NTV Telugu Site icon

Gaza: గాజాలో దుర్భర పరిస్థితులు.. 109 వాహనాల్లో ఆహార పదార్థాలు లూటీ!

Gaza

Gaza

గాజాలో పరిస్థితులు అత్యంత ఘోరంగా తయారయ్యాయి. గతేడాది ప్రారంభమైన యుద్ధంతో గాజా పరిస్థితి అత్యంత దయనీయంగా తయారైంది. ఆహార కొరతతో ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. కనీస అవసరాలు తీరక నరకయాతన పడుతున్నారు. కొద్దిరోజులైతే స్వచ్ఛంద సంస్థలు పంపిణీ చేసే ఆహార వసతులు కూడా నిలిచిపోయాయి. దీంతో అత్యంత దుర్భరమైన పరిస్థితులు ఏర్పడ్డాయి. అయితే తాజాగా గాజాకు వెళ్లే రహదారులను ఇజ్రాయెల్ ఓపెన్ చేసింది. దీంతో స్వచ్ఛంద సంస్థలు ఆహార పంపిణీ కార్యక్రమాన్ని ప్రారంభించాయి. అయితే ఆహార సామగ్రిని తీసుకెళ్తున్న ట్రక్కులను కొందరు దుండగులు ఎత్తుకెళ్లిపోయారు. హింసకు పాల్పడి లూటీ చేశారు. ఇలా మొత్తం 109 ట్రక్కుల్లోని ఆహార పదార్థాలను ఎత్తుకెళ్లిపోయారు. డ్రైవర్లపై తుపాకీ ఎక్కుపెట్టి 97 ట్రక్కుల్లోని సరకును కాజేశారని యూఎన్‌ఆర్‌డబ్ల్యూఏ పేర్కొంది. శనివారం జరిగిన దాడిలో సహాయ సిబ్బందికి కూడా గాయాలయ్యాయని, ట్రక్కులు దెబ్బతిన్నాయని వెల్లడించింది.

ఇది కూడా చదవండి: Fire Accident In Hotel: క్రికెటర్స్ ఉన్న హోటల్‌లో భారీ అగ్నిప్రమాదం

గాజాలో శాంతిభద్రతలు పూర్తిగా విచ్ఛిన్నమయ్యాయని ఐక్యరాజ్యసమితి గతంలోనే హెచ్చరించింది. కాన్వాయ్‌లకు ఎలాంటి రక్షణ లేకుండా పోయిందని… ఇజ్రాయెల్ అధికారులు చట్టపరమైన బాధ్యతలను విస్మరిస్తున్నారంటూ తీవ్రంగా స్పందించింది. తక్షణ చర్యలు చేపట్టకపోతే.. గాజాలో తీవ్ర ఆహార కొరత ఏర్పడుతుందని ఐక్యరాజ్యసమితి ఆందోళన వ్యక్తం చేసింది. గాజాలో పనిచేస్తోన్న యూఎన్‌ఆర్‌డబ్ల్యూఏ ప్రతినిధి మీడియాతో మాట్లాడుతూ.. ఒక సంచి పిండి కోసం ప్రజలు కొట్టుకునే పరిస్థితులు నెలకొన్నాయని ఆందోళన వ్యక్తం చేశారు. సుమారు 10 లక్షల మంది ఆకలితో మరణించే ప్రమాదం ఉందని ఇప్పటికే వరల్డ్ ఫుడ్‌ ప్రొగ్రామ్ హెచ్చరించింది.

ఇది కూడా చదవండి: RBI: డీప్‌ఫేక్ వీడియోలపై ఆర్బీఐ వార్నింగ్.. ఇన్వెస్టర్లు నమ్మొద్దని సూచన