NTV Telugu Site icon

Pakistan: పాకిస్తాన్ పరిస్థితి ఇది.. షాప్ ఓపెన్ తర్వాత 30 నిమిషాల్లోనే లూటీ.. వీడియో వైరల్..

Pakistan

Pakistan

Pakistan: పాకిస్తాన్‌లో పరిస్థితి రోజు రోజుకి దిగజారుతోంది. ఆర్థిక సంక్షోభంతో ఆ దేశం కొట్టుమిట్టాడుతోంది. మరోవైపు ద్రవ్యోల్భణం పెరగడంతో ప్రజలకు నిత్యావసరాలు అందుబాటు ధరలకు దొరకడం లేదు. అయితే, తాజాగా కరాచీలో ఓ షాప్ ప్రారంభించిన 30 నిమిషాల్లోనే ప్రజలు లూటీ చేశారు. ప్రస్తుతం దీనికి సంబంధించిన వీడియోలు వైరల్ అవుతోంది. దీనిని బట్టి చూస్తే ఆ దేశం, అక్కడి ప్రజలు పరిస్థితి ఏ విధంగా ఉందో అర్థమవుతోంది.

Read Also: Maharashtra: సోదరిని ముక్కలు ముక్కలుగా నరికి నదిలో పడేసిన తమ్ముడు..

కరాచీలో శుక్రవారం డ్రీమ్ బజార్ ప్రారంభోత్సవం అంగరంగ వైభవంగా జరగాల్సింది, అయితే షాప్ ఒపెనింగ్ అంతలోనే గందరగోళంగా మారింది. తక్కువ ధరలకే వస్తువులు వస్తాయని షాప్ యాజమాన్యం ప్రకటనలతో అదరగొట్టింది. దీంతో పెద్ద సంఖ్యలో ప్రజలు ఓపెనింగ్‌కి హాజరయ్యారు. పాకిస్తాన్ మొట్టమొదటి మెగా పొదుపు దుకాణంగా సోషల్ మీడియాలో ప్రచారం చేశారు. ఈ ఈవెంట్ దుస్తులు, ఉపకరణాలు మరియు గృహోపకరణాలపై తక్కువ ధరలకే ఇస్తామని వాగ్దానం చేసింది. మాల్ వెలుపల వేలాది మంది ప్రజలు గుమిగూడడంతో, వారిని నియంత్రించడానికి నిర్వాహకులు కష్టపడ్డారు.

పరిస్థితిని గమనించి షాప్‌ని మూసేయడానికి ప్రయత్నిస్తున్న క్రమంతో, షాపు అద్దాలు పగలగొట్టి గుంపు షాపులోకి ప్రవేశించింది. ఆ తర్వాత షాపులోని బట్టలును, వస్తువుల్ని లూటీ చేశారు. షాపు మధ్యాహ్నం 3.00 గంటలకు ప్రారంభమైతే కేవలం అరగంటలోనే 3.30 గంటలకు మొత్తం ఖాళీ అయింది. అరగంటలోనే ప్రజలు షాపుని కొల్లగొట్టారు. ‘‘మేము కరాచీ ప్రజల ప్రయోజనం కోసం దీనిని తీసుకువచ్చామని, ఇప్పుడు పరిస్థితి ఇదని దాని ఉద్యోగి కన్నీటిపర్యంతమయ్యాడు. విదేశాల్లో ఉంటున్న ప్రవాస పాకిస్తానీ వ్యక్తి కరాచీలో ఈ మాల్‌ని ప్రారంభించారు. ఈ ఘటనపై పాక్ నెటిజన్లు తీవ్ర విమర్శలు చేస్తున్నారు. ప్రజలు తమ హక్కుల కోసం పోరాడేందుకు ఇంత సంఖ్యలో ముందుకు వస్తే దేశం పరిస్థితి బాగుండేదని, కానీ దీనికి బదులుగా రూ. 50కి వచ్చే షర్టులకు ప్రాధాన్యత ఇచ్చారని ఎక్స్‌లో రాశారు.

Show comments