NTV Telugu Site icon

Israel-Hezbollah War: ఇజ్రాయెల్-లెబనాన్ మధ్య భీకరపోరు.. 250 రాకెట్లు ప్రయోగించిన హిజ్బుల్లా

Israelhezbollah War

Israelhezbollah War

ఇజ్రాయెల్-హిజ్బుల్లా మధ్య వార్ మరోసారి ఉధృతం అయింది. ఇజ్రాయెల్ సైన్యమే లక్ష్యంగా హిజ్బుల్లా రెచ్చిపోయింది. ఆదివారం ఒకేసారి 250 రాకెట్లను ప్రయోగించింది. ఇరాన్ మద్దతుతో ఈ రాకెట్లను ప్రయోగించింది. లెబనాన్ సరిహద్దు ప్రాంతం నుంచి ఈ క్షిపణులను ప్రయోగించింది. కొన్ని టెల్ అవీవ్ ప్రాంతంలో పడగా.. మరికొన్నింటినీ ఐడీఎఫ్ దళాలు గగనతలంలో పేల్చేశాయి. ఇందుకు సంబంధించిన దృశ్యాలను హిజ్బుల్లా సోషల్ మీడియాలో వీడియోలు పంచుకుంది. ఇక ఇజ్రాయెల్‌లోని ఒక ఇంటిపై క్షిపణి పడడంతో మంటల్లో కాలిపోయింది. మరొక క్షిపణి కారణంగా కార్లు దగ్ధమయ్యాయి. ఇందుకు సంబంధించిన వీడియోను ఐడీఎఫ్ సోషల్ మీడియా ద్వారా పంచుకుంది.

గత కొద్దిరోజులుగా హిజ్బుల్లా అంతమే లక్ష్యంగా ఇజ్రాయెల్ దాడులు సాగిస్తోంది. దక్షిణ బీరుట్‌పై ఇజ్రాయెల్ భారీ దాడులు చేసింది. దీనికి ప్రతీకారంగా ఆదివారం ఇరాన్ మద్దతుతో హిజ్బుల్లా రెచ్చిపోయింది. ఒకేసారి 250 క్షిపణులను ప్రయోగించింది. ఐడీఎఫ్ సమర్థవంతంగా తప్పికొట్టింది. కొంత నష్టమైతే జరిగింది. దక్షిణ ఇజ్రాయెల్‌లోని అష్డోద్ నావికా స్థావరం లక్ష్యంగా దాడి చేసినట్లు హిజ్బుల్లా తెలిపింది. అలాగే టెల్ అవీవ్‌లోని సైనిక స్థావరం లక్ష్యంగా అధునాతన క్షిపణులు, డ్రోన్లు ప్రయోగించినట్లు వెల్లడించింది.

హమాస్ మద్దతుగా హిజ్బుల్లా ఇజ్రాయెల్ దాడులకు తెగబడింది. దీంతో సెప్టెంబర్ నుంచి ఇజ్రాయెల్ ప్రతీకార దాడులకు దిగింది. పేజర్లు, వాకీటాకీల పేల్చడంతో కొంది మంది ప్రాణాలు కోల్పోయారు. అనంతరం హిజ్బుల్లా అధ్యక్షుడు హసన్ నస్రల్లాను ఐడీఎఫ్ హతమార్చింది. వరుసగా హిజ్బుల్లా కమాండర్లను ఒక్కొక్కరిని చంపుకుంటూ వచ్చేసింది. అనంతరం ఇరాన్ కూడా రంగంలోకి దిగింది. హమాస్, హిజ్బుల్లా మద్దతుగా ఇజ్రాయెల్‌‌పై అక్టోబర్ మొదటి వారంలో ఒకేసారి 180 రాకెట్లను ప్రయోగించింది. రాకెట్లను ఇజ్రాయెల్ తిప్పికొట్టింది.

ఇదిలా ఉంటే ఇటీవల యూఎస్ ప్రత్యేక రాయబారి అమోస్ హోచ్‌స్టెయిన్ లెబనాన్‌లో పర్యటించారు. యుద్ధానికి ముగింపు పలికేందుకు చర్చలు జరిపారు. లెబనాన్ పర్యటన తర్వాత ఇజ్రాయెల్‌కు వెళ్లారు. ఇరుదేశాలతో చర్చించి యుద్ధానికి ముగింపు కలకాలని భావించారు. కానీ అలాంటి పరిస్థితులు ఇంకా ఏర్పడలేదు. రోజురోజుకు ఆందోళనలు ఉధృతం అవుతున్నాయి తప్ప ఏ మాత్రం సద్దుమణగలేదు.