ఉక్రెయిన్- రష్యా యుద్ధం సరికొత్త ప్రపంచ మార్పులకు దారితీస్తోంది. అమెరికా, రష్యా మధ్య పాత పగలు ఈ సంక్షోభంతో మరోసారి బయటపడ్డాయి. ప్రస్తుత పరిస్థితి ప్రచ్ఛన్న యుద్ధ రోజులను తలపిస్తోంది. ఈ క్రమంలో అమెరికా, రష్యా అతి పెద్ద దేశాలైన చైనా, భారత్‌ను పూర్తిగా తమ వైపు తిప్పుకునేందుకు తీవ్రంగా ప్రయత్నిస్తున్నాయి.
ఉక్రెయిన్‌పై రష్యా దాడికి వ్యతిరేకంగా మార్చి 2న ఐక్యరాజ్య సమితి సాధారణ సభ ప్రవేశ పెట్టిన తీర్మానానికి 141 దేశాలు అనుకూలంగా ఓటు వేశాయి. చైనా, భారత్ సహా 35 దేశాలు గైర్హాజరయ్యాయి. అంతేకాదు, యుద్ధ నేపథ్యంలో ముందుకు వచ్చిన అన్ని తీర్మానాలలో అవి తమ తటస్థ వైఖరిని కొనసాగించాయి. రష్యా, ఉక్రెయిన్‌తో గల వ్యూహాత్మక సంబంధాలు దెబ్బతిన కూడదనే అవి తటస్థ వైఖరి తీసుకున్నాయి. ఉదాహరణకు, రెండు దేశాలలో భారతీయ విద్యార్థులు పెద్ద సంఖ్యలో ఉన్నారు. యుద్ధ ప్రాంతం నుంచి విద్యార్థుల తరలింపులో నో వార్ జోన్ కోసం రష్యాతో తన స్నేహాన్ని భారత్ ఉపయోగించాల్సి వచ్చింది. అలాగే రష్యా తక్కువ ధరలకు భారత్‌కు చమురు సరఫరా చేస్తోంది.
రష్యా, బ్రిటన్ విదేశాంగ మంత్రులు గత వారం న్యూ ఢిల్లీ వచ్చారు. ద్వైపాక్షిక వ్యాపార, వాణిజ్యం మునపటిలా కొనసాగేలా చూసేందుకు ప్రస్తుత పరిణామాలపై వారు తమ వాదనను భారత్‌కు వినిపించటమే ఈ పర్యటనల ప్రధాన ఉద్దేశం. ఎప్పటిలాగే ఈ చర్చలకు సంబంధించి తక్కువగా చెప్పి ..ఎక్కువ దాచిపెడుతూ దౌత్య ప్రకటనలు వెలువడ్డాయి.
అదే సమయంలో భారత్‌లో పర్యటించిన అమెరికా డిప్యూటీ నేషనల్ సెక్యూరిటీ అడ్వైజర్ (ఉప జాతీయ భద్రతా సలహాదారు) బహిరంగంగానే భారత్‌ను బెధిరించే ప్రయత్నం చేశారు. వాస్తవాధీన రేఖను చైనా ఉల్లంఘిస్తే రష్యా రక్షిస్తుందా.. అని ప్రశ్నించటం నిజంగా పెద్ద బెధిరింపే. ఇటీవల కాలంలో భారత్‌పై మరో దేశం చేసిన అత్యంత బహిరంగ బెదిరింపుగా ఈ ప్రకటనను చూడాలి. ఇది ఓ సార్వభౌమ దేశంపై మరో దేశం జరిపిన దురాక్రమణ కన్నా తక్కువ కాదు. ప్రపంచానికి తానే పెద్దన్నగా ఉండాలని, తాను గీసిన గీతను ఏ దేశం జవ దాటకూడదనే దాపి దశాబ్దాల విదేశాంగ విధానానికి ఈ ప్రకటన అద్దంపడుతుంది.
ఇతర దేశాల సొంత వ్యవహారలలో తల దూర్చటం అమెరికాకు కొత్త కాదు. అనేక యుద్ధాలలో ప్రత్యక్షంగా పాల్గొంది. అలాంటి ప్రతిసారి ఏదో ఒక కారణాన్ని ప్రపంచానికి చూపించే ప్రయత్నం చేస్తుంది. ఉదాహరణకు మానవ హక్కులు..ప్రజాస్వామ్య పరిరక్షణ. అణ్వాయుధ తయారీ వంటివి. నిజంగా అమెరికాకు ప్రపంచం మీద అంత ఆందోళన చెంది ఉంటే గత వంద సంవత్సరాలలో అది 40 యుద్ధాలలో ఎలా పాల్గొంటుంది? దానికి బదులు ఓ పెద్దన్నగా వాటిని నివారించి ఉండాలి. కానీ, అమెరికా ఎప్పుడూ అలా చేయదు..దానికి తన ఆర్థిక, రాజకీయ ప్రయోజనాలే ముఖ్యం.
తన వ్యూహాత్మ స్వీయ ప్రయోజనాల కోసం వేరొక సార్వభౌమ దేశం అంతరంగిక వ్యవహారాల్లో వేలు పెట్టటం అమెరికాకు అలవాటుగా మారింది. ఆ దేశాల విషయంలో అత్యంత దూకుడుగా వ్యవహరిస్తుంది. అలాంటి ఎన్నో సందర్భాలలో భారత్ వంటి అనేక దేశాలు అందులో జోక్యం చేసుకోలేదు. కానీ తమ సార్వభౌమత్వాన్నే ప్రశ్నించే పరిస్థితి వస్తే ఊరకే ఉండవు కదా.
