IT Layoffs: ఐటీ ఉద్యోగుల్లో కలవరం మొదలైంది. వరసగా పలు టెక్ కంపెనీలు ఉద్యోగులను తొలగిస్తున్నాయి. దీంతో పలు ఐటీ ఉద్యోగులు కుటుంబాల్లో వణుకు మొదలైంది. ఎప్పుడు తమ ఉద్యోగం ఊడుతుందో అని బిక్కుబిక్కమంటున్నారు. ఇప్పటికే ప్రపంచస్థాయి ఐటీ కంపెనీలు గూగుల్, మైక్రోసాఫ్ట్, ట్విట్టర్, మెటా వంటివి తమ ఉద్యోగులను తీసేశాయి. 2022లో మొదలైన ఈ లేఆఫ్స్ 2023లో తీవ్రస్థాయికి వెళ్తాయని నిపుణులు చెబుతున్నారు.
ఇదిలా ఉంటే ఐటీ ఉద్యోగులను భయపెట్టేలా మరోవార్త వచ్చింది. టెక్ దిగ్గజ కంపెనీలు జనవరిలో నెలలో సగటున ప్రతీరోజూ 3000 మందిని ఉద్యోగులను తొలగిస్తుందని లేఆఫ్స్.ఎఫ్‌వైఐ తెలిపింది. ప్రపంచవ్యాప్తంగా 166 ఐటీ కంపెనీలు ఇప్పటివరకు 65,000 మందికి పైగా ఉద్యోగులను తొలగించాయి. రానున్న రోజుల్లో ఈ ఉద్యోగాల తీసివేత మరింతగా పెరిగే అవకాశం ఉంది. మరోవైపు అంతర్జాతీయంగా జరుగుతున్న పరిణామాలు భారతీయ ఐటీ ఉద్యోగులను భయపెడుతున్నాయి. నిన్నమెన్నటి వరకు లక్షల్లో శాలరీలు తీసుకుని ఆనందంగా ఉన్న వారు ఇప్పుడు తెగ కంగారు పడిపోతున్నారు.
Read Also: iPhone: రికార్డ్ క్రియేట్ చేసిన ఆపిల్.. ఒక నెలలో భారత్ నుంచి అత్యధిక ఎగుమతులు
ఇటీవల గూగుల్ 12,000 మంది ఉద్యోగులను తొలగించింది. అంతకుముందు మైక్రోసాఫ్ట 10,000 మందిని తొలగిస్తూ నిర్ణయం తీసుకున్నాయి. ఇప్పటికే ట్విట్టర్ 50 శాతం మందిని, మెటా 11,000 మందిని, అమెజాన్ 18,000 మందిని తొలగిస్తున్నట్లు ప్రకటించాయి. ఇక దేశీయ ఐటీ దిగ్గజం విప్రో కూడా ఇటీవల ఫ్రెషర్లను 400 మందిని తొలగించింది. రానున్న రోజుల్లో టీసీఎస్ కూడా తమ ఉద్యోగులకు ఉద్వాసన పలుకుతుందని వార్తలు వినిపిస్తున్నాయి. ఈ పరిణామాలు ఐటీ ప్రొఫెషన్లలో దడపుట్టిస్తోంది.
ప్రపంచవ్యాప్తంగా ఆర్థికమాంద్యం వస్తుందనే కారణంతో ఐటీ కంపెనీలు ఖర్చును తగ్గించుకునే ఉద్దేశంతో ఉద్యోగులను తొలగిస్తున్నాయి. ఇప్పటికే పలు కంపెనీల ఆదాయం గణనీయంగా తగ్గింది. ఈ క్రమంలో ఖర్చును అదుపు చేయాలంటే ఉద్యోగుల తొలగింపు ఒక్కటే మార్గం అని తెలుస్తోంది. రానున్న 6 నెలలు ఏడాది కాలంలో ఆర్థికమాంద్యం తప్పకుండా వస్తుందని ఆర్థికవేత్తలు అంచనా వేస్తున్నారు. 2008 మాంద్యంతో పోలిస్తే ఈ సారి మాంద్యం తీవ్రం మరింత ఎక్కువగా ఉంటుందని అంచనా వేస్తున్నారు.