Chinese Spy Ship: శ్రీలంకలో చైనా నిర్మించిన హంబన్‌తోట ఓడరేవు వద్ద ఓడరేవుకు చేరుకున్న చైనా సైనిక సర్వే నౌక వారం రోజుల తర్వాత సోమవారం తిరుగు ప్రయాణమైంది. ఈ నౌక శ్రీలంకకు రావడం పట్ల భారత్ తీవ్ర అభ్యంతరాలను వ్యక్తం చేసిన సంగతి తెలిసిందే. భారత్ అభ్యంతరాలను పట్టించుకోకుండా ఆ నౌకకు శ్రీలంక ప్రభుత్వం అనుమతి ఇచ్చింది. హంబన్ టోట రేవును చైనా నిర్వహిస్తోంది. శాటిలైట్, రాకెట్, ఖండాంతర బాలిస్టిక్ క్షిపణి ప్రయోగాలను పర్యవేక్షించే చైనా నౌకల సమూహంలో యువాన్ వాంగ్ 5 ఒకటి అని విశ్లేషకులు అంటున్నారు. శ్రీలంక పొరుగున ఉన్న భారత్.. చైనా ఈ ఓడరేవును సైనిక స్థావరంగా ఉపయోగించుకోవచ్చని భయాందోళనకు గురైన సంగతి తెలిసిందే.
హంబన్ టోట రేవును చైనా ఆధీనంలో ఉండడంతో.. గూఢచార నౌకలను భారత భూభాగానికి సమీపంలోకి తీసుకువస్తోందని కేంద్ర ప్రభుత్వం ఎప్పటి నుంచో ఆందోళన వ్యక్తం చేస్తోంది. ముఖ్యంగా పరిశోధన, సర్వే నౌకగా శ్రీలంక తీరానికి వచ్చిన యువాన్ వాంగ్-5 నౌకలో బాలిస్టిక్ క్షిపణులు, ఉపగ్రహాలపై ఓ కన్నేసి ఉంచగల సాధన సంపత్తి ఉందని భారత్ ఆరోపిస్తోంది.
Delhi: 3కిలోమీటర్లకు ఒక ఎలక్ట్రిక్ వాహన ఛార్జింగ్ పాయింట్.. ఢిల్లీ ప్రభుత్వం ప్రణాళిక
ఆ భారత్‌కు చెందిన వ్యవస్థలపై నిఘావేసే ప్రమాదం ఉందని రక్షణ శాఖ పేర్కొంది. భారతదేశం ఆందోళనల మధ్య ఈ స్పై షిప్ రాకను వాయిదా వేయాలని చైనాను శ్రీలంక గతంలో కోరింది. కానీ చైనా ఒత్తిడికి తలొగ్గి శ్రీలంక అనుమతి జారీ చేసింది. వాస్తవానికి ఈ నౌక ఆగస్టు 11నే హంబన్ టోట రేవుకు చేరాల్సి ఉంది. అయితే భారత్ అభ్యంతరాల నేపథ్యంలో శ్రీలంక ప్రభుత్వం జాప్యం చేసింది. దాంతో ఆ చైనా నౌక ఐదు రోజుల ఆలస్యంగా ఆగస్టు 16న లంక తీరానికి చేరింది. ఇంధనం, ఆహార పదార్థాలు, మంచినీరు, తదితర నిత్యావసరాలు నింపుకున్న పిదప నేటి సాయంత్రం 4 గంటలకు హంబన్ టోట రేవును వీడిందని హార్బర్ ముఖ్యాధికారి నిర్మల్ సిల్వా తెలిపారు. శ్రీలంకలోకి చైనా దౌత్య కార్యాలయం సూచించిన మేరకు ఆ నౌకా వర్గాలకు సహకారం అందించినట్లు హంబన్‌టోట పోర్టు వర్గాలు పేర్కొన్నాయి.