ఎట్టకేలకు ట్విట్టర్‌ని కొన్నాడు ప్రపంచ కుభేరుడు ఎలాన్ మస్క్.. ట్విట్టర్ తన చేతికి రాగానే ముగ్గురు కీలక ఉద్యోగుల్ని తొలగించాడు. అయితే, వాళ్లకు పరిహారంగా 200 మిలియన్ అమెరికా డాలర్లు చెల్లిస్తున్నాడు. మన కరెన్సీలో అక్షరాల 16 వందల 46 కోట్ల రూపాయలు. గోల్డెన్ పారాచూట్ షరతులో భాగంగా ఈ మొత్తాన్ని చెల్లిస్తున్నారు. ఎలాన్ మస్క్ తొలగిస్తున్న ముగ్గురిలో ఇద్దరు భారత సంతతికి చెందిన వాళ్లు. ట్విట్టర్ సీఈవో పరాగ్ అగర్వాల్, లీగల్ పాలసీ హెడ్ విజయ గద్దేతో పాటు చీఫ్ ఫైనాన్షియల్ ఆఫీసర్ నెడ్ సీగల్‌ను సంస్థ నుంచి సాగనంపాడు. వీరి ముగ్గురికి ట్విట్టర్లో దాదాపు 12 లక్షల షేర్లు ఉన్నాయి. ఇందులో సగానికి పైగా షేర్లు విజయ గద్దేకు చెందినవే. వాటి విలువ దాదాపు 35 మిలియన్ల అమెరికా డాలర్లు. మన కరెన్సీలో చూస్తే… రెండు వందల 80 కోట్ల రూపాయలు.
Read Also: Tomato Prices Drop: దారుణంగా పడిపోయిన టమోటా ధర.. రైతుల లబోదిబో..
అలాగే, గోల్డెన్ పారాచూట్ షరతు ప్రకారం 119 మిలియన్ డాలర్లు విలువ చేసే షేర్లు పరిహారంగా ఇవ్వాల్సి ఉంటుంది. దీని ప్రకారం అగర్వాల్‌కు అత్యధికంగా 56 మిలియన్ అమెరికా డాలర్లు అందబోతున్నాయి. అంతేకాదు… వీరికి ఏడాది జీతంతో పాటు ఆరోగ్యపరమైన సదుపాయాలు కల్పించాల్సి ఉంటుంది. 2021లో అగర్వాల్ మూల జీతం 5 కోట్ల 12 లక్షల రూపాయలు. విజయ గద్దే జీతం దాదాపు 5 కోట్ల రూపాయలు. మొత్తంగా చూసుకుంటే… ట్విట్లర్‌ని వీడుతున్నందుకు విజయ గద్దేకు 617 కోట్ల రూపాయలకు పైగా పరిహారంగా అందబోతోంది. ఇక అగర్వాల్ 534 కోట్ల రూపాయలు, సీగల్ 526 కోట్ల రూపాయలు పరిహారంగా అందుకోబోతున్నారు.
తాను కొంటానంటూ ఎలాన్ మస్క్ ఓపెన్ ఆఫరిచ్చినప్పుడు ట్విట్టర్ నుంచి వ్యతిరేకత వ్యక్తమైంది. అయితే, మీకు ఇంతకు మించి మంచి బేరం రాదన్నాడు. ఎలాగైనా సొంత చేసుకోడానికి పావులు కదిపాడు. అటు ట్వి్ట్టర్ యాజమాన్యం కూడా పాయిజన్ పిల్ వ్యూహంతో మస్క్ వల నుంచి తప్పించుకునే ప్రయత్నం చేసింది. కానీ.. బుల్లి పిట్ట చివరికి మస్క్ వల్లో పడింది. డీల్ కుదిరింది. కానీ… మస్క్ ప్లేట్ ఫిరాయించాడు. దీంతో సీన్ రివర్స్ అయ్యింది. ట్విట్టర్ కోర్టుకెక్కింది. దీంతో ట్విట్టర్‌తో డీల్ పూర్తి చేసుకోడానికి ఎలాన్ మస్క్‌కు కోర్టు డెడ్‌లైన్ పెట్టింది. దీంతో గత్యంతరం లేని పరిస్థితుల్లో ట్విట్టర్‌ని కొన్నాడు. కాగా, ఎలాన్ మస్క్‌కు చెందిన ఎక్స్ హోల్డింగ్స్‌లో విలీనానికి 44 బిలియన్ డాలర్లకు ఒప్పందం కుదిరినట్టు సెక్యూరిటీ అండ్ ఎక్స్‌చేంజ్ కమిషన్‌కు తెలిపింది ట్విట్టర్.