Drew Barrymore On Alcohol: ఒకప్పుడు ఒకటో నంబర్ చిన్నదానిలా ముద్దుగా బొద్దుగా ఉన్న హాలీవుడ్ నటి డ్రూ బ్యారీమోర్ ఇప్పుడు పీలగా పీక్కుపోయిన మొహంతో కనిపిస్తోంది. కారణం ఏమిటంటే, ఒకప్పుడు అమ్మడు రాత్రి మందుకొడితే మధ్యాహ్నానికో లేదా మరోమారు నింగిలో చుక్కలు పొడిచే సమయానికో లేచేది. కొన్నిసార్లు అలా తాగుతూనే ఎప్పుడు నిద్ర వస్తే అప్పుడు తాగుడుకు కామా పెట్టేది. నిద్రలేస్తే మళ్ళీ మామూలే అన్నట్టు మందులోనే చిందులు వేసేది. అలా మందు భామగా మారిన డ్రూ బ్యారీమోర్ ఆ మహమ్మారి నుండి బయటపడటం వల్ల ఇప్పుడు ఎంతో ఆరోగ్యంగా ఉన్నానని చెబుతోంది. తాను నిర్వహిస్తున్న ‘డ్రూ’ మేగజైన్ లో తన మనోభావాలను అభిమానుల కోసం పంచుకుంది బ్యారీమోర్.
ఏడేళ్ళ ప్రాయంలోనే స్టీవెన్ స్పీల్ బెర్గ్ ‘ఇటి: ది ఎక్స్ట్రా టెరెస్ట్రియల్’లో గెర్టీ టేలర్ పాత్రలో భలేగా ఆకట్టుకుంది డ్రూ. ఆమె తండ్రి జాన్ డ్రూ బ్యారీమోర్ కూడా మేటి నటుడుగా హాలీవుడ్ లో రాణించారు. ఆ తండ్రికి తగ్గ కూతురుగా డ్రూ సైతం చిత్రసీమలో తనదైన బాణీ పలికిస్తూ కేవలం నటిగానే కాదు నిర్మాతగానూ తన అభిరుచిని చాటుకుంది. అలాంటి డ్రూ ఉన్నట్టుండి మద్యానికి బానిస కావడం ఎవరికీ అంతుపట్టలేదు. కానీ, ఇప్పుడు తాను దానిని జయించానని గర్వంగా చెబుతోంది డ్రూ బ్యారీ మోర్. 2020 నుండి డ్రూ నిర్వహిస్తోన్న ‘ద డ్రూ బ్యారీ మోర్ షో’ భలేగా అలరిస్తోంది. ఈ యేడాది డ్రూ నటించిన ‘స్క్రీమ్’ రిలీజయింది. ఈ హారర్ మూవీ సక్సెస్ చూసింది.
ఇప్పటికి రెండు సంవత్సరాలుగా తాను మందు ముట్టకపోవడం ఓ ఘనకార్యంగానే భావిస్తున్నాననీ, నిజానికి ఇది సెలబ్రేట్ చేసుకోవలసిన సమయమనీ డ్రూ అటోంది. కలగాపులగంగా దెయ్యాలతో నిండిన మనసు ఇప్పుడు ఎంతో ప్రశాంతంగా ఉందనీ డ్రూ బ్యారీ మోర్ చెబుతోంది. తన మనసుకు నచ్చి న పని చేసుకుంటూ పోయే డ్రూ త్వరలోనే ఆల్కహాల్ నుండి బయటపడితే ఎలాంటి లాభాలు ఉంటాయో తెలిపే కథతో సినిమా తీసినా తీయవచ్చునని సన్నిహితులు అంటున్నారు. మరి డ్రూ ఏం చేస్తుందో చూద్దాం.