Chinese boy watches ‘too much’ television, gets punished with all-night TV binge by parents: చైనాలో ఓ జంట తమ కుమారుడికి వింత శిక్ష విధించారు. ఎక్కువ సమయం టీవీ చూస్తున్నాడని 8 ఏళ్ల కుమారుడికి రాత్రంతా టీవీ చూపించి శిక్ష విధించారు. ప్రస్తుతం ఈ జంట చేసిన పని సోషల్ మీడియాలో తెగవైరల్ అవుతోంది. చైనాలోని ఓ జంట తమ ఎనిమిదేళ్ల కుమారుడికి రాత్రంతా టీవీ చూపించినందుకు నెటిజెన్లు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. సెంట్రల్ హువాన్ ప్రావిన్సుకు చెందిన తల్లిదండ్రులు తమ కుమారుడిని ఇంట్లో వదిలి బయటకు వెళ్లారు. వారు వచ్చే సరికి హోంవర్క్ చేసి, నిద్రపోవాలని కొడుకుకు సూచించారు.
Read Also: Malaysia: మలేషియా ప్రధానిగా అన్వర్ ఇబ్రహీం.. ఐదేళ్ల వ్యవధిలో ఐదో ప్రధాని
అయితే వారు వచ్చే సరికి కొడుకు హోం వర్క్ చేయకుండా టీవీ చూస్తుండటంతో తల్లిదండ్రులు ఆగ్రహానికి గురయ్యారు. దీంతో రాత్రంతా పిల్లవాడితో టీవీ చూపించారు. పిల్లవాడిని బలవంతంగా అయినా నిద్ర పోకుండా చూసేందుకు సదరు తల్లిదండ్రులు విడతల వారీగా మెలకువతో ఉన్నారు. అయితే మొదట్లో ప్రశాంతంగా స్నాక్స్ తింటూ టీవీ చూసిన బాలుడు, కొంత సమయం తర్వాత నిద్రకు తట్టుకోలేక ఏడవడం ప్రారంభించాడు. అయినా కూడా ఉదయం 5 గంటల వరకు పిల్లాడిని నిద్ర పోనీయకుండా చూశారు పేరెంట్స్.
ఈ శిక్షపై నెటిజెన్లు స్పందిస్తున్నారు. పిల్లాడు నిద్ర పోకుండా ఇదే అలవాటు చేసుకుంటే ఎలా..? అని ఓ నెటిజెన్ ప్రశ్నించారు. మరొకరు నాకు కూడా ఇలాంటి అనుభవమే ఎదురైందని.. కేఎఫ్సీ అభిమాని అయిన మా మూడేళ్ల కొడుకు హాంబర్గర్లు, చికెన్ తినడానికి అలవాటు అయ్యాడని.. అయితే నేను వరసగా మూడు రోజుల పాటు కేఎఫ్సీకి తీసుకెళ్లడంతో ఇప్పుడు అతనికి ఇష్టం తగ్గిపోయిందని తెలిపాడు.