చిన్న వైరస్ ప్రపంచాన్నే వణికిస్తోంది. తగ్గిపోయిందనుకుంటే మళ్ళీ మరో వేరియంట్ రూపంలో ముంచుకొచ్చి ముప్పుతిప్పలు పెడుతోంది. కరోనా మహమ్మారి రెండేళ్లుగా ప్రపంచాన్ని పట్టి పీడిస్తోంది. అయితే, త్వరలోనే దీని పీడ విరగడ అవుతుందని కొందరు అంచనా వేస్తున్నారు. కానీ… వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్ మాత్రం కరోనా విషయంలో అప్రమత్తంగా ఉండాల్సిందేనంటోంది. ఇంతకీ కరోనా ముప్పు ముగిసినట్టా? కాదా? మున్ముందు రాబోయే వేరియంట్ల గురించి WHO చెబుతున్నదేమిటి?
రోజులు… వారాలు… నెలలు… దాటి ఏకంగా రెండేళ్లను మింగేసింది కరోనా వైరస్. పిల్లల్ని స్కూళ్లకు దూరం చేసింది. ఉద్యోగులను ఇళ్లకు పరిమితం చేసింది. అనేక మంది ప్రాణాలు తీసింది. చికిత్స, ఔషధాల కోసం పర్సుల్ని ఖాళీ చేసింది. కంపెనీలు మూతపడ్డాయి. ఉద్యోగులు రోడ్డున పడ్డారు. ఇదంతా ఏ ఒక్క దేశానికి… ఖండానికో పరిమితం కాలేదు. కరోనా విరిసిన పంజాకు యావత్ ప్రపంచం గజగజలాడింది. ఇప్పటికీ పలు దేశాల్లో పరిస్థితులు దారుణంగానే ఉన్నాయి. కరోనా రోగుల వల్ల ఆస్పత్రులపై ఒత్తిడి కొనసాగుతూనే ఉంది.
ఎప్పటికప్పుడు తన రూపాన్ని మార్చుకుంటూ దాడి చేస్తోంది కరోనా వైరస్. డెల్టా వేరియంట్ వల్ల అత్యధిక మంది ఆస్పత్రులపాలయ్యారు. అయితే… తర్వాత వెలుగు చూసిన ఒమిక్రాన్ వేరియంట్ వల్ల అత్యధిక మంది ఇన్ఫెక్షన్ భారినపడ్డారు. రెండు డోసుల వ్యాక్సిన్ తీసుకున్న వాళ్లు సైతం ఒమిక్రాన్ నుంచి తప్పించుకోలేకపోయారు. మన దేశంలో కరోనా థర్డ్ వేవ్‌కు కూడా ఒమిక్రాన్ వేరియంటే కారణమంటున్నారు. అయితే… డెల్టాతో పోల్చితే ఆరోగ్యంపై ఒమిక్రాన్ చూపించే ప్రభావం చాలా తక్కువ. అందువల్లే ఒమిక్రాన్ వల్ల కరోనా సోకిన వాళ్లలో అధిక శాతం ఆస్పత్రుల్లో చేరాల్సిన అవసరం రాలేదు.
కరోనా ఇన్ఫెక్షన్‌కు ఒమిక్రాన్ వేరియంట్ సహజసిద్ధమైన వ్యాక్సిన్ అని కొంత మంది వ్యాఖ్యానిస్తున్నారు. ప్రపంచానికి కరోనా పీడ విరగడైనట్టేనని విశ్లేషిస్తున్నారు కొందరు నిపుణులు. కానీ… కరోనా విషయంలో అప్రమత్తంగా ఉండాలని, ముప్పు ఇంకా తొలగిపోలేదంటోంది వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్ WHO. కరోనా వైరస్ వేరియంట్లలో ఒమిక్రాన్ చివరిది కాదంటోంది WHO. మున్ముందు మరింత ప్రమాదకరమైన వేరియంట్లు పుట్టుకొచ్చే ప్రమాదం లేకపోలేదని హెచ్చరిస్తోంది.
కరోనా కొత్త వేరియంట్లను వైల్డ్‌కార్ట్ ఎంట్రీగా అభివర్ణించింది WHO. ఒమిక్రాన్ ఉపవేరియంట్ BA-1 కంటే కొత్తగా వెలుగు చూసిన ఉపవేరియంట్ BA-2 మరింత వేగంగా వ్యాపిస్తోంది. అయితే… కొత్త ఇన్‌ఫెక్షన్లకు BA-2 కారణమా? కాదా? అనే విషయంలో పరిశోధనలు కొనసాగిస్తున్నట్టు చెబుతోంది WHO. అంతేకాదు… ఇప్పటికే ఒమిక్రాన్ వచ్చిన వాళ్లకు BA-2 సోకుతుందా అనే విషయంలో కూడా ఇంకా స్పష్టత లేదంటోంది.
కరోనా వైరస్ గురించి మనకు చాలా విషయాలు తెలిసినా… ఇప్పటికీ అన్నీ విషయాలు తెలియదనే విషయాన్ని మర్చిపోకూడదంటోంది WHO. కరోనా వైరస్ మార్పు చెందుతూనే ఉందని తెలిపింది. ఒమిక్రాన్ BA-2 వేరియంట్ వల్ల తీవ్రమైన ప్రభావం ఉన్న దాఖలాలు లేవంటోంది. అయితే, ఒమిక్రాన్ తర్వాత మరో వేరియంట్ వస్తే అది దీనికంటే ఎన్నో రెట్లు శక్తివంతమైనది కావచ్చనే ఆందోళన వ్యక్తం చేసింది WHO. వాటిని ఎదుర్కోవడం వ్యాక్సినేషన్… నివారణ చర్యలతోనే సాధ్యమని తెలిపింది. మొత్తానికి ప్రపంచానికి కరోనాతో ముప్పు ఇంకా తొలగిపోలేదంటోంది వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్. మహమ్మారి విషయంలో అప్రమత్తంగా ఉండాల్సిందేని హెచ్చరిస్తోంది.