100 MPs support Rishi Sunak in UK PM race: లిజ్ ట్రస్ రాజీనామాతో యూకేలో రాజకీయ సంక్షోభం ఏర్పడింది. ఆర్థికంగా కుదేలవుతున్న బ్రిటన్ ఆర్థిక వ్యవస్థను చక్కబెట్టలేక లిజ్ ట్రస్ చేతులెత్తేశారు. ప్రధానిగా పదవీ బాధ్యతలు చేపట్టిన 45 రోజుల్లోనే రాజీనామా చేశారు. దీంతో మరోసారి బ్రిటన్ ప్రధాని ఎన్నిక అనివార్యం అయింది. ఇదిలా ఉంటే చాలా మంది టోరీ ఎంపీలు, కన్జర్వేటివ్ పార్టీ ప్రతినిధులు రిషి సునాక్ ని కాదని లిజ్ ట్రస్ ని ఎన్నుకోవడంపై తప్పు జరిగిందని భావిస్తున్నారు.
ఇదిలా ఉంటే మరోసారి ప్రధాని రేసులో నిలిచేందుకు మాజీ ప్రధాని బోరిస్ జాన్సన్ సిద్ధం అవుతున్నారు. మరోసారి రిషి సునాక్ ప్రధాని రేసులో నిలవనున్నారు. వీరిద్దరి మధ్య ప్రధానంగా పోటీ ఉండే అవకాశం కనిపిస్తోంది. యూకే ప్రధాని పదవి పోటీలో ఉండేందుకు అవసరమైన ఎంపీల మద్దతును పొందారు రిషి సునాక్. శుక్రవారం ఇందుకు అవసరమైన 100 మంది ఎంపీల మద్దతును పొందారు. ఇదిలా ఉంటే క్యాబినెట్ సభ్యురాలు పెన్నీ మోర్డాంట్ తను ప్రధాని పోటీలో ఉంటానని ప్రకటించిన మొదటి వ్యక్తిగా నిలిచారు. శుక్రవారం చివరి నాటి రిషి సునాక్ కు 103 మంది, బోరిస్ జాన్సన్ కు 68 మంది, మోర్డాంట్ 25 మంది ఎంపీల మద్దతు పొందినట్లు రాజకీయ వెబ్ సైట్ గైడో ఫాక్స్ వెల్లడించింది.
Read Also: Liz Truss: పదవిలో ఉన్నది 45 రోజులే.. కానీ ఏటా రూ.కోటి అలవెన్స్
రిషి సునాక్ ప్రత్యర్థులు ఒకవేళ 100 మంది టోరీ ఎంపీల మద్దతు గెలవడంలో విఫలం అయితే ఆటోమేటిక్ గా పార్టీ నాయకుడిగా, ప్రధాన మంత్రిగా ఎన్నిక అవుతారు. జూలై నెలలో బోరిస్ జాన్సన్ రాజీనామాతో యూకేలో ఏర్పడిన రాజకీయ సంక్షోభం ఏర్పడింది. ఆ సమయంలో రిషి సునాక్, లిజ్ ట్రస్ ప్రధాని మంత్రి పోటీలో నిలబడ్డారు. చివరకు టోరీ సభ్యులు లిజ్ ట్రస్ పై నమ్మకం ఉంచడంతో ఆమె ప్రధాని పదవిని చేపట్టారు.
ఇదిలా ఉంటే రిషి సునాక్, బోరిస్ జాన్సన్ మధ్య ఐక్యత ఒప్పందానికి అవకాశం ఉన్నట్లు కూడా తెలుస్తోంది. గతంలో బోరిస్ జాన్సన్ ప్రభుత్వాన్ని పడగొట్టేందుకు రిషి సునాక్ కారణం అని బోరిస్ జాన్సన్ వర్గం భావిస్తోంది. ఈ నేపథ్యంలో ఇద్దరి మధ్య సఖ్యత కుదురుతుందో లేదో చూడాలి. ‘‘ పార్టీ గేట్’’ కుంభకోణంతో పాటు అనేక అవినీతి ఆరోపణలు రావడంతో బోరిస్ జాన్సన్ మంత్రివర్గంలో ఉన్న మంత్రులంతా ఒక్కక్కరిగా రాజీనామా చేయడంతో ఆ సమయంలో ఆయన రాజీనామా చేయాల్సి వచ్చింది.