Amaravati Farmers Maha Padayatra 2 Started: అమరావతినే ఆంధ్రప్రదేశ్ రాజధానిగా కొనసాగించాలంటూ.. రాజధాని రైతులు చేస్తున్న పోరాటం సోమవారంతో వెయ్యి రోజులకు చేరుతుంది. మూడు రాజధానుల ప్రకటన వచ్చిన వెంటనే.. దాన్ని వ్యతిరేకిస్తూ రైతులు ఉద్యమం ప్రారంభించారు. ఇప్పుడది వెయ్యి రోజులకు చేరిన నేపథ్యంలో.. రెండో విడత పాదయాత్రకు శ్రీకారం చుట్టారు. వెంకటపాలెం గ్రామంలో వెంకటేశ్వరస్వామి ఆలయం వద్ద నుంచి తమ యాత్రను రైతులు ప్రారంభించారు. ఆలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించిన తర్వాత.. వేంకటేశ్వరస్వామి రథాన్ని ముందుకు నడిపి, పాదయాత్రకు అంకురార్పణ చేశారు. రాజధాని పరిధిలోని 29 గ్రామాల నుంచి రైతులు, రైతు కూలీలు, మహిళలు, అన్ని వర్గాల వారు విడతల వారీగా ఇందులో పాల్గొననున్నారు.
అమరావతి నుంచి శ్రీకాకుళం జిల్లా అరసవల్లి వరకు.. సుమారు 1000 కిలోమీటర్ల మేర ఈ పాదయాత్ర కొనసాగనుంది. పాదయాత్రలో దెందులూరు ఎమ్మెల్యే చింతమనేని సైతం పాల్గొననున్నారు. ఈ యాత్రకు పోలీసులతో భారీ బందోబస్తు ఏర్పాటు చేశారు. 60 రోజుల పాటు 12 పార్లమెంట్, 45 అసెంబ్లీ నియోజకవర్గాల మీదుగా ఈ మహా పాదయాత్ర సాగనుంది. తొలిరోజు వెంకటపాలెం, కృష్ణాయపాలెం, పెనుమాక, ఎర్రబాలెం మీదుగా మంగళగిరి వరకు పాదయాత్ర చేయనున్న రైతులు.. రాత్రి మంగళగిరిలోనే బస చేయనున్నారు. నవంబరు 11వ తేదీన శ్రీకాకుళం జిల్లా అరసవల్లిలో ఈ యాత్ర ముగుస్తుంది. రైతుల పాదయాత్రకు రాజకీయ పక్షాలు మద్దతు తెలిపాయి. టీడీపీ, బీజేపీ, సీపీఐ, జనసేన పార్టీలకు చెందిన కొందరు ముఖ్య నేతలు ఈ యాత్రలో పాల్గొననున్నారు.
తొలుత ఈ పాదయాత్రకు అనుమతి కోసం అమరావతి రైతులు డీజీపీని కోరగా.. ఆయన నిరాకరించారు. దీంతో వాళ్లు హైకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. ఈ పిటిషన్‌ను విచారించిన ధర్మాసనం.. చివరికి శుక్రవారం నాడు పాదయాత్రకు అనుమతి ఇచ్చింది.