కరోనా మహమ్మారి విజృంభణ కారణంగా అంతర్జాతీయ ప్రయాణాలు పూర్తిగా రద్దు అయ్యాయి.. కొన్ని ప్రత్యేక విమాన సర్వీసులకు మాత్రమే ఆయా దేశాలు అనుమతి ఇస్తూ వచ్చాయి… ఇక, కోవిడ్ కేసులు తగ్గుముఖం పట్టడంతో.. ఒక్కో దేశం అంతర్జాతీయ ప్రయాణికులకు అనుమతి ఇస్తూ వస్తున్నాయి.. తాజాగా వివిధ దేశాల ప్రజలకు సింగపూర్ ప్రభుత్వం గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది.. నవంబరు 29వ తేది నుంచి ఇండోనేషియా, భారత పౌరులు సింగపూర్‌కి ప్రయాణం చేయవచ్చు.. అంతేకాదు.. డిసెంబరు 6వ తేదీ నుంచి సౌదీ పౌరులకు కూడా అనుమతులు ఇస్తూ నిర్ణయం తీసుకుంది.. అయితే, రెండు డోసుల వ్యాక్సిన్ తీసుకున్న పౌరులు మాత్రమే తమ దేశానికి రావచ్చంటూ సింగపూర్ ప్రభుత్వం ఆదేశాలు జారీ చేసింది. ఇక పెద్దవాళ్లతో ప్రయాణం చేసే పన్నెండేళ్లలోపు పిల్లలు వ్యాక్సిన్ తీసుకోపోయినా తమ దేశంలోకి రావచ్చని సింగపూర్ స్పష్టం చేసింది. అంటే వ్యాక్సిన్ తీసుకున్నవారికి ఎలాంటి క్వారంటైన్ లేకుండా దేశంలోకి అనుమతి ఇవ్వనున్నారు అధికారులు.