Anwar Ibrahim sworn in as Malaysia’s PM: మలేషియా ప్రధానిగా ప్రతిపక్ష నేత అన్వర్ ఇబ్రహీం ఎన్నికయ్యారు. మలేషియా రాజు అబ్దుల్లా సుల్తాన్ అహ్మద్ షా సమక్షంలో గురువారం ప్రమాణ స్వీకారం చేశారు. దీంతో ప్రభుత్వం ఏర్పాటుపై కొద్ది రోజులుగా ఏర్పడిన ప్రతిష్టంభనకు తెరపడినట్లు అయింది. శనివారం వెలువడిన సాధారణ ఎన్నికల ఫలితాల్లో ఏ పార్టీకి కూడా స్పష్టమైన మెజారిటీ లభించలేదు. అయితే యునైటెడ్ మలేషియన్ నేషనల్ ఆర్గనైజేషన్ తో పొత్తు పెట్టుకున్న అన్వర్ అధికారాన్ని చేజిక్కించుకున్నారు. దేశ చరిత్రలోనే తొలిసారిగా హంగ్ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేశారు.
Read Also: 26/11 Mumbai attacks: ఉగ్రవాదులపై చర్యలను అడ్డుకుంటున్నారు.. యూఎన్ వేదికగా చైనాపై పరోక్ష వ్యాఖ్యలు
మలేషియాకు పదో ప్రధానిగా అన్వర్ ఎన్నికయ్యారు. అయితే ఇది గత ఐదేళ్లలో ప్రధానిని ఎన్నుకోవడం ఐదోసారి. అన్వర్ ఇబ్రహీం ఎన్నిక కావడంతో మలేషియన్ మార్కెట్లు పుంజుకున్నాయి. అన్వర్ ఇబ్రహీం తన క్యాబినెట్ కూర్పుపై శుక్రవారం చర్చించాలని భావిస్తున్నారు. ఆర్థిక వ్యవస్థ మందగించడం, ఆర్థిక సంక్షోభ పరిస్థితుల్లో మలేషియా ఉంది. ముఖ్యంగా ఆర్థిక సమస్యలే అన్వర్ ఇబ్రహీంకు సవాల్ గా మారనున్నాయి. సుపరిపాలను, అవినీతి నిర్మూలన, న్యాయం స్వాతంత్య్రం, మలేషియన్ల సంక్షేమలో ఎప్పటీకీ రాజీపడబోమని కొత్త ప్రధాని గురువారం ప్రకటించారు.
3.3 కోట్ల జనాభా ఉన్న మలేషియాలో మలాయ్ జాతి, భారత్-చైనీ మైనారిటీల మధ్య చారిత్రాత్మక ఉద్రిక్తతలు ఉన్నాయి. అన్వర్ ప్రభుత్వం వీటిని రూపుమాపుతుందని అక్కడి ప్రజలు భావిస్తున్నారు. శనివారం జరిగి ఎన్నికల ఫలితాల్లో అన్వర్ కు చెందిన పకటాన్ హరపాన్ సంకీర్ణం 82 స్థానాలు సాధించగా.. ముహిద్దీన్ పెరికటన్ నేషనల్ బ్లాక్ 73 స్థానాలను గెలుచుకుంది. బారిసన్ కూటమి 30 స్థానాలను కైవసం చేసుకుంది. ప్రభుత్వం ఏర్పాటు 112 మంది అవసరం అయితే ఏ పార్టీకి కూడా సరైన మెజారిటీ రాలేదు. బారిసన్ కూటమి తమకు మద్దతు ఇస్తుందని అన్వర్ చెప్పారు. దీంతో ఆయన ప్రధాని పీఠాన్ని అధిరోహించారు.