Earthquake: వరసగా భారీ భూకంపాలతో ద్వీపదేశం ఇండోనేషియా వణికిపోతోంది. తాజాగా బుధవారం రాత్రి 8.02 గంటలకు మరోసారి శక్తివంతమైన భూకంపం వచ్చింది. 6.7 తీవ్రతతో బండా సముద్రంలో భూకంపం వచ్చినట్లు యూఎస్ జియోలాజికల్ సర్వే తెలిపింది. ఇప్పటి వరకు ప్రాణ, ఆస్తి నష్టాల గురించిన వివరాలు తెలియలేదు. ఎలాంటి సునామీ హెచ్చరికలు జారీ చేయలేదు.
ఈ భూకంపం వల్ల సునామీ వచ్చే అవకాశం లేదని ఇండోనేషియా అధికారులు తెలిపారు. దీనికి ముందు ఈ రోజు ఉదయం 11.53 గంటలకు తనింబార్ దీవుల్లోని సౌమ్లాకి పట్టణంలో 7.1 తీవ్రతతో భూకంపం వచ్చింది. భూకంపం తీవ్రంగా ఉందని అక్కడి ప్రజలు వెల్లడించారు.
Read Also: Delhi Air Pollution: ఢిల్లీలోకి యాప్- ఆధారిత ట్యాక్సీలపై నిషేధం..
ఇండోనేషియా ప్రాంతం పసిఫిక్ ‘రింగ్ ఆఫ్ ఫైర్’’ ప్రాంతంలో ఉంది. భూ అంతర్భాగంలో టెక్టానిక్ ప్లేట్ల కదలికలు ఈ ప్రాంతంలో ఎక్కువగా ఉంటాయి. అంతే కాకుండా సముద్రంలో భారీ అగ్నిపర్వతాలు తరుచుగా విస్ఫోటనం చెందుతుంటాయి. దీంతో ఈ ప్రాంతంలో భూకంపాలు సర్వసాధారణం. పసిఫిక్ రింగ్ ఆఫ్ ఫైర్ జపాన్ నుంచి ఆగ్నేయాసియా, పసిఫిక్ బేసిన్ మీదుగా విస్తరించి ఉంది. 2004 సుమత్రా తీరంలో 9.1 తీవ్రతతో భూకంపం వచ్చింది. దీని వల్ల సునామీ ఏర్పడింది. ఒక్క ఇండోనేషియాలోనే 1,70,000 మంది చనిపోయారు. దీని వల్ల శ్రీలంక, ఇండియాలతో కలిపి 2,20,000 మంది మరణించారు.