చైనాలోని యాంగ్జీ నదిపై నిర్మించిన త్రీగోర్జెస్ డ్యామ్ ప్రపంచంలోనే అతి పెద్ద డ్యామ్. ఈ డ్యామ్ 2.33 కిలోమీటర్ల పొడవు. 181 మీటర్ల ఎత్తు కలిగి ఉంటుంది. ఈ మేరకు 660 కిలోమీటర్ల పొడవున రిజర్వాయర్ ఏర్పడింది. రిజర్వాయర్‌లో సముద్ర మట్టంకన్నా సుమారు 175 మీటర్ల ఎత్తున నిలిచిన నీటి బరువు ఏకంగా 39 వేల కోట్ల కిలోలు ఉంటుంది. అయితే ఇదంతా నాణేనికి ఒకవైపు మాత్రమే. మరోవైపు చూస్తే ఈ డ్యామ్ వల్ల మానవాళికి ముప్పు ఏర్పడుతుందని సైంటిస్టులు సూచిస్తున్నారు. ఈ డ్యామ్ భూమి తిరగడాన్ని స్లో చేయడంతో భవిష్యత్‌లో తీవ్ర పరిణామాలు ఎదురవుతాయని హెచ్చరిస్తున్నారు.
త్రీగోర్జెస్ డ్యామ్‌లో ఉత్పత్తి అయ్యే జలవిద్యుత్ సామర్థ్యం 22,500 మెగావాట్లు. అంటే ప్రపంచంలోనే అతిపెద్దవైన మూడు అణువిద్యుత్ కేంద్రాలతో దాదాపు సమానం అన్నమాట. ఈ భారీ డ్యామ్‌తో అన్ని లాభాలే కలుగుతాయని అనుకోవడం పొరపాటే. ఈ డ్యాంలో నీటి నిల్వ దెబ్బకు భూపరిభ్రమణ వేగం తగ్గిపోయింది. రిజర్వాయర్‌లో నిలిచే నీటి బరువుతో పాటు డ్యామ్ నుంచి 150 మీటర్ల ఎత్తులో విడుదలయ్యే నీటి కారణంగా ‘మూమెంట్ ఆఫ్ ఇనెర్షియా’ ప్రభావం ఏర్పడిందని నాసా సైంటిస్టులు గుర్తించారు. దీని కారణంగా భూమి పరిభ్రమణ వేగం అత్యంత స్వల్ప స్థాయిలో తగ్గిందని వారు వివరిస్తున్నారు. ఈ నేపథ్యంలో రోజు గడువు 0.06 మైక్రోసెకన్లు పెరిగిందని తేల్చారు.
Monkeypox: అమెరికాలో మంకీపాక్స్ కల్లోలం…7 రాష్ట్రాల్లో గుర్తింపు
అంతేకాదు ఈ భారీ డ్యామ్ వల్ల భూమి ధ్రువాల స్థానం కూడా రెండు సెంటీమీటర్ల మేర పక్కకు జరిగిందని శాస్త్రవేత్తలు చెప్తున్నారు. త్రీ గోర్జెస్ డ్యామ్ వల్ల భూమి అడుగున ఒత్తిడి పెరిగి తరచూ భూకంపాలు కూడా వస్తున్నాయని సైంటిస్టులు అభిప్రాయపడుతున్నారు. ఈ డ్యామ్ వల్ల విడుదలయ్యే నీటి కారణంగా లక్షలాది మంది నిరాశ్రయులవుతున్నారు. పంటలు కూడా తీవ్రస్థాయిలో దెబ్బతింటున్నాయి.
గుండ్రంగా తిరిగే వస్తువు ఏదైనా దానిలోని కణాలన్నీ అన్నివైపులా సమానంగా సర్దుకుంటాయి. అన్నివైపులా సమాన బరువు ఏర్పడుతుంది. అలాకాకుండా ఏదో ఒకచోట భారీ బరువు చేరినప్పుడు ఇనెర్షియా నెలకొని సదరు వస్తువు తిరిగే వేగం తగ్గిపోతుంటుంది. దీనినే ‘మూమెంట్ ఆఫ్ ఇనెర్షియా’ అంటారు. త్రీగోర్జెస్ డ్యామ్ వల్ల భూమిపై ఇలాంటి ప్రభావమే పడి భ్రమణ వేగం తగ్గినట్టు శాస్త్రవేత్తలు గుర్తించారు.