Bangladesh: బంగ్లాదేశ్‌లో విద్యుత్ సంక్షోభం ముదిరింది. జార్ఖండ్ రాష్ట్రంలోని అదానీ పవర్‌కు చెందిన గొడ్డా థర్మల్ పవర్ ప్లాంట్‌లోని రెండు యూనిట్లలో ఒక దానిలో బాయిలర్ సమస్య ఏర్పడింది. దీంతో విద్యుత్ ఉత్పత్తి నిలిచిపోయింది. దీంతో 1600 మెగావాట్ల సామర్థ్యం కలిగిన ఈ పవర్ ప్లాంట్‌లో ప్రస్తుతం ఉత్పత్తి సగానికి పడిపోయింది. బంగ్లాదేశ్‌తో దీర్ఘకాలిక ఒప్పందంలో భాగంగా దాదాపు 1500 మెగావాట్ల విద్యుత్ ఈ ప్లాంట్ నుంచే సరఫరా అవుతోంది. ఈ పరిణామాలు బంగ్లాదేశ్‌లో విద్యుత్ సమస్యల్ని మరింతగా పెంచనుంది. సరఫరా పూర్తిగా పునరుద్ధరించడానికి మరికొన్ని రోజులు పట్టే అవకాశం ఉంది.
గత కొంత కాలంగా బొగ్గు రవాణా సమస్యల కారణంగా ఈ ప్లాంట్ తక్కువ విద్యుత్ ఉత్పత్తి చేస్తోంది. ఈ సమస్య పరిష్కారమవుతుందని అనుకుంటున్న సమయంలో ఒక యూనిట్ ట్రిప్ కావడం బంగ్లాదేశ్‌కు కరెంట్ షాక్‌గా చెప్పొచ్చు. బంగ్లాదేశ్ పవర్ డెవలప్మెంట్ బోర్డు అధికారుల ప్రకారం.. మరమ్మతు పనులు ప్రారంభించడానికి కనీసం 48 గంటల పట్టొచ్చు. ఆ తర్వాత విద్యుత్ పూర్తిస్థాయిలో పునరుద్ధరించడానికి మరికొన్ని రోజులు పట్టే అవకాశం ఉంది.
భారత్‌తో ఉద్రిక్తతల వేళ బంగ్లాకు కరెంట్ షాక్..
షేక్ హసీనా విషయంలో బంగ్లాదేశ్ భారత్‌ను హెచ్చరించే స్థాయికి వచ్చింది. 2024 ఆగస్టులో హింసాత్మక అల్లర్ల సమయంలో హసీనా బంగ్లా నుంచి భారత్ పారిపోయి వచ్చారు. అప్పటి నుంచి ఇక్కడే ఉంటున్నారు. ఈ అల్లర్లలో మానవత్వానికి వ్యతిరేక చర్యలకు పాల్పడ్డారని బంగ్లాదేశ్ కోర్టు హసీనాకు మరణశిక్ష విధించింది. ఈ నేపథ్యంలో ఆమెను అప్పగించాలని ఆ దేశం డిమాండ్ చేస్తోంది. ఈ అంశం రెండు దేశాల మధ్య ఉద్రిక్తతలకు కారణమైంది.
బంగ్లా ప్రధాని తారిఖ్ రెహ్మాన్ భారత పర్యటనకు రాకుండా చైనా పర్యటనకు వెళ్లారు. బ్రిక్స్ సదస్సుకు ఆహ్వానం అందినా కూడా వింత కారణాలు చెబుతూ తారిఖ్ రెహ్మాన్ ఈ సమావేశాలకు రాలేదు. బిమ్‌స్టెక్ చైర్మన్ హోదాలో ఆహ్వానం అందిందని, బంగ్లా ప్రధాని హోదాలో ఆహ్వానం పంపలేదని ఆ దేశ విదేశాంగ శాఖ సహాయ మంత్రి హుమాయున్ కబీర్ చెప్పారు.

