రష్యా అధ్యక్షుడు వ్లాడిమిర్ పుతిన్ ఎంత హెచ్చరించినా… నార్డిక్ దేశాలు స్వీడన్, ఫిన్లాండ్ నార్త్ అట్లాంటిక్ ట్రిటీ ఆర్గనైజేషన్( నాటో) చేరడానికే మొగ్గు చూపాయి. తాజాగా బుధవారం నాటోలో సభ్యత్వం కోసం దరఖాస్తు చేసుకున్నాయి. ఈ రెండు దేశాలు దరఖాస్తు చేసుకున్నట్లు నాటో సెక్రటరీ జనరల్ జెన్స్ స్టోలెన్ బర్గ్ ధ్రువీకరించారు. నాటోలో చేరితే మాస్కో నుంచి తీవ్ర ప్రతిస్పందన ఉంటుందని రష్యా హెచ్చరించానా ఈ రెండు దేశాలు వెనక్కి తగ్గలేదు.
ఇదిలా ఉంటే స్వీడన్, ఫిన్లాండ్ నాటో చేరడాన్ని టర్కీ అధ్యక్షుడు తయ్యప్ ఎర్డోగాన్ తీవ్రంగా అభ్యంతరం తెలుపుతున్నాడు. నాటో చేరాలంటే మొత్తం 30 సభ్యదేశాల అనుమతి తప్పనిసరి. అయితే ఈ రెండు దేశాలు పూర్తిస్థాయిలో నాటోలో సభ్యదేశాలుగా మారడానికి ఎనిమిది నుంచి 12 నెలల సమయం పడుతుంది. రష్యా నుంచి ఎదురువుతున్న సవాళ్లను ఎదుర్కొనేందుకే ఈ రెండు దేశాలు నాటో చేరుతున్నట్లు తెలుస్తోంది.
రష్యా మాత్రం తమ సరిహద్దు దేశాల్లో నాటో విస్తరణ తమ ఉనికికి ముప్పు తెస్తుందని భావిస్తోంది. సరిహద్దు దేశాల్లో సైనిక మోహరింపు ఖచ్చితంగా మా ప్రతిస్పందనలను ప్రేరేపిస్తుందని పుతిన్ ఇప్పటికే వార్నింగ్ ఇచ్చాడు. నిజానికి ఉక్రెయిన్ తో రష్యా యుద్ధం కూడా నాటోలో చేరుతామనడం వల్లే ప్రారంభం అయింది. ఒకప్పుడు సోవియట్ యూనియన్ లో భాగంగా ఉన్న ఉక్రెయిన్ నాటోలో చేరితే… రష్యా సరిహద్దుల్లోనే అమెరికా దాని మిత్ర పక్షాల సైనిక మోహరింపు పెరుగుతుంది. దీని కారణంగానే రష్యా ఫిబ్రవరి 24 నుంచి ఉక్రెయిన్ పై యుద్ధం చేస్తోంది.
రష్యా, ఉక్రెయిన్ యుద్ధంలో చాలా వరకు ఉక్రెయిన్ నగరాలు ధ్వంసం అయ్యాయి. రాజధాని కీవ్ లో పాటు ఖార్కివ్, సుమి, మరియోపోల్ నగరాలపై రష్యా దాడుల వల్ల తీవ్రంగా దెబ్బతిన్నాయి. అయితే అమెరికా నాటో దేశాలు ఇస్తున్న ఆయుధాలు, సైనిక వ్యూహాలతో ఉక్రెయిన్ రష్యాకు ఎదురు నిలిచి నిలబడుతోంది.