Site icon NTV Telugu

Corona Virus: బీ అలర్ట్.. బీఎఫ్-7 వేరియంట్ రూపంలో మళ్లీ కోరలు చాస్తున్న కరోనా

Corona Virus

Corona Virus

Corona Virus: ఒమిక్రాన్ వేరియంట్‌తో ముగిసిపోయిందని భావించిన కరోనా కొత్త రూపు సంతరించుకుంది. బీఎఫ్-7 అనే వేరియంట్‌తో మళ్లీ తన ఉనికిని చాటుకుంటోంది. ఈ వేరియంట్ అత్యంత వేగంగా ఒకరి నుంచి మరొకరికి వ్యాప్తి చెందుతుందని పరిశోధకులు హెచ్చరిస్తున్నారు. తొలుత చైనాలో వెలుగు చూసిన ఈ వేరియంట్‌ చాలా వేగంగా అమెరికా, యూకే, ఆస్ట్రేలియా, బెల్జియం వంటి దేశాలకు వ్యాపిస్తోంది. దీని వ్యాప్తిని నిరోధించే ముందు జాగ్రత్త చర్యలు తీసుకోకపోతే అది డామినెంట్‌ వేరియంట్‌గా మారుతుందని చైనాకు చెందిన గ్లోబల్‌టైమ్స్‌ పత్రిక హెచ్చరికలు జారీ చేసింది.

Read Also: Diwali Date: 24నా..? 25వ తేదీనా? దీపావళి పండుగపై అయోమయం

బీఎఫ్-7 కరోనా సబ్ వేరియంట్‌ను మన దేశంలో కూడా గుర్తించారు. గుజరాత్ బయోటెక్నాలజీ రీసర్చ్ సెంటర్ ఈ వేరియంట్‌ను గుర్తించింది. ఈ వేరియంట్‌కు సంబంధించి ప్రపంచ ఆరోగ్య సంస్థ (డబ్ల్యూహెచ్‌వో) కూడా హెచ్చరికలు జారీ చేసింది. దీని వ్యాప్తిని నిరోధించాల్సిన అవసరం ఉందని సూచించింది. ఇప్పటికే చైనాలో బీఎఫ్-7 కేసులు పెరుగుతుండటంతో పలు చోట్ల లాక్‌డౌన్ విధిస్తున్నారు. కాగా ఈ వేరియంట్‌కు సంబంధించి వచ్చే రెండు మూడు వారాలు కీలకమని నేషనల్ టెక్నికల్ అడ్వైజరీ గ్రూప్ ఆఫ్ ఇమ్యునైజేషన్ (ఎన్‌టీఏజీఐ) ఛైర్మన్ డాక్టర్ ఎన్‌కె అరోరా అభిప్రాయపడ్డారు. కరోనా ఇంకా పూర్తిగా అంతరించలేదని.. ప్రపంచంలోని వివిధ ప్రాంతాలలో కొత్త వేరియంట్‌లు బయటపడుతున్నాయని.. వాటి నుంచి ప్రజలు క్షేమంగా ఉండలేరని తెలిపారు. మున్ముందు ముఖ్యమైన పండగలు ఉన్నందున కొన్ని రోజులు జాగ్రత్తగా ఉండాలని అరోరా సూచించారు. అటు బీఏ 5.1.7 అనే సబ్ వేరియంట్‌ను కూడా చైనాలో గుర్తించారు.

Exit mobile version