2025 సంవత్సరం కొన్ని గంటల్లో ముగియనుంది. కొత్త సంవత్సరానికి స్వాగతం పలికేందుకు ప్రపంచ వ్యాప్తంగా ప్రజలు ఎదురుచూస్తున్నారు. అయితే ఈ ఏడాది అంతర్జాతీయంగా అనేక ఉద్రిక్తతలు చోటుచేసుకున్నాయి. ఓ వైపు దేశాల మధ్య యుద్ధాలు.. ఇంకోవైపు ట్రంప్ ప్రపంచ దేశాలపై వాణిజ్య యుద్ధం ప్రకటించడం. ఇలా ఏడాది పొడవునా గందరగోళమే నెలకొంది. ఈ సంవత్సరం హైలెట్‌గా నిలిచిన వార్తలపై ఒకసారి లుక్కేద్దాం.
ట్రంప్ వాణిజ్యం యుద్ధం
ఈ ఏడాది జనవరిలో అమెరికా అధ్యక్షుడిగా రెండోసారి ట్రంప్ పదవీ బాధ్యతలు చేపట్టారు. అప్పటి నుంచి దూకుడు ప్రదర్శిస్తూనే ఉన్నారు. ఏడాది పొడవునా ప్రతి రోజూ హెడ్‌లైన్స్‌లో మార్మోగిన పేరు ట్రంపే. నిత్యం ఏదొక వార్తతో ట్రంప్ ప్రపంచ మీడియాను షేక్ చేశారు. ఇక ఉన్నట్టుండి ప్రపంచ దేశాలపై వాణిజ్య యుద్ధాన్ని ప్రకటించారు. భారత్‌పై తొలుత 25 శాతం సుంకం విధించగా.. అనంతరం రష్యా దగ్గర చమురు కొనుగోలు చేస్తున్నందుకు జరిమానాగా మరో 25 శాతం సుంకం విధిస్తున్నట్లు ప్రకటించారు. దీంతో ఇరు దేశాల మధ్య సంబంధాలు దెబ్బతిన్నాయి. ఇక మధ్యలో కొన్ని రోజులు మీడియా ముందు ప్రత్యక్షం కాకపోవడంతో అరోగ్యంపై పుకార్లు వ్యాప్తి చెందాయి. ఇక ప్రపంచ వ్యాప్తంగా ఆయా దేశాల మధ్య శాంతి ఒప్పందాలు కుదుర్చారు. ఇందులో గాజా-ఇజ్రాయెల్, కంబోడియా-థాయ్‌లాండ్.. ఇలా ఆయా దేశాలకు మధ్యవర్తిగా వ్యవహరించారు. ప్రస్తుతం రష్యా-ఉక్రెయిన్ యుద్ధంపై దృష్టి పెట్టారు.
చార్లీ కిర్క్
ఇక ప్రపంచ వ్యాప్తంగా సంచలనం సృష్టించిన సంఘటన చార్లీ కిర్క్ హత్య. ట్రంప్ సన్నిహితుడైన చార్లీ కిర్క్ ఉతా వ్యాలీ యూనివర్సిటీలో ప్రసంగిస్తుండగా దుండగుడు జరిపిన కాల్పుల్లో మృతిచెందారు. ఈ ఘటన ప్రపంచ వ్యాప్తంగా సంచలనం సృష్టించింది.
జేడీ వాన్స్-ఎరికా కిర్క్ కౌగిలింత
ఇక చార్లీ కిర్క్ హత్య తర్వాత భర్తకు చెందిన టర్నింగ్ పాయింట్ యూఎస్ కార్యక్రమాన్ని భార్య ఎరికా కిర్క్ నడిపిస్తున్నారు. ఇందులో భాగంగా అమెరికా ఉపాధ్యక్షుడు జేడీ వాన్స్‌ను ప్రత్యేక అతిథిగా ఆహ్వానించింది. అయితే స్టేజ్‌పై జేడీ వాన్స్-ఎరికా కిర్క్ చాలా గట్టిగా ఇద్దరూ కౌగిలించుకున్నారు. దీంతో పెద్ద ఎత్తున పుకార్లు వ్యాపించాయి. ఇద్దరూ పెళ్లి చేసుకోబోతున్నారంటూ వదంతులు వ్యాపించాయి. అప్పట్లో ఇది పెద్ద సంచలనం క్రియేట్ చేసింది.
ఆస్ట్రోనోమర్ సీఈవో-హెచ్‌ఆర్ మేనేజర్ కౌగిలింత
ఇక ఆస్ట్రోనోమర్ సీఈవో ఆండీ బైరాన్-హెచ్‌ఆర్ మేనేజర్ క్రిస్టిన్ కాబోట్ ఓ కోల్డ్‌ప్లే కచేరీలో ఇద్దరూ కౌగిలించుకున్న దృశ్యాలు సోషల్ మీడియాలో తెగ వైరల్ అయ్యాయి. కచేరీలో ప్రేక్షకుల మధ్యలోనే ఇద్దరూ రొమాన్స్‌లో దిగిపోయారు. హఠాత్తుగా కెమెరా వారిని ఫోకస్ చేసింది. అనంతరం దృశ్యాలు సోషల్ మీడియాలోకి రావడంతో నెట్టింట వైరల్ అయ్యాయి. దీంతో ఇరు కుటుంబాల్లో విభేదాలకు దారి తీసి విడాకుల వరకు వెళ్లింది.
కోనంకి సుదీక్ష చౌదరి..
కోనంకి సుదీక్ష చౌదరి (20) భారత సంతతి విద్యార్థిని. అమెరికా పౌరురాలు. వర్జీనియాలో నివాసం ఉంటుంది. ఐదుగురు స్నేహితులతో కలిసి మార్చి 5న కరేబియన్ దేశానికి విహారయాత్రకు వెళ్లింది. మార్చి 6న రిసార్ట్ బార్‌లో స్నేహితులతో కలిసి మద్యం పార్టీ చేసుకున్నారు. అనంతరం ఒక యువకుడితో కలిసి బీచ్‌కు వెళ్లింది. మళ్లీ ఆమె ఆచూకీ లభించలేదు. కోస్ట్ గార్డ్స్, పోలీసులు రోజుల తరబడి గాలించినా ప్రయోజనం లేకుండాపోయింది. దీంతో కుమార్తె చనిపోయినట్లుగా తల్లిదండ్రులు ప్రకటించారు.
జెలెన్‌స్కీ-ట్రంప్ ఫైట్
ఇక ఈ ఏడాది సంచలనం సృష్టించిన సంఘటనల్లో ట్రంప్-జెలెన్‌స్కీ మధ్య జరిగిన ఫైటింగ్. రష్యా-ఉక్రెయిన్ యుద్ధం ఆపేందుకు ట్రంప్ శతవిధాలా ప్రయత్నిస్తున్నారు. ఈ క్రమంలో వైట్‌హౌస్‌లో ట్రంప్-జెలెన్‌స్కీ మధ్య చర్చలు జరిగాయి. ఈ క్రమంలో జెలెన్‌స్కీ.. ట్రంప్‌ను ఎదిరించి మాట్లాడిన దృశ్యాలు చాలా హైలెట్ అయ్యాయి. సోషల్ మీడియాలో తెగ చక్కర్లు కొట్టాయి.
