Imran Khan: పాకిస్తాన్ మాజీ ప్రధాని, పాకిస్తాన్ తెహ్రీక్ ఇ ఇన్సాఫ్(పీటీఐ) పార్టీ అధినేత ఇమ్రాన్ ఖాన్ కీలక ఆరోపణలు చేశారు. తమ పార్టీ ఇన్‌స్టాగ్రామ్ కు సంబంధించిన కీలక నేతలను కిడ్నాప్ చేశారని పేర్కొన్నారు. పీటీఐ పార్టీ ఇన్‌స్టాగ్రామ్ హెడ్ అత్తౌర్ రెహ్మాన్ గురువారం తెల్లవారుజామున లాహోర్ నుండి కిడ్నాప్ కు గురయ్యాడు. పాకిస్తాన్ ఆర్మీ చీఫ్ జనరల్ ఆసిమ్ మునీర్ పై వ్యతిరేకంగా ప్రచారం నిర్వహించిన తర్వాత ఫెడరల్ ఇన్వెస్టిగేషన్ ఏజెన్సీ, పోలీసుల సహకారంతో సోషల్ మీడియా వర్కర్స్, ముఖ్యంగా పీటీఐ పార్టీకి చెందిన వారిపై దేశవ్యాప్తంగా ఆపరేషన్ ప్రారంభించారు.
పార్టీ ఇన్‌స్టాగ్రామ్ లీడ్ అత్తౌర్ రెహ్మాన్ గురువారం ఉదయం లాహోర్ నుండి కిడ్నాప్ కు గురయ్యాడని గురువారం ఇమ్రాన్ ఖాన్ ట్విట్టర్ ద్వారా పేర్కొన్నాడు. మా సోషల్ మీడియా టీం నుంచి నిరంతరంగా కిడ్నాపులు జరుగుతున్నాయని, అత్తౌర్ 15 ఏళ్లుగా మాతో ఉన్నారని, శక్తివంతులు అన్ని చట్టాలను ఉల్లంఘిస్తున్నారని ఆరోపించారు. అతడిని విడుదల చేయాలని ఇమ్రాన్ ఖాన్ డిమాండ్ చేశారు. గత వారం పీటీఐ ‘హమారా పాకిస్తాన్’ అధినేత వకాస్ అమ్జాద్ ను కూడా ఇంటెలిజెన్స్ ఏజెన్సీలు జ్యుడీషియల్ కస్టడీలో చిత్రహింసలకు గురిచేశాయి. గత నెలలో సోషల్ మీడియాలో ఖాన్ ఫోకల్ పర్సన్ అజర్ ముష్వానీనీ కూడా అధికారులు అదుపులోకి తీసుకున్నారు. ఇమ్రాన్ ఖాన్ వీటన్నింటికి సైన్యమే కారణం అని ఆరోపించారు.
Read Also: Ramadan : ఇవాళ నెలవంక కనిపిస్తే రేపు రంజాన్ లేదంటే.. ఇక ఆ రోజే
ఈ రోజు పాకిస్తాన్ అడవిలా మారిందని, ఉన్నతాధికారుల నుంచి ఆర్డర్లు వస్తాయని, ఆ తరువాత కిడ్నాప్, చిత్రహింసలకు గురై, బూటకపు ఎఫ్ఐఆర్లు నమోదు అవుతున్నాయని ఇమ్రాన్ అన్నారు. పాకిస్తాన్ ‘బనానా రిపబ్లిక్’గా అవతరించిందని, చట్టబద్ధమైన పాలన జరగడం లేదని ఆరోపించారు. తనకు వ్యతిరేకంగా 140కి పైగా ఎఫ్ఐఆర్లు నమోదు కావడంపై అక్కడి ప్రభుత్వాన్ని, సైన్యాన్ని ఆయన నిందించారు.
ప్రస్తుతం ఆర్ఠిక సంక్షోభంతో కొట్టుమిట్టాడుతున్న పాకిస్తాన్ లో రాజకీయ అస్థిరత ఉంది. ఇమ్రాన్ ఖాన్ ను గద్దె దించిన తర్వాత ప్రధానిగా బాధ్యతలు చేపట్టిన షహబాజ్ షరీఫ్ ప్రభుత్వంపై ఇమ్రాన్ తిరుగుబాటు చేస్తున్నారు. అక్కడి సైన్యంపై ఆరోపణలు గుప్పిస్తున్నారు. దిగుమతి చేసుకున్న ప్రభుత్వం అని, దేశంపై ఇతర దేశాలు పెత్తనం సాగిస్తున్నారంటూ మండిపడ్డారు. దీంతో పాటు పలు సందర్భాల్లో భారత్ పై ప్రశంసలు కురిపించారు.