తాలిబన్ల పేరు ఇప్పుడు ప్రపంచ వ్యాప్తంగా మారుమ్రోగిపోతున్నది. లక్షలాది మంది సైనికులు, ఆధునిక ఆయుధసంపత్తి, 20 ఏళ్లుగా అమెరికా సైన్యం ఇచ్చిన ట్రైనింగ్లో రాటు తేలిన ఆఫ్ఘన్ సైనికులను రెండు వారాల వ్యవధిలోనే ఓడించి దేశాన్ని వారి చేతుల్లోకి తీసుకున్నారు. తాము లేకున్నా, ఆఫ్ఘన్ సైనికులు పోరాటం చేయగలరనే ధీమాతో ఆమెరికా అక్కడి నుంచి వైదొలిగింది. సెప్టెంబర్ 11 వరకు ఆఫ్ఘన్ నుంచి పూర్తిగా వెనక్కి వచ్చేయాలని ఆమెరికా నిర్ణయం తీసుకోవడంతో తాలిబన్లు రెచ్చిపోయారు. చాలా ప్రాంతాల్లో భయానకం సృష్టించారు. ఇక వారి టార్గెట్లో ఉన్న నగరాలను చుట్టుముట్టి సైనికులకు ఆహారం, ఆయుధాలు, ఇతర వస్తువులు అందకుండా చేయడంతో సైనిక బలగాలు త్వరగా లొంగిపోయాయి. ఇదే పద్దతిని అనేక ప్రాంతాల్లో అమలు చేయడంతో ఆఫ్ఘన్ సైనికుల్లో మానసిక స్థైర్యం కోల్పోయారు. చాలా ప్రాంతాల్లో సైనికులు స్వచ్చందంగా తాలిబన్లకు లొంగిపోయారు.
Read: మగువలకు షాక్ : మళ్లీ పెరిగిన బంగారం ధరలు..
కొంతమంది ఆయుధాలు వదిలేసి పారిపోయారు. దీంతో ఆఫ్ఘన్ తాలిబన్ల వశం అయింది. అనుకున్నదానికంటూ వేగంగా తాలిబన్లు కాబూల్వైపు చొచ్చుకురావడంతో ఆఫ్ఘన్ అధ్యక్షుడు ఘని దేశాన్ని వదిలేసి వెళ్లిపోయాడు. 1996 నుంచి 2001 వరకు తాలిబన్లు అఫ్ఘనిస్తాన్లో పాలన సాగించారు. ఆ నాలుగేళ్ల పాలనతో ఆ దేశం దుర్భరమైన పరిస్థితులను ఎదుర్కొన్నది. మద్యయుగం నాటి ఆచారాలను అమలు చేయడంతో ప్రజలు అనేక ఇబ్బందులు ఎదుర్కొన్నారు. పదేళ్లు దాటిన చిన్నారులు స్కూళ్లకు వెళ్లకూడదు. పురుషులు తప్పని సరిగా గడ్డాలు పెంచాలి, మహిళలు బురఖా ధరించడం తప్పనిసరి. ఇతర మతాలకు చెందిన వారిని ఆ దేశంలో అడుగుపెట్టనివ్వరు. నాలుగేళ్లపాటు ఆరాచకపాలనలో ఇబ్బందులు పడిన ప్రజలు 2001 నుంచి 2021 వరకు 20 ఏళ్లపాటు ప్రజాస్వామ్య పాలనలో హాయిగా జీవించారు. ఇప్పుడు మరలా తాలిబన్ల ఆక్రమణలతో మరోసారి కర్కశమైన పాలనతో జీవితం గడపాల్సి వస్తుందని ప్రజలు భయాందోళనలు చెందుతున్నారు.