Queen Elizabeth-2: బ్రిటన్ దివంగత రాణి ఎలిజబెత్-2 చివరియాత్ర లాంఛనంగా ప్రారంభమైంది. రాణి భౌతికకాయాన్ని ఆమె తుదిశ్వాస విడిచిన బాల్మోరల్ కోట నుంచి ఆదివారం స్కాట్లండ్ రాజధాని ఎడింబర్గ్‌లోని రాణి అధికారిక నివాసం హోలీ రుడ్‌హౌస్ ప్యాలెస్‌కు తరలించారు. ఈ సందర్భంగా తమ రాణిని కడసారి చూసుకునేందుకు ప్రజలు దారికిరువైపులా వేలాదిగా బారులు తీరారు. రాణి శవపేటికపై స్కాట్లాండ్ రాచరిక జెండాను కప్పి దానిపై పుష్పగుచ్ఛంతో అలంకరించారు. ఆరు గంటల ప్రయాణానంతరం రాణి భౌతికకాయం ఎడింబర్గ్‌కు చేరుకుంది. అక్కడ హోలీరూడ్‌హౌస్‌లోని సింహాసన గదిలో సోమవారం మధ్యాహ్నం వరకూ శవపేటికను ఉంచనున్నారు. స్కాటిష్ ఫస్ట్ మినిస్టర్ నికోలా స్టర్జన్, ఇతర నేతలు దివంగత రాణికి అంతిమ నివాళులర్పిస్తారు. అనంతరం మంగళవారం విమానంలో లండన్‌లోని బకింగ్‌హాం ప్యాలెస్‌కు తరలిస్తారు. ఈ నెల 19న వెస్ట్‌మినిస్టర్ అబేలో అంత్యక్రియలు నిర్వహిస్తారు. అమెరికా అధ్యక్షుడు జో బైడెన్‌తో పాటు పలువురు ప్రపంచ దేశాధినేతలు పాల్గొననున్నారు.
బ్రిటన్ నూతన రాజు ఛార్లెస్-3ను ఒటావాలో జరిగిన ఓ అధికారిక కార్యక్రమంలో కెనడా దేశాధినేతగా అధికారికంగా ప్రకటించారు. రాణి ఎలిజబెత్-2 మృతి చెందిన వెంటనే ఛార్లెస్ కెనడాకు రాజుగా అవతరించారు. అయితే బ్రిటన్‌లో మాదిరిగా కెనడాలో కూడా ఓ అధికారిక కార్యక్రమం నిర్వహించడం రాజ్యాంగ ప్రక్రియ. అనంతరం కొత్త రాజును ప్రకటించడం సంప్రదాయం. బ్రిటిష్ కామన్వెల్త్ దేశాల్లో ఒకటిగా ఉన్న కెనడాకు యూకే రాజే దేశాధినేతగా వ్యవహరిస్తారు. విభేదాల వార్తల నేపథ్యంలో దివంగత రాణి మనవలు, కింగ్ చార్లెస్–3 కుమారులు ప్రిన్స్ విలియం, ప్రిన్స్ హ్యారీ దంపతులు శనివారం కలసికట్టుగా ప్రజలకు కన్పించారు. విండ్సర్ ప్యాలెస్ నుంచి నలుగురూ కలిసే బయటికొచ్చారు. బయట రాణికి నివాళులు అర్పించేందుకు గుమిగూడిన ప్రజలతో కాసేపు కలివిడిగా గడిపారు. మరోవైపు, సోమవారం రాజ దంపతులు వెస్ట్‌మినిస్టర్ హాల్‌లో పార్లమెంటు ఉభయ సభల సమావేశంలో పాల్గొని రాణికి నివాళులర్పిస్తారు.
Funeral of Krishna Raja: అధికార లాంఛనాలతో.. నేడు కృష్ణంరాజు అంత్యక్రియలు
ఎలిజబెత్-2 మృతి నేపథ్యంలో ఆదివారం భారత్ జాతీయ సంతాపదినంగా పాటించింది. ఈ సందర్భంగా దేశవ్యాప్తంగా జాతీయజెండాను అవనతం చేశారు.