పాకిస్థాన్ మాజీ ప్రధాని ఇమ్రాన్ ఖాన్‌ను హత్య చేసేందుకు పథకం రచిస్తున్నారంటూ ఇటీవల రకరకాల పుకార్లు వ్యాపించాయి. ఆయన అధ్యక్ష పదవి కోల్పోవడంతో అబిమానులు పుట్టిస్తున్న పుకార్లుగా పాకిస్థాన్ కొట్టివేసింది. కానీ అది నిజమే అనేలా ఇమ్రాన్‌ఖాన్ ఇంట్లోనే గూఢచర్య ప్రయత్నం జరిగింది. ఈ మేరకు ఒక ఉద్యోగి ప్రధాని ఖాన్ గదిని శుభ్రం చేసే నిమిత్తం వచ్చి ఆయనపై నిఘా కోసం ఒక రహస్య పరికరాన్ని అమర్చడానికి యత్నించాడు.
పాక్ మాజీ ప్రధాని ఇమ్రాన్ ఖాన్ హత్యకు కుట్ర పన్నుతున్నారనే అనుమానంతో ఆయన ఇంట్లోని సిబ్బందిని భద్రతా దళాలు అదుపులోకి తీసుకొన్నాయి. ఈ విషయాన్ని పాక్‌లోని ఏఆర్‌వై న్యూస్ వెల్లడించింది. ఇమ్రాన్ బంగ్లాలోని బెడ్‌రూమ్‌లో రహస్య నిఘా పరికరాలు అమర్చేందుకు అక్కడ పనిచేసే సిబ్బంది డబ్బు తీసుకొన్నారు. కానీ, అక్కడే పనిచేసే మరో సిబ్బంది ఈ విషయాన్ని గ్రహించి భద్రతా సిబ్బందికి తెలియజేయడంతో.. నిందితుడిని అదుపులోకి తీసుకొని ఫెడరల్ పోలీసులకు అప్పజెప్పారు.
అంతే కాకుండా బనిగాలా పరిసర ప్రాంతాలలో భద్రతా ఏజెన్సీలు హైఅలర్ట్ ప్రకటించాయి. ఇమ్రాన్ ఖాన్ ప్రాణాలకు ముప్పు ఉందని పీటీఐకి చెందిన పలువురు పేర్కొంటున్నారు. ఈ విషయమై ప్రభుత్వంతో సహా సంబంధిత అన్ని ఏజెన్సీలకు సమాచారం ఇచ్చామని పీటీఐ నాయకుడు షహబాజ్ గిల్ తెలిపారు. పట్టుబడిన ఉద్యోగి ఈ రహస్య పరికరాన్ని అమర్చేందుకు డబ్బులు ఇచ్చారంటూ కొన్ని కీలక విషయాలు బయటపెట్టాడన్నారు. ఈ చర్య హీనమైనది అంటూ…ఇలాంటి సిగ్గుమాలిన చర్యలు మానుకోవల్సిందిగా షహబాజ్ గిల్ సూచించారు.
అంతకుముందు జూన్ 23న ఇమ్రాన్ ఖాన్‌కు ప్రాణహాని ఉందన్న వాదనలను ఆ దేశ అంతర్గత వ్యవహారాల శాఖ మంత్రి రాణా సనావుల్లా కొట్టిపారేశారు. ఇమ్రాన్ ఖాన్‌పై ఎటువంటి ముప్పు హెచ్చరికలు లేవని, ఇమ్రాన్ ఖాన్ ప్రధానిగా ఉన్నప్పుడు అతను అనుభవించిన స్థాయిలోనే భద్రత, ప్రోటోకాల్‌ను అందిస్తున్నామన్నారు.
పాకిస్తాన్ తెహ్రీక్-ఇ-ఇన్సాఫ్ (పీటీఐ) చీఫ్‌కు ఏదైనా జరిగితే, ఆ చర్యను పాకిస్తాన్‌పై దాడిగా పరిగణిస్తామని ఇమ్రాన్ ఖాన్ మేనల్లుడు హసన్ నియాజీ గతంలో అన్నారు.