NTV Telugu Site icon

Israel-Hamas Conflict: ఇజ్రాయెల్ బందీలను విడిచిపెట్టేందుకు హమాస్ అంగీకారం.. యుద్ధం ముగియనుందా?

Israel Hamas Conflict

Israel Hamas Conflict

Israel-Hamas Conflict: హమాస్‌పై ఇజ్రాయెల్ యుద్ధం నేటికీ కొనసాగుతోంది. ఈ యుద్ధం ముగింపు దశకు వచ్చిందనే వార్తలు వినిపిస్తున్నాయి. గాజాలో తొమ్మిది నెలలుగా కొనసాగుతున్న యుద్ధానికి ముగింపు పలికే లక్ష్యంతో హమాస్ యూఎస్ ప్రతిపాదించిన ఒప్పందాన్ని అమలు చేసేందుకు అంగీకరించిందని శనివారం వార్తా సంస్థ రాయిటర్స్ తెలిపింది. ఇజ్రాయెల్ బందీలను విడుదల చేయడానికి చర్చలు ప్రారంభించాలనే యూఎస్ ప్రతిపాదనకు హమాస్ ఆమోదం తెలిపినట్లు సమాచారం. ఈ ఒప్పందంపై సంతకం చేయాలంటే ముందుగా ఇజ్రాయెల్ శాశ్వత కాల్పుల విరమణకు కట్టుబడి ఉండాలని పాలస్తీనా సంస్థ(హమాస్) డిమాండ్ చేసింది. ఇజ్రాయెల్ అంగీకరిస్తే ఈ ప్రతిపాదన ఓ ఒప్పందానికి దారి తీస్తుందని కాల్పుల విరమణ ప్రయత్నాలలో పాలుపంచుకున్న పాలస్తీనా అధికారి ఒకరు వెల్లడించారు. ఇది ఒప్పందంలో మొదటి దశ అని తెలిసింది. ఒప్పందంలోని రెండో దశను అమలు చేసేందుకు పరోక్ష చర్చలు కొనసాగుతాయి దీంతో గతేడాది అక్టోబర్ 7న మొదలైన గాజా యుద్ధం ముగియనుంది.

Read Also: Imran Khan: నాకు న్యాయం జరగకుంటే నిరాహార దీక్ష చేస్తా..

ఈ యుద్ధం వల్ల గాజాలో 38 వేలకు పైగా మరణించారు. హమాస్ మిలిటెంట్లు దక్షిణ ఇజ్రాయెల్ నగరాలపై దాడి చేసిన తర్వాత యుద్ధం ప్రారంభమైంది. వారు దాదాపు 250 మందిని బందీలుగా పట్టుకోగా, దాదాపు 1,200 మంది ఈ దాడిలో మరణించారు. అనంతరం గాజాపై మిలిటెంట్ల ఏరివేతే లక్ష్యంగా ఇజ్రాయెల్ యుద్ధం ప్రారంభించింది. గాజాపై బాంబుల వర్షం కురిపించడంతో అమాయక ప్రజలు కూడా మృతి చెందారు.

ఇజ్రాయెల్ దాడిలో ఏడుగురు పాలస్తీనియన్లు మృతి
పాలస్తీనా ఉత్తర వెస్ట్ బ్యాంక్‌లోని జెనిన్ నగరంలోని శరణార్థి శిబిరంపై ఇజ్రాయెల్ జరిపిన వైమానిక దాడులు, కాల్పుల్లో పాలస్తీనియన్లు మరణించారని పాలస్తీనా భద్రతా వర్గాలు వెల్లడించాయి. జెనిన్ క్యాంప్‌లోని యువకులను లక్ష్యంగా చేసుకుని ఇజ్రాయెల్ డ్రోన్ దాడి చేసిందని, పాలస్తీనా ఉగ్రవాదుల కాల్పులకు ప్రతీకారంగా జెనిన్‌కు పశ్చిమాన ఉన్న ఇంటిని ఇజ్రాయెల్ దళాలు చుట్టుముట్టాయని పాలస్తీనా భద్రతా వర్గాలు తెలిపాయి. ఇజ్రాయెల్ సైన్యం ఆ ప్రాంతానికి అదనపు బలగాలను మోహరించింది.