బందీల విడుదల విషయంలో హమాస్ సంచలన ప్రకటన చేసింది. గాజాపై యుద్ధాన్ని ముగిస్తే మిగిలిన ఇజ్రాయెల్ బందీలందరినీ విడుదల చేసేందుకు సిద్ధంగా ఉన్నామని హమాస్ ప్రకటించింది. గాజా చీఫ్, చర్చల బృందానికి నాయకత్వం వహిస్తున్న ఖలీల్ అల్-హయ్యా టెలివిజన్ ప్రసంగంలో వెల్లడించారు. సమగ్ర ఒప్పందంతో బందీలను విడుదల చేసేందుకు సిద్ధంగా ఉన్నట్లు తెలిపారు. అలాగే ఇజ్రాయెల్ చెరలో ఉన్న పాలస్తీనా ఖైదీలను కూడా విడుదల చేసేందుకు ఇరు పక్షాలు సమగ్ర ఒప్పందం చేసుకోవాలని హయ్యా సూచించారు. మధ్యంతర ఒప్పందాలను మాత్రం అంగీకరించబోమని.. సమగ్ర ఒప్పందం చేసుకుంటేనే అంగీకరిస్తామని తెలిపారు.
ఇది కూడా చదవండి: Banana Price: అరటి ధరలకు రెక్కలు.. ఎన్నడూలేనంతగా అత్యధిక ధర! ఐదు నెలల పాటు నో డోకా
తొలి విడత ఒప్పందంలో భాగంగా ఖైదీ-బందీల విడుదల జరిగింది. ఆ ఒప్పందం ముగియడంతో పరిస్థితి మళ్లీ మొదటికొచ్చింది. హమాస్ లక్ష్యంగా ఇజ్రాయెల్ దాడులు చేస్తోంది. ఇప్పటికే వందలాది మంది పాలస్తీనియన్లు చనిపోయారు. బందీలందరినీ ఒకేసారి విడుదల చేసేంత వరకు దాడులు చేస్తూనే ఉంటామని ఇజ్రాయెల్ ప్రకటించింది. అయితే ఈ ఘర్షణలను చల్లబరిచేందుకు అంతర్జాతీయ మధ్యవర్తులు కృషి చేశారు. కానీ ఇరు పక్షాలు ఒకరినొకరు నిందించుకోవడంతో పురోగతి కనిపించలేదు. మొత్తానికి గుడ్‌ఫ్రైడే రోజున హమాస్ కీలక ప్రకటన చేసింది. సమగ్ర ఒప్పందంతో బందీలను విడుదల చేస్తామని వెల్లడించింది. దీనికి ఇజ్రాయెల్ స్పందన ఎలా ఉంటుందో చూడాలి.
ఇది కూడా చదవండి: Doctor Negligence: ప్రభుత్వ ఆసుపత్రిలో వైద్యుల నిర్లక్ష్యం? పురిటిలోనే మరణించిన బిడ్డ!
తొలి విడత ఒప్పందంలో భాగంగా హమాస్ 38 మంది బందీలను విడుదల చేసింది. మిగిలిన 59 మంది బందీలు విడుదల కోసం చర్చలు జరిగినా ప్రయోజనం లేకుండా పోయింది. ఇక బందీలను విడుదల చేసేంత వరకు దాడులు చేస్తూనే ఉంటామని ఇజ్రాయెల్ అంటోంది. అయితే యుద్ధాన్ని ముగిస్తేనే బందీలను విడుదల చేస్తామని హమాస్ పట్టుబడుతోంది. ఆయుధాలను విడిచి పెట్టాలన్న డిమాండ్‌ను హమాస్ తిరస్కరిస్తోంది. ఇక గురువారం గాజాపై జరిగిన ఇజ్రాయెల్ సైనిక దాడుల్లో మహిళలు, పిల్లలు సహా కనీసం 32 మంది పాలస్తీనియన్లు మరణించారని స్థానిక ఆరోగ్య అధికారులు తెలిపారు. ఉత్తర గాజా స్ట్రిప్‌లోని జబాలియాలో ఐక్యరాజ్యసమితి ఆధ్వర్యంలో నడిచే పాఠశాలపై జరిగిన దాడుల్లో ఆరుగురు మరణించగా, అనేక మంది గాయపడ్డారు. హమాస్ కమాండ్ సెంటర్‌ను లక్ష్యంగా చేసుకుని ఈ దాడి జరిగిందని ఇజ్రాయెల్ సైన్యం తెలిపింది.
ఇది కూడా చదవండి: Reels On Busy Road: నడి రోడ్డుపై కుర్చీలో కూర్చొని టీ తాగుతూ రీల్స్.. తాట తీసిన పోలీసులు..