NTV Telugu Site icon

India-Canada: ఇరు దేశాల మధ్య ఖలిస్థాన్ చిచ్చు.. వాణిజ్య చర్చలు వాయిదా..

India Canada

India Canada

India-Canada: ఇండియా, కెనడాల మధ్య రాజకీయ విభేదాలు తారాస్థాయికి చేరినట్లు కనిపిస్తోంది. ఇరు దేశాల మధ్య వాణిజ్య చర్చలు వాయిదా పడ్డాయి. అక్టోబర్‌లో ఇరు దేశాల మధ్య జరగాల్సిన ట్రెడ్ మిషన్ వాయిదా వేస్తున్నట్లు కెనడా వాణిజ్య మంత్రి మేరీ ఎన్‌జి ప్రతినిధి శాంతి కోసెంటినో ధృవీకరించారు. కారణం లేకుండా ఈ చర్చల్ని వాయిదా వేశారు. ఈ నెల ప్రారంభంలో కూడా ఇలాగే కెనడా, భారత్ తో వాణిజ్య ఒప్పందానికి విరామం ఇచ్చింది. అీయితే ఇరు దేశాల మధ్య ఖలిస్తాన్ వేర్పాటువాద అంశమే చిచ్చు పెట్టినట్లు తెలుస్తోంది.

ఇటీవల జీ20 సదస్సుకు కెనడా ప్రధాని జస్టిన్ ట్రూడో వచ్చి వెళ్లిన తర్వాత ఈ పరిణామం చోటు చేసుకుంది. ఆ సమయంలో భారత ప్రధాని మోడీతో ట్రూడో ద్వైపాక్షి సంబంధాలపై చర్చలు జరిపారు. ఈ చర్చల్లో కూడా ప్రధాని మోడీ ఖలిస్తాన్, కెనడా కేంద్రంగా భారత వ్యతిరేకతకు పాల్పడుతున్న చర్యలను ముఖ్యంగా ప్రస్తావించారు. భారత రాయబార కార్యాలయాలు, భారత్ దౌత్యవేత్తలపై దాడులు, భారతీయులను బెదిరించడం వంటి చర్యలకు పాల్పడుతుండటంపై ప్రధాని మోడీ ఆందోళన వ్యక్తం చేశారు. కెనడా ప్రధాని ముందే మోడీ తన బలమైన సందేశాన్ని వ్యక్తపరిచారు.

Read Also: Flexes War: తెలంగాణలో మళ్లీ ఫ్లెక్సీల రాజకీయం.. కాంగ్రెస్‌, బీజేపీ, కేసీఆర్‌ను ప్రశ్నిస్తూ ఫ్లెక్సీలు

ఇరు దేశాల మధ్య పరస్పర గౌరవం, విశ్వాసం అవసరమని మోడీ ప్రస్తావించారు. చర్చల అనంతరం కెనడా పీఎం ట్రూడో మీడియాతో మాట్లాడుతూ.. తమ దేశం శాంతియుత నిరసనలు తెలిపే స్వేచ్ఛను కాపాడుతుందని, అదే సమయంలో హింసను అడ్డుకుంటుందని అన్నారు. ఖలిస్తాన్ వేర్పాటువాదం గురించి పరోక్షంగా మాట్లాడుతూ కొద్ది మంది చర్యలు కెనడాకు పాతినిధ్యం వహించవని గుర్తుంచుకోవాలి అంటూ కామెంట్స్ చేశారు.

గత కొంత కాలంగా కెనడాలో భారత్ లోని పంజాబ్ రాష్ట్రాన్ని వేరు చేసి ఖలిస్తాన్ దేశాన్ని ఏర్పాటు చేయాలని కొందరు సిక్కులు వేర్పాటువాదాన్ని ప్రోత్సహిస్తున్నారు. దీని పేరుతో ‘ఖలిస్తాన్ రెఫరెండం’ నిర్వహిస్తున్నారు. సర్రే, వాంకోవర్, టొరంటో వంటి ప్రాంతాల్లో భారత వ్యతిరేక చర్యలకు పాల్పడుతూ..ఏకంగా ప్రధాని మోడీ, మంత్రులు అమిత్ షా, జైశంకర్లను బెదిరించే స్థాయికి చేరారు. చాలా సార్లు భారత ప్రభుత్వం కెనడాను చర్యలు తీసుకోవాలని కోరినా, అక్కడి ట్రూడో ప్రభుత్వం పట్టించుకోవడం లేదు. జూన్ నెలలో ఓ కార్యక్రమంలో మాజీ ప్రధాని ఇందిరాగాంధీని చంపినట్లు ప్రతిబింబించే శకటాన్ని ఏర్పాటు చేశారు. ఇది సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.

Show comments