Soutwest China Face Power Cuts Amid Heatwave: చైనా తీవ్రమైన కరెంట్ కోతలతో అల్లాడుతోంది. ముఖ్యంగా నైరుతి చైనా ప్రాంతంలో కరెంట్ కోతలు పెరిగాయి. ఇటీవల కాలంలో చైనాలోని నైరుతి ప్రాంతంలో ఉష్ణోగ్రతలు గణనీయంగా పెరిగాయి. పెరిగిన హీట్ వేవ్ విద్యుత్ సరఫరాపై తీవ్ర ప్రభావం చూపిస్తోంది. సిచువాన్ ప్రావిన్స్ లో ఉష్ణోగ్రతలు 40 డిగ్రీలను దాటి నమోదు అవుతున్నాయి. దీని వల్ల ఏసీలకు విపరీతమైన డిమాండ్ పెరిగింది. దీంతో కరెంట్ కోతలు తప్పడం లేదు. ఇదే కాకుండా సిచువాన్ ప్రావిన్స్ లో కరెంట్ ఎక్కువగా జలవిద్యుత్ కేంద్రాల నుంచే ఉత్పత్తి అవుతుంది. అయితే ఎండల ధాటికి నీరు కూడా అడుగంటుకుపోవడంతో కరెంట్ ఉత్పత్తిపై తీవ్ర ప్రభావం పడుతోంది.
చైనా నైరుతి ప్రాంతంలో దాదాపుగా 50 లక్షల మంది కరెంట్ కోతలతో అల్లాడుతున్నారు. ఈ ప్రాంతంలో ఉన్న డాజౌ నగరానికి అడపాదడపా మాత్రమే విద్యుత్ సరఫరా ఉంటోంది. ఈ ప్రాంతంలోని విద్యుత్ సంక్షోభం వల్ల పరిశ్రమలు మూతపడుతున్నాయి. జపనీస్ కంపెనీ టయోటా, సిచువాన్ లోని తన వాణిజ్య కార్యకలాపాలను నిలిపివేసింది. చెంగ్డులోని టయోటా ప్లాంట్ లో పనులను నిలిపివేసింది. ఇదే కాకుండా అతిపెద్ద ఎలక్ట్రిక్ వాహనాల బ్యాటరీ తయారీ సంస్థ కాంటెంపరరీ ఆంపెరెక్స్ టెక్నాలజీ కూడా ఇబిన్ నగరంలోని తన ప్లాంట్ లో ఉత్పత్తిని నిలిపివేసింది. సిచువాన్ ప్రావిన్స్ లో 21 నగరాల్లో 19 నగరాల్లో పరిశ్రమల్లో ఉత్పత్తిని నిలిపి వేయాలని అక్కడి ప్రభుత్వం ఆదేశించింది.
Read Also: Rahul Gandhi: బిల్కిస్ బానో కేసుతో మహిళలకు ఏం సందేశం ఇస్తున్నారు…?
చైనాలోని ప్రధాన నగరాల్లో ఈ ఏడాదిలో అత్యంత గరిష్ట ఉష్ణోగ్రతలు నమోదు అవుతున్నాయి. వాతావరణ మార్పుల కారణంగానే విపరీతమైన ఉష్ణోగ్రతలు నమోదు అవుతున్నాయని శాస్త్రవేత్తలు హెచ్చరిస్తున్నారు. గత నెలలో యూరప్ వ్యాప్తంగా భారీగా ఉష్ణోగ్రతలు నమోదు అయ్యాయి. యూకే, ఇటలీ, పోర్చుగల్ దేశాల్లో 40 డిగ్రీలను మించి ఉష్ణోగ్రతలు నమోదు అయ్యాయి. దీంతో యూకే ఎమర్జెన్సీ, రెడ్ అలర్ట్ విధించారు. లండన్ తో పాటు యూకేలోని వివిధ ప్రాంతాలకు నీరందించే థేమ్స్ నది కూడా ఎండిపోయే స్థితికి వచ్చింది. యూరప్ లోని పలు దేశాల్లో కరువు పరిస్థితులు తలెత్తాయి.