Site icon NTV Telugu

Pakistan: కక్ష సాధిస్తున్న అసిమ్ మునీర్.. మాజీ ఐఎస్ఐ చీఫ్‌కు 14 ఏళ్లు జైలు శిక్ష..

Pakistan

Pakistan

Pakistan: పాకిస్తాన్‌లో అసిమ్ మునీర్ రాజ్యం నడుస్తోంది. పౌర ప్రభుత్వం ఉన్నప్పటికీ, అంతా మునీర్ కనుసన్నల్లోనే పాలన ఉంటోంది. ఇటీవల, పాక్ త్రివిధ దళాలకు అధిపతిగా ‘‘చీఫ్ ఆఫ్ డిఫెన్స్ ఫోర్సెస్(సీడీఎఫ్)’’ పదవిని స్వీకరించారు. దీని తర్వాత, పాకిస్తాన్ అధ్యక్షుడికి సమానంగా, అసిమ్ మునీర్ అధికారాలు ఉన్నాయి. ఏకంగా ఆ దేశ న్యూక్లియర్ బటన్ కూడా ఇతడి చేతిలోనే ఉంది. ఇదిలా ఉంటే, ప్రస్తుతం మునీర్ తన ప్రత్యర్థులపై కక్ష సాధిస్తున్నాడు.

పాకిస్తాన్ మాజీ ఇంటర్-సర్వీసెస్ ఇంటెలిజెన్స్ (ISI) డైరెక్టర్ జనరల్ లెఫ్టినెంట్ జనరల్ (రిటైర్డ్) ఫైజ్ హమీద్‌కు పాకిస్థాన్ సైనిక కోర్టు 14 ఏళ్ల జైలు శిక్ష విధించింది. రాజకీయ జోక్యం, అధికార దుర్వినియోగం, అధికారిక రహస్యాల చట్టం ఉల్లంఘించడం వంటి ఆరోపణలపై కోర్టు మార్షల్ చేసి, ఆయను దోషిగా నిర్ధారించారు. నిజానికి పాకిస్తాన్‌లో ఆర్మీ చీఫ్ తర్వాత, అత్యంత శక్తివంతమైన పోస్టుల్లో ఐఎస్ఐ చీఫ్ రెండోది. ఈ హోదాలో పనిచేసిన వ్యక్తికి ఆ దేశంలో అత్యున్నత గౌరవం దక్కుతుంది. సైన్యంలో పరపతి ఉంటుంది. కానీ ఫైజ్ హమీద్ కేసులో మాత్రం ఇది పూర్తిగా రివర్స్‌గా జరిగింది. పాక్ ఆర్మీ చట్టం కింద 15 నెలల పాటు హమీద్‌పై విచారణ జరిగింది. అయితే, ఆయన వల్ల సైన్యానికి ఏం నష్టం కలిగిందనే వివరాలు మాత్రం వెల్లడించలేదు. అతడికి అప్పీలు చేసుకునే హక్కు ఉంటుందని సైనిక కోర్టు చెప్పింది.

హమీద్, పాకిస్తాన్ మాజీ ప్రధాని ఇమ్రాన్ ఖాన్‌కు అత్యంత సన్నిహితుడు. ఇమ్రాన్ హయాంలోనే ఈయన ఐఎస్ఐ చీఫ్‌గా పదవి పొందారు. 2024లో ఇస్లామాబాద్ సమీపంలోని టాప్ సిటీ హౌసింగ్ ప్రాజెక్ట్‌కు సంబంధించిన అంతర్గత దర్యాప్తు తర్వాత అదుపులోకి తీసుకోబడ్డారు. అప్పటి నుంచి జైలులోనే ఉన్నాడు. గురువారం ఆయనపై నమోదైన కేసుల వివరాలు, విచారణ సమాచారాన్ని ప్రభుత్వం కానీ, సైన్యం కానీ వెల్లడించలేదు.

Read Also: శర్వానంద్ గ్యారేజీలోకి Lexus LM 350H లగ్జరీ కారు.. ధర వింటే మైండ్ బ్లాంక్ అవ్వాల్సిందే..!

కక్ష సాధిస్తున్న అసిమ్ మునీర్:

అసిమ్ మునీర్, ఫైజ్ హమీద్‌కు గతం నుంచే శత్రుత్వం ఉంది. ఇమ్రాన్ ఖాన్‌తో హమీద్‌కు రాజకీయ అనుబంధం గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. జూన్ 2019లో ఇప్పటి సీడీఎఫ్‌గా ఉన్న అసిమ్ మునీర్‌ను ఐఎస్ఐ చీఫ్‌గా తొలగించి, ఆ స్థానంలో ఫైజ్ హమీద్‌ను ఐఎస్ఐ చీఫ్‌గా ఇమ్రాన్ ప్రభుత్వం నియమించింది. మునీర్‌ను గుజ్రాన్‌వాలా కార్ప్స్ కమాండర్‌గా మార్చారు.

ఆ తర్వాత రాజకీయ పరిణామాల్లో ఇమ్రాన్ ఖాన్‌ను తొలగించి, షహబాజ్ షరీఫ్ ప్రధానిగా చేశారు. అసిం మునీర్ షరీఫ్ ప్రభుత్వ హయాంలో 2022లో పాక్ ఆర్మీ చీఫ్ అయ్యారు. 2025లో ఫీల్డ్ మార్షల్‌గా ప్రమోట్ చేయడంతో పాటు చీఫ్ ఆఫ్ డిఫెన్స్ ఫోర్సెస్ (CDF) గా కూడా నియమించారు. ఈ కోపం కారణంగానే మునీర్ ఇమ్రాన్ ఖాన్, హమీద్‌లను కేసులు మోపి జైలులో పెట్టించారనే ఆరోపణలు ఉన్నాయి.

Exit mobile version