Mexico Bus Accident: మెక్సికో దేశంలో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. దక్షిణ రాష్ట్రమైన ఓక్సాకాలో బుధవారం ఈ ఘటన చోటు చేసుకుంది. పర్వత ప్రాంతం గుండా బస్సు వెళ్తున్న సమయంలో లోయలో పడిపోవడంతో ఈ ప్రమాదం జరిగింది. ఈ ప్రమాదంలో 27 మంది మరణించారని పోలీసులు తెలిపారు. 17 మంది తీవ్రంగా గాయపడినట్లు అధికారులు తెలిపారు. ప్రమాదానికి మెకానికల్ వైఫల్యమే కారణం అని అనుమానిస్తున్నారు. గాయపడిన వారిలో ఆరుగురి పరిస్థితి విషమంగా ఉన్నట్లు వెల్లడించారు. పర్వతాలు, మలుపులు ఉంటే రియోట్ ప్రాంతం అయిన మాగ్డలీన పెనాస్కో పట్టణంలో ఈ ప్రమాదం జరిగింది.
Read Also: Gold Price Today: పెరుగుతున్న బంగారం ధరలకు బ్రేక్.. తెలుగు రాష్ట్రాల్లో నేటి రేట్స్ ఎలా ఉన్నాయంటే?
స్థానిక రవాణా సంస్థ నిర్వహించే బస్సు మంగళవారం రాత్రి రాజధాని మెక్సికో సిటీ నుండి బయలుదేరి శాంటియాగో డి యోసోండువా పట్టణానికి వెళుతున్నట్లు అధికారులు తెలిపారు. డ్రైవర్ బస్సుపై నియంత్రణ కోల్పోయి ఉండవచ్చని.. దీంతో 25 మీటర్ల లోతులో ఉన్న లోయలో పడిపోయిందని రాష్ట్ర అధికారి జీసస్ రోమెరో విలేకరుల సమావేశంలో తెలిపారు. బస్సు నడుపుతున్న సంస్థ మెక్సికో సిటీ నుంచి రోజూవారీ సేవలు అందిస్తుందని అతను తెలిపారు. మెక్సికోలో ఘోరమైన రోడ్డు ప్రమాదాలు సర్వసాధరణంగా మారాయి. ఆ దేశంలో చాలా మంది ప్రజలు బస్సులపై ఆధారపడుతారు. మారుమూల ప్రాంతాలు, కొండ ప్రాంతాలు ఎక్కువగా ఉండటంతో ప్రమాదాలు జరుగుతున్నాయి.