Bangladesh: బంగ్లాదేశ్ రిజర్వేషన్ కోటాపై ప్రారంభమైన అల్లర్లు ఇప్పటికీ కొనసాగుతూనే ఉన్నాయి. షేక్ హసీనా తన ప్రధాన మంత్రి పదవికి రాజీనామా చేసి ఇండియా పారిపోయినా, ముహ్మద్ యూనస్ నేతృత్వంలో తాత్కాలిక ప్రభుత్వం ఏర్పడినా కూడా అక్కడ పరిస్థితి పూర్తిగా చక్కబడలేదు. ముఖ్యంగా హసీనా పార్టీ అవామీ లీగ్ కార్యకర్తలు, ఆ పార్టీ మద్దతుదారులపై దాడులు జరుగుతూనే ఉన్నాయి. ఆగస్టు 15న బంగ్లాదేశ్ జాతిపిత షేక్ ముజిబుర్ రెహమాన్ వర్థంతి సందర్భంగా నివాళులు అర్పించేందుకు వెళ్తున్న వారిపై కూడా దాడులు జరిగాయి.
Read Also: CS Shanti Kumari: స్కిల్ యూనివర్సిటీలో కోర్సుల ప్రారంభ తేదీ ఖరారు!.. కోర్సులు ఇవే
ఇదిలా ఉంటే, ప్రముఖ బంగ్లాదేశ్ నటి రోకెయా ప్రాచీపై దాడి జరిగింది. హసీనా తండ్రి అయిన షేక్ ముజిబుర్ రెహ్మాన్‌కు నివాళులు అర్పించేందుకు 32-బంగబంధు రోడ్‌కి వెళ్తున్న సమయంలో తనపై హింసాత్మక గుంపు దాడి చేసినట్లు చెప్పింది. దాడి సమయంలో తనను చంపేస్తామని బెదిరించినట్లు వెల్లడించింది. వారంతా బంగ్లాదేశ్ నేషనలిస్ట్ పార్టీ(బీఎన్‌పీ), జమాతే ఇస్లామీ పార్టీల మద్దతుదారులు, కార్యకర్తలని వెల్లడించింది. వారు తనను చంపాలనుకున్నారని, తనను కొట్టడమే కాకుండా బట్టలు కూడా చింపారని, శారీరకంగా వేధించారని తెలిపింది. ప్రస్తుతం దేశాన్ని ఎవరు నడుపుతున్నారో తెలియడం లేదని, వారు కేవలం ప్రజల్ని చంపేసి, మృతదేహాలను వేలాడదీస్తున్నారని అన్నారు.
అవామీ లీగ్ మద్దతుదారులు, కార్యకర్తల్ని అక్కడి మతోన్మాద మూకలు లక్ష్యంగా చేసుకోవడంతో వారంతా అండర్ గ్రౌండ్స్‌కి వెళ్లారు. ప్రస్తుతం ఆ దేశ నటీనటులకు కూడా ఈ హింస తప్పడం లేదు. ప్రస్తుతం బంగ్లాదేశ్ పరిస్తితి 1971ని పోలి ఉందని చెప్పారు. “మేము 1971 గురించి విన్నాము, ఇది దాని కంటే పెద్దది. అనేక మంది హిందువులపై దాడి జరిగింది. అంశాలు బంగాబంధు షేక్ ముజిబుర్ రెహ్మాన్ ముద్రను, ఆయన త్యాగాన్ని చెరిపివేయడానికి ప్రయత్నిస్తున్నారు. వారు జాతీయ గీతాన్ని మార్చాలనుకుంటున్నారు. ఈ నిరసన పూర్తిగా భిన్నమైన నిరసన, దీనికి రిజర్వేషన్ కోటా సమస్యను ముందుంచారు.” అని ఆమె అన్నారు. ప్రస్తుతం ఆమె అండర్‌గ్రౌండ్‌కి వెళ్లింది.