Ivanka Trump: అమెరికా మాజీ అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ కూతురు ఇవాంకా ట్రంప్ ఇజ్రాయిల్‌ని సందర్శించారు. అక్టోబర్ 7న ఇజ్రాయిల్‌పై హమాస్ దాడి చేసింది. ఈ దాడిలో బాధితులను ఇవాంకా ట్రంప్ కలుసుకున్నారు. భర్త జారెడ్ కుష్నర్‌తో కలిసి బాధితులను పరామర్శించారు. ఇజ్రాయెల్‌లోని క్ఫర్ అజా కిబ్బట్జ్‌ను గురువారం సందర్శించారు. ఇజ్రాయిల్ ప్రతినిధుల సభ స్పీకర్ అమీర్ ఒహానా ఆధ్వర్యంలో వీరు పర్యటించారు. హమాస్ చేతిలో ఇప్పటికీ బందీలుగా ఉన్నవారు క్షేమంగా తిరిగి రావాలని ప్రార్థిస్తానని ఆమె తెలిపారు.
అక్టోబర్ 7న గాజా సరిహద్దుల్లోని ఇజ్రాయిల్ ప్రాంతాలపై హమాస్ మిలిటెంట్లు దాడి చేశారు. ఈ దాడిలో 1200 మంది ఇజ్రాయిలీలను హతమార్చారు. మరో 240 మందిని బందీలుగా గాజాలోకి పట్టుకెళ్లారు. అప్పటి నుంచి ఇజ్రాయిల్ గాజా ప్రాంతంపై దాడులు చేస్తోంది. హమాస్ పూర్తిగా నేలమట్టం అయ్యే వరకు యుద్ధాన్ని ఆపేది లేదని ఇప్పటికే ఇజ్రాయిల్ ప్రకటించింది. గాజానే కాకుండా వెస్ట్ బ్యాంక్‌లోని తీవ్రవాద లక్ష్యాలపై ఇజ్రాయిల్ ఆర్మీ దాడులు చేస్తోంది. ఇప్పటి వరకు ఇజ్రాయిల్ దాడుల్లో 20,057 మంది పాలస్తీనియన్లు మరణించారు.