తీవ్ర ఆర్థిక సంక్షోభంతో ద్వీప దేశం శ్రీలంక ఉక్కిరిబిక్కిరి అవుతోంది. ఇప్పటికే ఆ దేశంలో ఆహార, మందులు, ఎరువులు, ఇంధన కొరత ఎక్కువైంది. ప్రజల తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. ఇంధన సమస్యల కారణంగా స్కూళ్లు, ప్రభుత్వ కార్యాయాలు మూసేయాలని కూడా అధికారులు ఆదేశాలు జారీ చేసిన సంగతి తెలిసిందే. ఇప్పటితే ఆహారం, ఇంధన కొరత, ఆర్థిక సంక్షోభంతో ఉక్కిరిబిక్కిరి అవుతున్న లంకేయులపై మరో పిడుగు పడింది. లీటర్ పెట్రోల్ ధర రూ.50, డీజిల్ ధర రూ.60 పెరిగింది.
పెరిగిన ధరలు ఆదివారం వేకువజామున 2 గంటలకు అమల్లోకి వచ్చాయి. ప్రస్తుతం శ్రీలంకలో లీటర్ పెట్రోల్ ధర రూ.470. డీజిల్ ధర రూ.460గా ఉన్నాయి. దశాబ్దాల్లో ఎన్నడూ లేని విధంగా శ్రీలంక ఆర్థిక సంక్షోభంలో కూరుకుపోయింది. విదేశీ మారక నిల్వలు అడుగంటాయి. పెట్రో ఉత్పత్తులు కొనేందుకు కూడా డబ్బుల్లేవు. అనేక నెలలుగా శ్రీలంకలో ఇంధన కొరత నెలకొంది. పెట్రోల్, డీజిల్ కోసం రోజుల తరబడి వేచి చూడాల్సి వస్తోంది. ముడి చమురు కోసం ఇటీవలే శ్రీలంక ఆర్డర్ ఇచ్చినా.. సరఫరాదారులకు చెల్లించేందుకు నిధులు లేవు. ఫలితంగా స్టాక్ రావడం ఆలస్యమవుతుందని సిలోన్ పెట్రోలియం కార్పొరేషన్ చెప్పగా.. ప్రభుత్వం ఆదివారం నుంచి ధరలు పెంచింది. ఏప్రిల్ 19 తర్వాత శ్రీలంకలో పెట్రోల్ ధరలు పెంచడం ఇది మూడో సారి.
గతంలో మే 24న పెట్రోల్ ధరను 24%, డీజిల్ ధరను 38% మేర శ్రీలంక సర్కారు పెంచింది . తాజాగా పెట్రోల్, డీజిల్ విక్రయాలపైనా ఆంక్షలు విధించింది. అతికొద్ది బంకుల్లోనే పెట్రోల్, డీజిల్ అమ్మాలని.. ప్రజా రవాణా, విద్యుత్ ఉత్పత్తి, పరిశ్రమలకు మాత్రమే ప్రాధాన్యం ఇవ్వాలని స్పష్టం చేసింది. కొత్త స్టాక్ వచ్చే వరకు పెట్రోల్ బంకుల ఎదుట బారులు తీరొద్దని ప్రజలకు శ్రీలంక ఇంధన శాఖ మంత్రి కాంచన విజిశేఖర విజ్ఞప్తి చేశారు. ధరల మోతతో ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. రోజుల తరబడి వేచిచూసినా వంట గ్యాస్, పెట్రోల్, డీజిల్ దొరక్క నరకం చూస్తున్నారు. తరచూ అనేక చోట్ల ప్రజలు ఆందోళనలకు దిగుతున్నారు.ఆర్థిక సంక్షోభం నేపథ్యంలో ప్రభుత్వంపై ప్రజల్లో నెలకొన్న అసంతృప్తి.. నిరసనాగ్నిగా మారింది.మే 9న జరిగిన నిరసనలు హింసాయుతంగా మారి ఓ ఎంపీ సహా 10 మంది మరణించారు. 1948లో స్వాతంత్ర్యం వచ్చాక శ్రీలంక ఎన్నడూ ఇంతటి ఆర్థిక సంక్షోభాన్ని చూడలేదు. ఆహారం, ఔషధాలు, వంట గ్యాస్, పెట్రోల్, డీజిల్‌కు దేశంలో తీవ్ర కొరత ఏర్పడింది.