అమెరికాలో గన్ కల్చర్ నానాటికీ పెరుగుతూనే ఉంది. తాజాగా మరోసారి కాల్పుల మోత మోగింది. ఈ వారాంతంలో ఇప్పటివరకు చికాగో నగరంలో జరిగిన కాల్పుల్లో ఐదుగురు మరణించగా.. మరో 16 మంది గాయపడ్డారు. చికాగోలోని ఓ నైట్ క్లబ్‌లో చోటు చేసుకున్న కాల్పుల్లో ఇద్దరు అక్కడికక్కడే మృతి చెందారు. మరో నలుగురు తీవ్రంగా గాయపడ్డారు. వీరిలో ఒకరి పరిస్థితి విషమంగా ఉంది. ఆదివారం అర్ధరాత్రి తర్వాత ఈ ఘటన చోటు చేసుకుంది. కాల్పులకు పాల్పడింది ఎవరు.. ఎందుకు.. అనే విషయాలపై స్పష్టత లేదు.
కాల్పుల ఘటనపై స్థానిక పోలీసులు మాట్లాడుతూ.. చికాగోలోని గేరీ ప్రాంతంలో ఉన్న నైట్ క్లబ్‌లో కాల్పులు చోటు చేసుకున్నట్లు తెలిపారు. కాల్పుల్లో 34 ఏళ్ల ఓ యువకుడు, 26 ఏళ్ల ఓ యువతి మృతి చెందినట్లు తెలిపారు. నైట్ క్లబ్ ఎంట్రన్స్ వద్ద యువకుడి మృతదేహాన్ని, క్లబ్ లోపల యువతి మృతదేహాన్ని గుర్తించినట్లు చెప్పారు. ఆ ఇద్దరినీ ఆసుపత్రికి తరలించినప్పటికీ.. అప్పటికే మృతి చెందినట్లు వైద్యులు నిర్ధారించారన్నారు. మృతుల పేర్లు, వివరాలు పోలీసులు ఇంకా వెల్లడించలేదు. కాల్పుల్లో గాయపడినవారు ప్రస్తుతం ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు. మెట్రో హోమిసైడ్ యూనిట్ ఈ ఘటనపై విచారణ జరుపుతోంది. కాల్పుల ఉదంతానికి సంబంధించి ఎవరికైనా ఏదైనా సమాచారం తెలిసినట్లయితే క్రైమ్ టిప్ లైన్‌కి చేరవేయాలని కోరింది.
కాగా, చికాగోలో వరుస కాల్పుల ఘటనలు తీవ్ర ఆందోళన రేకెత్తిస్తున్నాయి. ఈ వారాంతంలో చోటు చేసుకున్న వేర్వేరు కాల్పుల ఘటనల్లో మొత్తం ఐదుగురు మృతి చెందగా, 16 మంది గాయపడ్డారు. శుక్ర, శని, ఆదివారాల్లో చికాగోలోని వేర్వేరు ప్రాంతాల్లో వరుస కాల్పుల ఘటనలు చోటు చేసుకున్నాయి.