India-Canada: ఖలిస్తాన్ మద్దతుదారులకు, ఇండియా వ్యతిరేకులకు మద్దతుగా వ్యవహరిస్తోంది కెనడాలోని జస్టిన్ ట్రూడో ప్రభుత్వం. ఖలిస్తాన్ ఉగ్రవాది హర్దీప్ సింగ్ నిజ్జర్ హత్య తర్వాత ఈ హత్యలో భారత ప్రభుత్వ ఏజెంట్ ప్రమేయం ఉందని కెనడా పీఎం ట్రూడో ఆరోపించడంతో ఒక్కసారిగా భారత్, కెనడాల మధ్య దౌత్యపోరు మొదలైంది. అయితే, ఆయన వ్యాఖ్యల్ని భారత్ తీవ్రంగా తిరస్కరించింది. రాజకీయ ప్రేరేపిత, అసంబద్ధ వ్యాఖ్యలుగా కొట్టిపారేసింది. కెనడా తీవ్రవాదులకు స్థావరంగా మారిందని మండిపడింది.
ఇదిలా ఉంటే మరోసారి కెనడా భారత్‌పై తీవ్ర ఆరోపణలు చేసింది. కెనడాలో భారత్ జోక్యం చేసుకుంటుందని, గూఢచర్యానికి పాల్పడుతోందని ఆరోపించింది. కెడడియన్ గూఢచార సంస్థ కెనడియన్ సెక్యూరిటీ ఇంటెలిజెన్స్ సర్వీస్ (CSIS) ఈ వారం విడుదల చేసిన 2023 పబ్లిక్ రిపోర్ట్‌లో ఈ విషయాన్ని వెల్లడించింది. కెనడాతో పాటు ఇతర పాశ్యాత్య దేశాల్లో విదేశీజోక్యంతో పాటు గూఢచర్యానికి భారత్, చైనా, రష్యా, ఇరాన్ పాల్పడుతున్నాయని నివేదిక వెల్లడించింది. ఈ దేశాలు తమ లక్ష్యాల కోసం, ఆసక్తుల కోసం విదేశీ జోక్యం చేసుకుంటున్నాయని ఆరోపించింది.
Read Also: Jasmine flowers: మల్లెపూలను ఎక్కువగా పెట్టుకుంటున్నారా? మీకో షాకింగ్ న్యూస్..
సదరు గూఢచార సంస్థ చట్టం ప్రకారం, విదేశీ ప్రభావిత కార్యకలాపాలను కెనడా ప్రయోజనాలకు హానికరం, రహస్యంగా లేదా మోసపూరితంగా లేదా ఏదైనా వ్యక్తికి ముప్పు కలిగిస్తుందని అని నిర్వచించింది. కెనడా, భారత్ మధ్య ద్వైపాక్షిక సంబంధాలు క్షీణించిన తర్వాత కెనడాకు వ్యతిరేకంగా సైబర్ కార్యకలాపాలు నిర్వహించబడినట్లు గమనించామని, అయితే ఇందులో భారత ప్రభుత్వానికి ఎలాంటి పాత్ర లేదని స్పష్టం చేసింది.
ఖలిస్తాన్ వేర్పాటువాది హర్దీప్ సింగ్ నిజ్జర్‌ని కెనడాలోని సర్రే నగరంలో గుర్తుతెలియని వ్యక్తుల కాల్చి చంపారు. అయితే, ఈ హత్యలో ప్రమేయం ఉన్నట్లుగా ఆరోపిస్తూ ఇటీవల ముగ్గురు భారతీయులను కెనడా అధికారులు అరెస్ట్ చేశారు. అయితే, దీనికి సంబంధించి కెనడా అధికారులు తమతో ఎలాంటి సమాచారాన్ని పంచుకోలేదని భారత విదేశాంగ శాఖ స్పష్టం చేసింది. మరోవైపు మరో ఖలిస్తాన్ ఉగ్రవాది గురుపత్వంత్ సింగ్ పన్నూను హత్య చేసేందుకు కుట్ర పన్నినట్లు అమెరికా ఆరోపిస్తోంది. అమెరికా ఎఫ్‌బీఐ భారత దేశ ప్రభుత్వ అధికారితో కలిసి నిఖిల్ గుప్తా అనే వ్యక్తి హత్యకు ప్లాన్ చేసినట్లు ఆరోపించింది. ప్రస్తుతం నిఖిల్ గుప్తాను ఎఫ్‌బీఐ ఆదేశాల మేరకు చెక్ రిపబ్లిక్ దేశంలో అరెస్ట్ చేశారు. అతడిని తమకు అప్పగించాలని చెక్ రిపబ్లిక్‌ని అమెరికా కోరుతోంది.