Gaza War: అక్టోబర్ 7న హమాస్ మిలిటెంట్లు ఇజ్రాయిల్‌పై దాడికి పాల్పడి 1200 మందిని చంపేయడంతో పాటు 240 మందిని బందీలుగా గాజాలోకి తీసుకెళ్లారు. అప్పటి నుంచి ఇజ్రాయిల్ ఆర్మీ గాజాతో పాటు పాలస్తీనా భూభాగాలపై విరుచుకుపడుతోంది. గాజా స్ట్రిప్‌తో పాటు వెస్ట్ బ్యాంక్ ప్రాంతాల్లోని హమాస్ స్థావరాలు, మిలిటెంట్లు లక్ష్యంగా దాడులు చేస్తోంది. హమాస్‌ని పూర్తిగా నిర్మూలించే వరకు యుద్ధాన్ని ఆపే ప్రసక్తి లేదని పలు సందర్భాల్లో ఇజ్రాయిల్ ప్రధాని బెంజమిన్ నెతన్యాహూ స్పష్టం చేశారు. అంతర్జాతీయ సమాజం నుంచి వచ్చే ఒత్తిడిని లెక్కచేయడం లేదు.
ఇదిలా ఉంటే, హమాస్ దాడులకు సామాన్య పాలస్తీనా ప్రజలు మూల్యం చెల్లించుకుంటున్నారు. ఇప్పటి వరకు యుద్ధంలో 30,000 మంది మరణించినట్లు హమాస్ ఆధ్వర్యంలోని ఆరోగ్యమంత్రిత్వ శాఖ గురువారం తెలిపింది. మరోవైపు గాజా ప్రాంతంలో తీవ్ర మానవతా సంక్షోభం నెలకొంది. ప్రజలకు మందులు, తినడానికి తిండి, నీరు లేక ఇబ్బంది పడుతున్నారు. మొక్కలు, పశుగ్రాసంతో చేసే వంటకాలను తిని ఆకలి తీర్చుకోవాల్సి వస్తోంది. ఉత్తర గాజా ప్రాంతం నుంచి లక్షల్లో జనభా ఈజిప్టు సరిహద్దులోని రఫాకు చేరుకుంటున్నారు.
Read Also: Leopard Population: దేశంలో పెరిగిన చిరుతపులుల జనాభా.. ఈ రాష్ట్రాల్లోనే అధికం..
ఇజ్రాయిల్-హమాస్ మధ్య మరోసారి సంధి ఒప్పందాన్ని తెచ్చేందుకు ఈజిప్టు, ఖతార్, అమెరికా మధ్యవర్తిత్వం వహిస్తున్నాయి. మార్చి 10, 11 నుంచి పవిత్ర రంజాన్ మాసాన్ని పురస్కరించుకుని సంధి ఉండే అవకాశం ఉందని మధ్యవర్తులు చెబుతున్నారు. గతంలో జరిగిన ఒప్పందం లాగే ఇజ్రాయిల్ తన జైళ్లలో ఉంచిన పాలస్తీనా ఖైదీలను విడుదల చేయాలని, అందుకు ప్రతిగా తాము బందీలుగా ఉన్న ఇజ్రాయిలీలను విడుదల చేస్తామని చెప్పినట్లు సమాచారం. ఇజ్రాయిల్ ప్రకారం దాదాపుగా 250 మంది బందీలు హమాస్ చెరలో ఉన్నారు, అంతకుముందు సంధి ఒప్పందంలో పలువురిని విడుదల చేయగా.. ప్రస్తుతం 130 మంది హమాస్ వద్ద ఉన్నారని, వీరిలో 31 మంది మరణించినట్లు భావిస్తున్నారు.