Site icon NTV Telugu

Trump-Mark Carney: భారత్-పాక్ యుద్ధాన్ని ఆపారు.. ట్రంప్‌పై కెనడా ప్రధాని ప్రశంసలు

Trump

Trump

ట్రంప్ పరివర్తన చెందిన అధ్యక్షుడు అని కెనడా ప్రధాని మార్క్ కార్నీని ప్రశంసలతో ముంచెత్తారు. మంగళవారం ఓవల్ కార్యాలయంలో ట్రంప్‌తో మార్క్ కార్నీ సమావేశం అయ్యారు. ఇరు దేశాల మధ్య ద్వైపాక్షిక సంబంధాలపై చర్చించారు. అనంతరం మీడియాను ఉద్దేశించి ఇద్దరూ మాట్లాడారు. ఈ సందర్భంగా ట్రంప్‌ను మార్క్ కార్నీ పొగడ్తలతో ముంచెత్తారు. భారతదేశం-పాకిస్థాన్ సహా అనేక దేశాల మధ్య శాంతిని తీసుకొచ్చిన పరివర్తన చెందిన అధ్యక్షుడు అని అభివర్ణించారు. ప్రపంచ వ్యవహారాలు, ఆర్థిక స్థిరత్వాన్ని ట్రంప్ ప్రభావితం చేశారని కొనియాడారు.

ఇది కూడా చదవండి: Diwali: దీపావళి రోజున సెలవుగా ప్రకటిస్తూ కాలిఫోర్నియా గవర్నర్‌ ఉత్తర్వు

మార్చిలో మార్క్ కార్నీ కెనడా అత్యున్నత పదవిని చేపట్టారు. ప్రధానిగా మార్క్ కార్నీ అమెరికాలో పర్యటించడం ఇది రెండోసారి. వచ్చే ఏడాది జరగనున్న యునైటెడ్ స్టేట్స్-మెక్సికో-కెనడా ఒప్పందం సమీక్షకు ముందు ఈ సమావేశం జరగడం ప్రాధాన్యత సంతరించుకుంది. ప్రస్తుతం రెండు దేశాల మధ్య ట్రంప్ వాణిజ్య యుద్ధం సాగుతోంది. ఈ నేపథ్యంలో ఈ భేటీ ప్రాధాన్యత సంతరించుకుంది. గతంలో కెనడాను అమెరికాలో కలిపేస్తానంటూ ట్రంప్ హెచ్చరించారు. దీంతో ఇరు దేశాల మధ్య ఉద్రిక్తతలు చోటుచేసుకున్నాయి. తాజాగా ట్రంప్-మార్క్ కార్నీ భేటీ ఉల్లాసంగా సాగడం కొత్త పురోగతి వైపు వెళ్తున్నట్లు కనిపిస్తోంది. ఇక మార్క్ కార్నీని ప్రపంచ నాయకుడు.. మంచి వ్యక్తి అంటూ ట్రంప్ ప్రశంసించడం విశేషం.

ఇది కూడా చదవండి: CJi Gavai vs BJP: న్యాయవాది ధైర్యాన్ని మెచ్చుకోవాల్సిందే.. సీజేఐ దాడిపై బీజేపీ నేత కీలక వ్యాఖ్యలు

ఏప్రిల్ 22న పహల్గామ్ ఉగ్రదాడికి ప్రతీకారంగా పాకిస్థాన్‌పై భారత్ ఆపరేషన్ సిందూర్ చేపట్టింది. ఈ దాడిలో ఉగ్ర స్థావరాలు ధ్వంసం అవ్వడమే కాకుండా 100 మంది ఉగ్రవాదులు హతమయ్యారు. అంతేకాకుండా పాకిస్థాన్ వైమానిక స్థావరాలు దెబ్బతిన్నాయి. అనంతరం ఇరు దేశాల చర్చలతో శాంతి ఒప్పందం జరిగింది. అయితే తన వల్లే భారత్-పాకిస్థాన్ యుద్ధం ఆగిందంటూ ట్రంప్ పదే పదే ఎక్కడికెళ్లినా చెబుతున్నారు. కానీ భారతదేశం మాత్రం అంగీకరించలేదు. కాల్పుల విరమణలో మూడో వ్యక్తి ప్రమేయం లేదని భారత్ తోసిపుచ్చింది. తాజాగా కెనడా ప్రధాని మార్క్ కార్నీ మాత్రం అదే విషయాన్ని గుర్తు చేస్తూ ట్రంప్‌ను ప్రశంసించడం ఆశ్చర్యం కలిగిస్తోంది.

 

Exit mobile version