Donald Trump: అమెరికా అధ్యక్షుడిగా బాధ్యతలు చేపట్టినప్పటి నుంచి డొనాల్డ్ ట్రంప్ సంచలన నిర్ణయాలతో దూసుకుపోతున్నారు. ముఖ్యంగా సుంకాల విధింపుతో కెనడా, మెక్సికో, చైనాలను దెబ్బకొట్టాడు. ట్రంప్ గెలిచిన తర్వాతే, కెనడాను టార్గెట్ చేస్తూ సంచలన వ్యాఖ్యలు చేశారు. కెనడా అమెరికాలో ‘‘51వ రాష్ట్రం’’ కావాలని, ఆ దేశ ప్రధాని జస్టిన్ ట్రూడో గవర్నర్‌గా ఉండాలంటూ సంచలన వ్యాఖ్యలు చేశారు. అయితే, ఈ వ్యాఖ్యలపై ట్రూడో అభ్యంతరం తెలిపారు.
ఇదిలా ఉంటే, మరోసారి ట్రంప్ కెనడాని టార్గెట్ చేస్తూ విరుచుకుపడ్డారు. గురువారం మరోసారి కెనడా 51వ రాష్ట్రంగా స్వాధీనం చేసుకోవాలంటూ సూచించారు. కెనడాపై అమెరికా హాకీ జట్టు విజయం సాధించాలని కోరారు. ట్రంప్ వ్యాఖ్యలతో అమెరికా బోస్టన్ నగరంలోని టోర్నమెంట్ ఫైనల్‌కి ముందు ఉద్రిక్తతలు తారాస్థాయికి చేరాయి. శనివారం మాంట్రియల్‌లో జరిగిన జరిగిన నాలుగు దేశాలు-అమెరికా, కెనడా, స్వీడన్, ఫిన్లాండ్ టోర్నీలో అమెరికా జాతీయ గీతం పాడుతున్న సమయంలో కెనడా అభిమానులు బూతులతో రెచ్చిపోయారు.
ఉదయం ప్రాక్టీస్ తర్వాత ట్రంప్ అమెరికా జట్టుకు ఫోన్ చేసి శుభాకాంక్షలు తెలిపారు. ట్రంప్ మ్యాచ్‌ని చూస్తారని వైట్‌హౌజ్ తెలిపింది. ‘‘చాలా తక్కువ పన్నులు మరియు చాలా బలమైన భద్రతతో, ఏదో ఒక రోజు, బహుశా త్వరలో, మన ప్రియమైన, చాలా ముఖ్యమైన, 51వ రాష్ట్రంగా మారే కెనడాపై ఈ రాత్రి విజయం వైపు వారిని ప్రోత్సహించాను’’ అని ట్రంప్ సోషల్ మీడియాలో పోస్ట్ చేశారు. అంతకుముందు ట్రంప్ వాషింగ్టన్‌లో అమెరికా గవర్నర్‌ల సమావేశంలో ప్రసగింస్తూ, మ్యాచ్‌కి స్వయంగా హాజరుకాలేకపోతున్నందకు బాధపడుతున్నట్లు చెప్పారు. ‘‘ గవర్నర్ ట్రూడో మాతో చేరాలనుకుంటే, ఆయనకు స్వాగతం పలుకుతాం’’ అని ట్రూత్ సోషల్‌లో ట్రంప్ చెప్పారు. ఫిన్లాండ్, స్వీడన్‌లను ఓడించి అమెరికా, కెనడా ఫైనల్ చేరుకున్నాయి. ప్రస్తుతం మ్యాచ్ రెండు దేశాల మధ్య అగ్గిరాజేసింది.