిన ఇంటర్వ్యూలో ఈ వ్యాఖ్యలు చేశారు. నెలల తరబడి నిలిచిపోయిన ఆర్థిక సాయాన్ని మళ్లీ ప్రారంభించేందుకు ఐఎంఎఫ్ బృందం మంగళవారం పాకిస్తాన్ చేరుకుంది. అయితే అక్టోబర్ లో పాకిస్తాన్ నేషనల్ అసెంబ్లీకి ఎన్నికలు జరగాల్సి ఉంది. అయితే ఐఎంఎఫ్ షరతులకు అంగీకరిస్తే ఎదురుదెబ్బ తగులుతుందని, ఐఎంఎఫ్ సిఫారసు చేసిన పన్నుల పెంపుదల, సబ్సీడీ కోతలకు వ్యతిరేకంగా పాక్ ప్రభుత్వం పట్టుబట్టింది. అయితే ఐఎంఎఫ్ షరతులు అంగీకరించాల్సిందే లేకపోతే బెయిలౌట్ ప్యాకేజీ కష్టం అని తేల్చి చెప్పింది. విద్యుత్ టారిఫ్ పెంచాలనే కీలక ప్రతిపాదన చేసింది. ఇదే జరిగితే పాకిస్తాన్ ప్రజల్లో ఆక్రోశం కట్టలు తెంచుకునే అవకాశం ఉంది. ప్రస్తుతం పాకిస్తాన్ కు 7 బిలియన్ డాలర్ల రుణం ఇచ్చేందుకు ఐఎంఎఫ్ చర్చలు జరుపుతోంది.
ప్రస్తుతం విదేశీ మారకద్రవ్యం నిల్వలు కేవలం 3.1 బిలియన్ డాలర్లు ఉన్నాయి. ఇది కేవలం మూడు వారాల దిగుమతులకే సరిపోతాయి. బుధవారం పాకిస్తాన్ లో ద్రవ్యోల్భనం 48 ఏళ్ల గరిష్టస్థాయికి చేరుకుంది. ప్రజల కనీస అవసరాలు అయిన కూరగాయాలు, పిండి, వంటనూనె, నెయ్యి కొనుగోలు చేసేందుకు ప్రజలు కష్టపడుతున్నారు. విపరీతంగా రేట్లు పెరిగాయి. చెల్లింపులు చేయలేకపోవడంతో కరాచీ పోర్టులో వేలాది షిప్పింగ్ కంటైనర్లలో వస్తువులు అలాగే ఉన్నాయి.