గత వారం ఓ పాఠశాలలో జరిగిన కాల్పుల సంఘటన అమెరికాను ఎలా వణికించిందో అందరికీ తెలిసిందే! దీని నుంచి ఆ అగ్రరాజ్యం ఇంకా కోలుకోకముందే.. మరిన్ని కాల్పుల ఘటనలు చోటు చేసుకున్నాయి. ఒక్లహామాలోని తుల్సా ఆసుపత్రిలో ఒక దుండగుడు తుపాకీతో చెలరేగిపోయాడు. కాల్పులు జరిపిన వ్యక్తి, ఆ ఆసుపత్రికి ఓ ఆర్థోపెడిక్ సర్జన్ డాక్టర్ ఫిలిప్ కోసం వచ్చాడు. ఆయన కనిపించకపోయేసరికి, ఆ వ్యక్తి సహనం కోల్పోయి ఆగ్రహావేశాలతో ఊగిపోయాడు. ఈ క్రమంలోనే తనతో తెచ్చుకున్న తుపాకీతో కాల్పులు జరిపాడు. ఈ కాల్పుల్లో ముగ్గురు మృతి చెందారు. అనంతరం ఆ దుండుగుడు కూడా తనని తాను కాల్చుకొని ఆత్మహత్య చేసుకున్నట్టు పోలీసులు తెలుపుతున్నారు.
కాగా.. ఇదే ఒక్లహామాలో ఆదివారం తెల్లవారుజామున కాల్పుల ఘటన చోటు చేసుకుంది. ఓల్డ్ సిటీ స్కేర్‌లో మెమోరియల్ డే ఫెస్టివల్ నిర్వహించగా.. విచక్షన కోల్పోయిన ఓ యువకుడు కాల్పులు జరిపాడు. దాదాపు 1500 మంది పాల్గొన్న ఈ ఫెస్టివల్‌లో ఓ ఘర్షణ చోటు చేసుకుంది. ఈ క్రమంలోనే ఆ యువకుడు రెచ్చిపోయి, ఒక్కసారిగా కాల్పులు జరిపినట్టు తెలిసింది. ఈ ఘటనలో ఒక మహిళ అక్కడికక్కడే మృతి చెందగా, మరో ఏడుగురు తీవ్రంగా గాయపడ్డారని అధికారులు తెలిపారు. గాయపడిన వారిలో ఓ చిన్నారి కూడా ఉంది. మరోవైపు.. పెన్సిల్వేనియాలోని పిట్స్ టన్ వాల్‌మార్ట్‌లో, అలాగే కాలిఫోర్నియా రాష్ట్రం లాస్ ఏంజెల్స్‌లోని హై స్కూల్‌లోనూ కాల్పులు ఘటనలు చోటు చేసుకున్నాయి.