3 Indians Died in USA: అమెరికాలో ‘బాంబ్ సైక్లోన్’ వణికిస్తోంది. మంచు తుఫాన్ ధాటికి ఇప్పటికే అక్కడ 60 మందికి పైగా మరణించారు. తూర్పు రాష్ట్రాలు ఈ మంచు తుఫాన్ ధాటికి తీవ్రంగా ప్రభావితం అవుతున్నాయి. ముఖ్యంగా న్కూయార్క్ స్టేట్ లో మనుషులు బయటకు వెళ్లే పరిస్థితి లేదు. ఇదిలా ఉంటే మంచు తుఫాన్ ధాటికి ముగ్గురు భారతీయులు మరణించడం విషాదాన్ని నింపింది. ఇందులో ఇద్దరు తెలుగు దంపతులు ఉన్నారు.
Read Also: PM Modi Mother Hiraba: మోడీ తల్లికి అస్వస్థత.. ఆస్పత్రికి తరలింపు
అరిజోనాలో వుడ్స్ కాన్యన్ లేక్ వద్ద ముగ్గురు భారతీయులు మరణించారు. సరస్సులో గడ్డ కట్టిన మంచుపై నడుచుకుంటూ వెళ్తున్న సమయంలో మంచు పగిలిపోవడంతో నీటిలో మునిగిపోయారు. ముగ్గురు సెంట్రల్ అరిజోనా నగరం అయిన సేసన్ నుంచి 30 మైళ్ల దూరంలోని వుడ్స్ కాన్యన్ సరస్సుకు వచ్చారు. ఈ ప్రమాదంలో మరణించిన బాధితులను నారాయణ ముద్దన(49), గోకుల్ మెడిసేటి, (47), హరిత ముద్దనగా కోకోనినో కౌంటీ షెరీఫ్ కార్యాలయం గుర్తించింది. మృతులంతా అరిజోనాలోని చాండ్లర్ లో నివసిస్తున్నారు. సోమవారం రాత్రి హరిత ముద్దన మృతదేహాన్ని అధికారులు గుర్తించారు.
ఫైర్ డిపార్ట్మెంట్ సిబ్బంది చల్లటి నీటిలో చిక్కకుపోయిన మహిళలను బయటకు తీసి ప్రాణాలు రక్షించేందుకు సీపీఆర్ నిర్వహించారు. అయినా కూడా ప్రాణాలు దక్కలేదు. మంగళవారం మొత్తం ముగ్గురిని గుర్తించి బయటకు తీశారు. ఈ ఏడాది జూన్ నెలలో నారాయణ ముద్దన-హరిత దంపతులు స్వగ్రామం అయిన గుంటూరు జిల్లాలోని పెదనందిపాడు మండలం పాలమర్రుకు వచ్చి వెళ్లారు. ప్రమాదంలో వీరిద్దరు చనిపోవడంతో గ్రామంలో విషాదఛాయలు అలుముకున్నాయి.