Israel: ఇజ్రాయిల్ అక్టోబర్ 7 నాటి హమాస్ మిలిటెంట్ల దాడి తర్వాత, హమాస్‌ని కుప్పకూల్చాలనే లక్ష్యంలో బిజీగా ఉండగా.. మరోవైపు లెబనాన్ నుంచి హమాస్‌కి మద్దతుగా హిజ్బుల్లా మిలిటెంట్లు దాడులకు తెగబడుతున్నారు. తాజాగా హిజ్బుల్లా ఇజ్రాయిల్ ఉత్తర ప్రాంతంలోని ఇజ్రాయిల్ డిఫెన్స్ ఫోర్సెస్(ఐడీఎఫ్) స్థావరాలపై రాకెట్ల వర్షం కురిపించారు. శనివారం ఇజ్రాయిల్ సైనిక స్థావరాలపై 60కి పైగా రాకెట్లను ప్రయోగించినట్లు హిజ్బుల్లా ప్రకటించింది. బీరూట్‌లో హమాస్ డిప్యూటీ లీడర్‌ని హతమార్చినందుకు ప్రతిస్పందనగా ఈ దాడికి పాల్పడినట్లు వివరించింది.
‘‘గ్రేట్ లీడర్ షేక్ సలేహ్ అల్-అరూరిని హత్య చేసిన నేరానికి ఇది తొలి స్పందన. ఇస్లామిక్ రెసిస్టెన్స్(హిజ్బుల్లా) మెరాన్ ఎయిర్ కంట్రోల్ బేస్‌ను 62 క్షిపణులు లక్ష్యంగా చేసుకున్నాయి’’ అని ఇరాన్ మద్దతు ఉన్న హిజ్బుల్లా ప్రకటించింది. శనివారం ఉదయం లెబనీస్ భూభాగం నుండి దాదాపు 40 రాకెట్ ప్రయోగాలను గుర్తించినట్లు ఇజ్రాయెల్ మిలటరీ తెలిపింది హమాస్‌తో యుద్ధం ప్రారంభమైన తర్వాత మద్దతుగా లెబనాన్ మిలిటెంట్ సంస్థ ఇజ్రాయిల్ ఉత్తర భాగంలో తరుచుగా దాడులకు పాల్పడుతోంది.
దక్షిణ బీరూట్‌లో ఇజ్రాయిల్ జరిపిన దాడుల్లో హమాస్ కీలక నేత అరూరి హతమయ్యాడు. అయితే ఈ ఇజ్రాయిల్ మాత్రం ఈ దాడిపై ఎలాంటి వ్యాఖ్యలు చేయలేదు. యుద్ధ ప్రారంభమైన తర్వాత తొలిసారిగా గాజాస్ట్రిప్, వెస్ట్ బ్యాంక్ కాకుండా.. ఏకంగా లెబనాన్ రాజధాని బీరూట్‌పై దాడి జరిగింది. అయితే గాజా యుద్ధం ఇతర ప్రాంతాలకు విస్తరిస్తుండటంపై పాశ్చాత్య దేశాలు ఆందోళన వ్యక్తం చేశాయి.