Shehbaz Sharif: ఇరాన్ అధ్యక్షుడి టూర్‌లో పాక్ ప్రధాని వింత ప్రవర్తన.. నెట్టింట తీవ్ర విమర్శలు

  • ఇరాన్ అధ్యక్షుడి టూర్‌లో పాక్ ప్రధాని వింత ప్రవర్తన
  • అతిథులను ఎండలో నడిపించి గొడుగు కింద నడిచిన షరీఫ్
  • సోషల్ మీడియాలో తీవ్ర విమర్శలు
Pak

Pak

ఎవరైనా విదేశీ అతిథులు వచ్చినప్పుడు చాలా గౌరవంగా.. రెడ్ కార్పె్ట్ వేసి ఘనంగా స్వాగతం పలుకుతారు. కానీ పాకిస్థాన్‌లో ప్రధాని షెహబాజ్ షరీఫ్ మాత్రం చాలా వింతగా ప్రవర్తించారు. ఇరాన్ అధ్యక్షుడు మసూద్ పెజెష్కియన్ ఇస్లామాబాద్ పర్యటన సందర్భంగా అతిథులకు మర్యాద ఇవ్వకుండా.. తాను మాత్రమే గొడుగు కింద నడుస్తూ.. అతిథులు ఎండలో నడిచేలా చేశారు. ఆశ్చర్యంగా పాకిస్థాన్ అధ్యక్షుడు జర్దారీకి గొడుగు వేయబోతుండగా సున్నితంగా తిరస్కరించారు. అతిథులు కాకుండా తాను మాత్రమే గొడుగు కింద నడవడంతో షరీఫ్‌పై సోషల్ మీడియాలో పెద్ద ఎత్తున విమర్శలు వెల్లువెత్తుతున్నాయి.

ఇరాన్ అధ్యక్షుడు మసూద్ పెజెష్కియన్‌, విదేశాంగ మంత్రి అబ్బాస్ అరాఖ్చీ పాకిస్థాన్ పర్యటనకు వచ్చారు. ఇస్లామాబాద్‌లోని నూర్ ఖాన్ ఎయిర్‌బేస్‌లో అతిథులకు షరీఫ్, జర్దారీ స్వాగతం పలికారు. ఆ సమయంలో చాలా ఎండగా ఉంది. అయితే షెహబాజ్ షరీఫ్ గొడుగు కింద నడుస్తుండగా.. ఇరాన్ అధ్యక్షుడు పెజెష్కియన్, ఇరాన్ విదేశాంగ మంత్రి అబ్బాస్ అరాఖ్చీని మాత్రం ఎండలో నడిపించారు.

ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్ కావడంతో పలువురు నెటిజన్లు అసంతృప్తి వ్యక్తం చేశారు. ‘‘అతిథిగా వచ్చిన దేశాధ్యక్షుడికి గొడుగు ఇవ్వకుండా ఎలా వ్యవహరించారు? తీవ్ర ఎండలో విదేశీ నేతలను నిలబెట్టి.. తాను మాత్రం గొడుగు కింద నడవడం సరైన మర్యాదేనా?’’ అంటూ ప్రశ్నించారు. కొందరు ఈ ఘటనను దౌత్య మర్యాదలకు విరుద్ధమని అభిప్రాయపడ్డారు. అయితే ఈ చిన్న ఘటనతో పెద్ద చర్చ నడుస్తున్నప్పటికీ.. ఇరాన్ అధ్యక్షుడి పర్యటన దౌత్యపరంగా కీలకంగా నిలిచింది. ఇస్లామాబాద్‌లో జరిగిన ఉన్నతస్థాయి సమావేశాల్లో ఇరాన్, పాకిస్థాన్ మధ్య వాణిజ్యం, వ్యవసాయం, భద్రత, సాంకేతిక రంగాల్లో సహకారాన్ని విస్తరించే అంశాలపై చర్చించారు. ఇరాన్‌కు అవసరమైన మాంసం దిగుమతుల్లో 60 శాతం వరకు పాకిస్థాన్ నుంచి కొనుగోలు చేసే అవకాశాన్ని కూడా ఇరాన్ అధికారులు ప్రస్తావించారు.

ఇరుదేశాలు ఉగ్రవాద నిరోధక చర్యలు, సైబర్ భద్రత, ప్రాంతీయ స్థిరత్వం, ఆర్థిక సంబంధాల బలోపేతంపై సహకారాన్ని మరింత పెంచుకోవాలని అంగీకరించాయి. ఈ పర్యటనలో ఇరాన్ అధ్యక్షుడు పెజెష్కియన్.. పాకిస్థాన్ అధ్యక్షుడు ఆసిఫ్ అలీ జర్దారీతో కూడా సమావేశమయ్యారు. అలాగే ఇరాన్ విదేశాంగ మంత్రి అబ్బాస్ అరాఖ్చీ పలు కీలక సమావేశాల్లో పాల్గొన్నారు. ఇటీవల ఇరాన్-అమెరికా-ఇజ్రాయెల్ మధ్య ఉద్రిక్తతల తర్వాత మసూద్ పెజెష్కియన్ చేపట్టిన తొలి విదేశీ పర్యటన ఇదే కావడం విశేషం. అయితే దౌత్యపరంగా కీలకమైన ఈ పర్యటనలో జరిగిన గొడుగు ఘటన మాత్రం సోషల్ మీడియాలో ప్రధాన చర్చాంశంగా మారింది.