April Fools’ Day: ఏప్రిల్ ఫూల్స్ డే గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. ఏప్రిల్ 1 వచ్చిందంటే మిత్రులు, సన్నిహితులు ఒకరినొకరు ఆటపట్టించడం, అబద్ధాలు చెబుతూ నమ్మించే ప్రయత్నం చేస్తుంటారు. ఇలా అబద్ధాలు నమ్మితే ఫూల్స్ అయ్యారంటూ ఆట పట్టిస్తుంటారు. అయితే ఏప్రిల్ 1 రోజున మాత్రమే ఇలా ఎందుకు జరుపుకుంటారు..? అనే సందేహం చాలా మందిలో వస్తుంది. అయితే దీని వెనక పలు రకాల కథలు ఉన్నాయి.
Read Also: PM Narendra Modi: ప్రధానికి వ్యతిరేకంగా అభ్యంతరకర పోస్టర్లు.. 8 మంది అరెస్ట్..
నిజానికి ఏప్రిల్ ఫూల్స్ డేకు మూలం స్పష్టంగా తెలియదు కానీ.. కొన్ని సంఘటనల వల్లే ఫూల్స్ డేగా జరుపుకుంటారని అంతా నమ్ముతుంటారు. 1582 లో పోప్ గ్రెగొరీ 13 గ్రెగోరియన్ క్యాలెండర్ ను ప్రవేశపెట్టారు. అప్పటి నుంచి ఈ ఆచారం ప్రారంభం అయినట్లు భావిస్తుంటారు. ఈ క్యాలెండర్ ప్రకారం నూతన సంవత్సరాన్ని జనవరి 1కి మార్చారు. అయితే కొంతమంది జనవరి 1ని నిరాకరించి ఏప్రిల్ నెలలోనే న్యూఇయర్ వేడుకలు జరుపుకునే వారు. అయితే ప్రజలు ఇలా పాత క్యాలెండర్ పట్టుకుని ఏప్రిల్ 1న న్యూఇయర్ వేడుకలను జరుపుకునే వారిని వెక్కిరించడం ప్రారంభించారు. దీంతో కాలక్రమేణా ఏప్రిల్ 1 ఫూల్స్ డేగా స్థిరపడింది.
మరొక స్టోరీ ప్రకారం రోమేనియన్ పండగ హిలేరియా నుంచి ఇది ఉద్భవించిందని నమ్ముతారు. లాటిన్ లో దీని అర్థం ఆనందం. ఏప్రిల్ 1న పురాతన కాలంలో రోమ్ లోని ప్రజలు మారువేషాలు ధరించి ఒకరినొకరు ఎగతాళి చేస్తూ ఆటపట్టించేవారు. ఏప్రిల్ ఫూల్స్ డే ఉత్తరార్థగోళంలో వసంతకాలంలో మొదటి రోజు. అప్పటి నుంచి ప్రపంచంలోని ప్రజలు నేటి వరకు ఏప్రిల్ 1న రోజున ఫూల్స్ డేగా జరుపుకుంటున్నారు. కాలక్రమంలో ఏప్రిల్ 1, ఏప్రిల్ ఫూల్స్ డేగా స్థిరపడింది.