Donald Trump: ఇజ్రాయిల్, ఇరాన్ మధ్య దాడులు, ప్రతి దాడుల మధ్య మిడిల్ ఈస్ట్ సంక్షోభం ముదిరింది. శుక్రవారం ‘‘ఆపరేషన్ రైజింగ్ లయన్’’ పేరుతో ఇజ్రాయిల్, ఇరాన్ అణు కార్యక్రమాలపై విరుచుకుపడింది. ఇదే కాకుండా ఇరాన్ మిలిటరీ టాప్ జనరల్స్‌తో పాటు అణు శాస్త్రవేత్తలను హతమార్చింది. దీనికి ప్రతీకారంగా ఇరాన్, ఇజ్రాయిల్ లోని ప్రధాన నగరాలైన జెరూసలెం, టెల్ అవీవ్, హైఫా నగరాలపై వందలాది క్షిపణులతో విరుచుకుపడింది.
ఈ నేపథ్యంలో అమెరికా ఆస్తులపై దాడి జరిగితే అమెరికా దళాలు ఇరాన్‌ని నాశనం చేస్తానని ట్రంప్ హెచ్చరించారు. ఈ వ్యాఖ్యల తర్వాత ఇజ్రాయిల్, ఇరాన్ మద్య త్వరలో శాంతి సాధించబడుతుందని ట్రంప్ అన్నారు. మరోసారి ట్రంప్ భారత్-పాకిస్తాన్ మధ్య తాను మధ్యవర్తిత్వం చేసి, ఒప్పందం కుదుర్చానని అన్నారు. భారత్-పాకిస్తాన్ విషయంలో తాను చేసినట్లే, ఇజ్రాయిల్-ఇరాన్ మధ్య ఒప్పందానికి రావాలని, వచ్చేలా తాను చేస్తానని అన్నారు. అయితే, భారత్ మాత్రం ‘‘ఆపరేషన్ సిందూర్’’ నిలిపేయడంలో అమెరికా పాత్ర లేదని చెప్పింది. పాకిస్తాన్ డీజీఎంఓ భారత్‌కి ఫోన్ చేసి ఘర్షణ ఆపాలని కోరడంతో సిందూర్‌ని తాత్కాలికంగా నిలిపేశామని భారత సైన్యం చెప్పింది.
‘‘ఇరాన్, ఇజ్రాయిల్ ఒక ఒప్పందం చేసుకోవాలి. నేను భారత్ మరియు పాకిస్తాన్‌ల మధ్య ఒప్పందం కుదుర్చిన విధంగా. ఆ సందర్భంలో అమెరికాతో వాణిజ్యాన్ని ఉపయోగించి ఇద్దరు అద్భుతమైన నాయకులతో చర్చలలో హేతుబద్ధత, సమన్వయం వివేకం తీసుకురావడం ద్వారా ఘర్షణ ఆపేశాను. అలాగే, నా మొదటి పదవీ కాలంలో సెర్బియా-కొసావో మధ్య ఇలాగే చేశా. ఈ రెండు దేశాల మధ్య యుద్ధాన్ని ఆపాను. బైడెన్ కొన్ని తెలివితక్కువ నిర్ణయాలతో దీర్ఘకాలిక అవకాశాలను దెబ్బతీశారు. కానీ నేను వాటిని మళ్లీ పరిష్కరిస్తాను’’ అని తన ట్రూత్ సోషల్ అకౌంట్‌లో రాశారు. ఈజిప్ట్-ఇథియోపియా మధ్య నైలు నది ఆనకట్టపై ఘర్షణ ఉందని, తన జోక్యంతో శాంతి నెలకుందని అన్నారు. ఇప్పుడు అదే విధంగా, ఇజ్రాయిల్ ఇరాన్ మధ్య శాంతి కుదురుతుందని చెప్పారు.
