Bangladesh: బంగ్లాదేశ్ ఎన్నికల్లో బంగ్లాదేశ్ నేషనలిస్ట్ పార్టీ(బీఎన్‌పీ) ఘన విజయం సాధించింది. దివంగత ఖలితా జియా కుమారుడు తారిఖ్ రెహ్మాన్ ప్రధానిగా పదవీ స్వీకారం చేయనున్నారు. మొత్తం 300 స్థానాలకు జరిగిన ఎన్నికల్లో బీఎన్పీ ఏకంగా 210 సీట్లు సాధించింది. 35 ఏళ్ల తర్వాత బంగ్లాదేశ్‌కు ఒక పురుషుడు ప్రధాని పదవిని అధిష్టించబోతున్నారు.
ఇదిలా ఉంటే, ఈ ఎన్నికల్లో తారిఖ్ రెహ్మాన్ విజయం సాధించడంతో పాటు, ఏకంగా 75 శాతం మంది బంగ్లా ప్రజలు ‘‘జూలై చార్టర్’’కు అనుకూలంగా ఓటేశారు. దేశ పునర్నిర్మాణం, రాజ్యాంగ సవరణలకు సంబంధించి 84 సంస్కరణ అంశాలు ఈ జూలై చార్టర్‌లో ఉన్నాయి. బంగ్లాదేశ్ ఎన్నికల సంఘం చెబుతున్న దాని ప్రకారం.. ఓటేసిన వారిలో 4,80,74,429 సంస్కరణలకు ఓకే చెప్పారు, అవసరం లేదని 2,25,65,627 చెప్పారు. మొత్తంగా 70 శాతం మంది ప్రజలు జూలై చార్టర్ సంస్కరణలకు ఓకే చెప్పారు.
జూలై చార్టర్ అంటే ఏమిటి..?
2024 విద్యార్థి ఉద్యమం తర్వాత, దేశంలోని పాలనా వ్యవస్థలోని లోపాలు సరిదిద్దే లక్ష్యంతో జూలై నేషనల్ చార్టర్ 2025 రూపొందింది. ఇందులో మొత్తం 84 సంస్కరణలు ఉణ్నాయి. 47- రాజ్యాంగ సవరణ సంస్కరణలు కాగా, 37-చట్టాలు/ఎగ్జిక్యూటివ్ ఆర్డర్లకు సంబంధించినవి. ఈ
సంస్కరణలు అమలు చేయడానికి రాజ్యాంగ సవరణ కౌన్సిల్‌కు 270 పని రోజుల గడువు ఉంది.
కీలకాంశాలు ఇవే:
1) ప్రధాని పదవీ కాలం- ప్రధానమంత్రులు దీర్ఘకాలం పదవిలో ఉంటే అది నియంతృత్వానికి దారి తీసే అవకాశం ఉందనే ఆలోచనతో, ఎవరైనా రెండు సార్లు మాత్రమే ఈ పదవిలో ఉండాలనే నిబంధన
2) ద్విసభ్య పార్లమెంట్- శాసనసభ అధికారాన్ని బ్యాలెన్స్ చేయడానికి పార్టీ జాతీయ ఓటు వాటా ఆధారంగా సీట్లు కేటాయించి, 100 సీట్లతో కొత్తగా ఎగువ సభ, అంటే మన దేశంలోని రాజ్యసభలాంటి దాన్ని సృష్టించడం.
3) కార్యానిర్వాహక అధికారాన్ని తగ్గించడం. ప్రధాని కార్యాలయం అధికార కేంద్రీకరణను తగ్గించడానికి అధ్యక్షుడి పాత్రను బలోపేతం చేయడం.
4) న్యాయ, సంస్థాగత స్వాతంత్య్ర: న్యాయవ్యవస్థ, ఇతర కీలక రాష్ట్ర సంస్థలు రాజకీయ ప్రభావం నుంచి విముక్తి పొందేలా చేయడం.
5) ప్రతిపక్ష భాగస్వామ్యం: కీలకమైన పార్లమెంటరీ కమిటీలకు నాయకత్వం వహించడానికి, డిప్యూటీ స్పీకర్‌గా పనిచేయడానికి ప్రతిపక్ష నేతలకు అవకాశం ఇవ్వడం.
6) జూలై ఫైటర్స్: 2024 జూలైలో షేక్ హసీనా కోసం పనిచేసిన వారికి ‘‘జూలై ఫైటర్స్’’ అని రక్షణ ఇవ్వాలి.
7) మహిళా ప్రాతినిధ్యం: పార్లమెంట్‌లో మహిళలకు సముచిత ప్రాతినిధ్యం ఇవ్వాలని ఇందులో ఉంటుంది.