అమెరికా పెట్టుబడిదారీ భావజాలం.. దాని విధానాలు పాలు నీళ్లలా కలిసిపోతాయి. పాలసీ లాబీయింగ్ నుంచి ప్రపంచ మార్కెట్‌పై గుత్తాధి పత్యం వరకు అన్నీ తనకే కావాలనటం అమెరికా అత్యాశ. ఆహారం, దుస్తుల నుంచి ఆయుధ వ్యాపారం వరకు అన్ని రంగాలలో తమ కంపెనీలు మాత్రమే ఉండాలనే కోరుకునే దురాశ దానిది. తాజా ప్రపంచ పరిణామాలతో, వివిధ దేశాలపై అది విధించిన ఆంక్షలతో మొదటికే మోసం వచ్చే పరిస్థితి ఏర్పడింది. ప్రపంచ వాణిజ్యంలో డాలర్‌కు ప్రత్యామ్నాయ కరెన్సీపై ప్రయత్నాలు ఇప్పటికే వేగవంతమయ్యాయి. కాబట్టి డాలర్ ఆధారిత ప్రపంచ ఆర్థిక వ్యవస్థలు, మార్కెట్లపై తన ప్రభావాన్ని కోల్పోవడం గురించి ఆమెరికా ఇప్పుడు ఆందోళన చెందడంలో ఆశ్చర్యం లేదు. ప్రపంచ వాణిజ్యంపై తన ప్రభావాన్ని , నియంత్రణను కోల్పోకుండా ఉండేందుకు ఇప్పుడు దౌత్యం రంగులు అద్దుతోంది.
చైనా, భారత్‌తో అమెరికా, రష్యా (నాటి సోవియట్ యూనియన్) గత సంబంధాల మూలాలను పరిశీలిస్తే వాటి ప్రస్తుత వైఖరికి కారణాలు బోధపడతాయి. ఆఫ్ఘనిస్తాన్‌లో సోవియట్ వ్యతిరేక జిహాద్ చైనా, అమెరికాలు ఒకే పడవలో ప్రయాణించేలా చేసింది. తియనాన్మెన్ స్వేర్ ఊచకోత చరిత్ర ఉన్నప్పటికీ చైనా వినియోగ ప్రపంచంలోకి అడుగుపెట్టింది. వాస్తవానికి, 1998లో అణు పరీక్ష జరిగినప్పుడు ఈ రెండు దేశాలు భారతదేశానికి వ్యతిరేకంగా కఠిన చర్యలు తీసుకున్నాయి. ఇందుకోసం అవి భద్రతా మండలిలో తమ శాశ్వత సభ్యత్వాన్ని ఉపయోగించుకున్నాయి. మరోవైపు, పూర్వపు సోవియట్ యూనియన్, భారతదేశం సుదీర్ఘ కాలం స్నేహ సంబంధాలు పంచుకున్నాయి. ఇరు దేశాల వారి రాజకీయ సిద్ధాంతాలు భిన్నమైనప్పటికీ మంచి ద్వైపాక్షిక సంబంధాలు కలిగి ఉన్నాయి. ప్రస్తుత రష్యా కూడా భారతదేశానికి నమ్మకమైన మిత్రదేశంగా కొనసాగుతోంది. భారత్ అనుసరిచే ప్రాంతీయ వ్యూహాలకు రాజకీయ మద్దతు ఇవ్వటంతో పాటు స్థిరమైన ద్వైపాక్షిక వాణిజ్య భాగస్వామ్యం, సైనిక సాయం చేస్తూ పాత స్నేహానికి కట్టుబడింది.
మరోవైపు, భారత్ ఇప్పుడు ప్రాంతీయ శక్తిగా ఎదిగే క్రమంలో ఉంది. ఎవరికీ తల వంచిన చరిత్ర భారత్‌కు లేదు. రాజకీయ, సైద్ధాంతిక విభేదాలన్నా అన్ని దేశాలతో స్నేహ సంబంధాలు కొనసాగిస్తోంది. పెరుగుతున్న చైనా దూకుడు అడ్డుకోవటానికి అమెరికాతో కూడా స్నేహాన్ని పెంచుకుంది. ఇక్కడ రష్యా గురించి కూడా చెప్పాల్సి వుంటుంది. అమెరికా, చైనాతో బేరసారాల కోపం రష్యాతో సైనిక, వాణిజ్య సంబంధాలను కొనసాగించడం భారత్‌కు వ్యూహాత్మక అవసరం. అలాగే భారత్ తన పారిశ్రామిక వృద్ధిని వేగవంతం చేయటానికి, నెట్ జీరో 2070 లక్ష్యాల కోసం విదేశీ మూలధన పెట్టుబడులు సమకూర్చుకోవాల్సి వుంటుంది.
రష్యా-ఉక్రెయిన్ సంక్షోభం విషయంలో భారత్ సరైన వైఖరి తీసుకుంది. ఈ శతాబ్దంలో ప్రాంతీయ, ప్రపంచ శక్తులు మారే అవకాశం ఉన్నందున భారత్ ఆచితూచి అడుగులు వేస్తోంది. బలమైన ఆర్థిక శక్తిగా ఎదుగుతున్న భారత్ ఇప్పటికే తన యువ జనాభాతో ప్రపంచ ప్రభావశీల శక్తిగా అవతరించనుంది. తన చారిత్రక దృక్పథం, తత్వ చింతనతో ప్రపంచ శక్తిగా మరింత బలపడుతుందనటంలో ఎలాంటి ఆశ్చర్యం లేదు. బాధ్యతలకు దూరంగా వెళ్లకపోవటం.. బెధిరింపులకు లొంగకపోవటమే భారత్ బలం!!
