పశ్చిమాసియాలో మరోసారి ఉద్రిక్తతల వేళ పాకిస్థాన్ ఆర్మీ చీఫ్ అసిమ్ మునీర్ టెహ్రాన్ పర్యటన ప్రాధాన్యత సంతరించుకుంది. శాంతి చర్చలు విఫలమైతే మరోసారి భారీ దాడులకు అమెరికా సిద్ధమవుతోంది. ఈ నేపథ్యంలో గగనతలాన్ని ఇరాన్ మూసేసింది. ఏ క్షణంలో ఏం జరగొచ్చన్న టెన్షన్ నెలకొంది. దీంతో మరోసారి మధ్యప్రాచ్యంలో ఉద్రిక్తతలు చోటుచేసుకుంటున్నాయి.
ఇక పర్యటనలో భాగంగా ఇరాన్ అగ్ర నాయకులతో వరుసగా అసిమ్ మునీర్ సమావేశం అవుతున్నారు. ఇరాన్ పార్లమెంట్ స్పీకర్ గాలిబాఫ్‌తో భేటీ అయ్యారు. ఈ సమావేశానికి ముందు పశ్చిమాసియా వివాదం, ప్రాంతీయ పరిస్థితులకు సంబంధించిన దౌత్యపరమైన ఎత్తుగడల్లో భాగంగా.. ఇరాన్ విదేశాంగ మంత్రి అబ్బాస్ అరాఘ్చీతో అసిమ్ మునీర్ సుదీర్ఘ చర్చలు జరిపినట్లు శనివారం ఇరాన్ ప్రభుత్వం ఒక ప్రకటనలో తెలిపింది. ప్రధానంగా అణు ఒప్పందంపైనే పంచాయితీ తెగడం లేదని సమాచారం. ఈ ఒక్కదానిపై ఇరాన్ పట్టువీడితే శాంతి ఒప్పందం జరిగే అవకాశం ఉంది.
