NTV Telugu Site icon

Bangladesh: ఉల్ఫా చీఫ్ పరేష్ బారూహ్ మరణశిక్షను రద్దు చేసిన బంగ్లాదేశ్ కోర్ట్..

Paresh Baruh

Paresh Baruh

Bangladesh: భారత వ్యతిరేకి, ఉగ్రసంస్థ ‘‘ఉల్ఫా’’ చీఫ్ పరేష్ బారుహ్ మరణశిక్షను బంగ్లాదేశ్ కోర్టు రద్దు చేసింది. 2004 ఛటోగ్రామ్ ఆయుధ రవాణా కేసులో బంగ్లాదేశ్ మాజీ మంత్రి లుత్ఫోజామన్ బాబర్‌తో సహా మరో ఐదుగురిని నిర్దోషులుగా ప్రకటించింది. నిషేధిత ఉగ్ర సంస్థ చీఫ్ పరేష్ బారుహ్ మరణశిక్షని జీవితఖైదుకు తగ్గించినట్లు బంగ్లా మీడియా తెలియజేసింది. భారత్‌కి వ్యతిరేకంగా పనిచేస్తున్న ఉగ్ర సంస్థల కోసం 10 ట్రక్కుల ఆయుధాలను, మందుగుండు సామాగ్రికి సంబంధించింది ఈ కేసు.

2004లో బంగ్లాదేశ్‌లో బీఎన్పీ, జమాతే ఇస్లామీ అధికారంలో ఉన్న మసయంలో ఈ భారీ ఆయుధాలు స్వాధీనం చేసుకున్నారు. ఈ స్మగ్లింగ్ వ్యవహారంలో అప్పటి జూనియర్ హోం శాఖ వ్యవహారాల మంత్రి లుత్ఫోజామన్ బాబర్ ప్రమేయం ఉన్నట్లు రుజువైంది. బాబర్ 2001-2006 వరకు బీఎన్పీ నేత షేక్ ఖలీదా జియా ప్రభుత్వంలో హోం శాఖ సహాయ మంత్రిగా ఉన్నారు.

Read Also: Dinga Dinga: ఉగాండాను వణికిస్తున్న ‘‘డింగా డింగా’’.. అసలేంటి ఈ కొత్త వ్యాధి..?

భారత వ్యతిరేక, పాక్ అనుకూల ప్రభుత్వంగా పేరొందిన షేక్ ఖలిదా జియా హయాంలోని ప్రభుత్వం పరేష్ బారుహ్‌కి ఆశ్రయం కల్పించింది. బారుహ్ ప్రస్తుతం చైనా నుంచి పనిచేస్తున్నట్లు తెలుస్తోంది. ఉల్ఫాలోని ఒక వర్గమైన ఉల్ఫా-1కి నాయకత్వం వహిస్తున్నాడు. అస్సాంని విముక్తి చేసే తన వేర్పాటువాద ఎజెండాతో బారుహ్ పనిచేస్తున్నాడు. అయితే, ఈ ఉగ్రసంస్థ ఇతర ప్రధాన నేతలు తుపాకులు పక్కన పెట్టి, కేంద్రంతో చర్చలు నడుపుతున్నారు.

ఈ కేసులో బారుహ్‌తో పాటు మొత్తం ఆరుగురి మరణశిక్షలను ఎదుర్కొంటుండగా, ప్రస్తుతం బారుహ్‌కి యావజ్జీవ శిక్ష, మిగిలిన వారికి 10 ఏళ్ల జైలు శిక్ష విధిస్తున్నట్లు తెలిసింది. షేక్ హసీనా దిగిపోయిన తర్వాత అక్కడ మహ్మద్ యూనస్ ప్రభుత్వం భారత వ్యతిరేకులకు పెద్దపీట వేస్తోంది. ర్యాడికల్ ఇస్లామిస్టులను జైళ్ల నుంచి విడుదల చేస్తోంది.

Show comments