Explainer: 4 నెలలు.. 22 ఉ*రిశిక్షలు.. నేరస్థుల గుండెల్లో రైళ్లు పరిగెత్తించిన ఈ తీర్పుల వెనుక ఉన్న జడ్జీ ఎవరు?
- Follow Us :
-
-
Add as a preferred
source on google
చట్టం తన పని తాను చేసుకుపోతుందా? లేక న్యాయపీఠం మీద ఒకే ఒక్క న్యాయమూర్తి ఇచ్చిన తీర్పులు న్యాయ వ్యవస్థలోనే ప్రకంపనలు సృష్టిస్తున్నాయా? కేవలం నాలుగు నెలల వ్యవధి.. పది వేర్వేరు హత్య కేసులు.. ఏకంగా 22 మంది నిందితులకు మరణశిక్ష. ఉత్తరప్రదేశ్‌లోని ముజఫర్‌నగర్ ఫాస్ట్ ట్రాక్ కోర్టు నుంచి వెలువడిన ఈ సంచలన తీర్పులు న్యాయవాదులు, కక్షిదారుల్లో తీవ్ర భయాందోళనలను రేకెత్తించాయి. ఫలితంగా ఆ జడ్జి కోర్టు నుంచి దాదాపు 100 హత్య కేసులను ఉన్నపళంగా మరో కోర్టుకు బదిలీ చేయాల్సి వచ్చింది. ఎవరీ జడ్జి? నేరస్థుల గుండెల్లో రైళ్లు పరిగెత్తించిన ఆ తీర్పుల వెనుక అసలు ఏం జరిగింది?
ఉత్తరప్రదేశ్ ముజఫర్‌నగర్ జిల్లా అడిషనల్ డిస్ట్రిక్ట్ అండ్ సెషన్స్ జడ్జిగా నవంబర్ 2025లో బాధ్యతలు చేపట్టిన 46 ఏళ్ల రవికుమార్ దివాకర్ సాధారణ న్యాయమూర్తి కాదు. లక్నో నివాసి అయిన ఆయన 2009లో ఆజంగఢ్‌లో అడిషనల్ సివిల్ జడ్జిగా కెరీర్ ప్రారంభించి, మే 2015లో సుల్తాన్‌పూర్‌లో సివిల్ జడ్జిగా, అనంతరం జ్యుడీషియల్ మేజిస్ట్రేట్‌గా పనిచేశారు. 2022లో వారణాసిలోని జ్ఞానవాపి ప్రాంగణంలో వీడియోగ్రఫీ సర్వేకు ఆదేశాలు జారీ చేసి దేశవ్యాప్తంగా వార్తల్లో నిలిచారు. అయితే, ముజఫర్‌నగర్ ఫాస్ట్ ట్రాక్ కోర్టులో ఆయన ఇచ్చిన వరుస మరణశిక్షల తీర్పులతో బార్ అసోసియేషన్ అధ్యక్షుడు ప్రమోద్ త్యాగి సహా న్యాయవాదులు, కక్షిదారుల్లో తీవ్ర ఆందోళన మొదలైంది. దీంతో మరణశిక్ష లేదా జీవిత ఖైదు పడే అవకాశమున్న దాదాపు 100 హత్య కేసులను జిల్లా అండ్ సెషన్స్ జడ్జి వీరేంద్ర కుమార్ సింగ్ కోర్టుకు బదిలీ చేయాల్సి వచ్చింది.
గడిచిన నాలుగు నెలల్లో రవికుమార్ దివాకర్ కోర్టు ఇచ్చిన తీర్పులను పరిశీలిస్తే నేరాలపై ఆయన ప్రదర్శించిన కఠిన వైఖరి స్పష్టమవుతుంది. ఏప్రిల్ 6న, 45 లక్షల రూపాయల ఆర్థిక వివాదంతో అక్టోబర్ 15, 2019న న్యాయవాది మహ్మద్ సమీర్‌ను కిడ్నాప్ చేసి సిక్రి అడవుల్లో చంపిన కేసులో ముగ్గురికి ఉరిశిక్ష విధించారు. ఆ వెంటనే, ఏప్రిల్ 28న 2019 నాటి మరో హత్య కేసులో ఒక మహిళతో పాటు ఆమె ముగ్గురు కుమారులకు ఒకేసారి మరణశిక్ష ఖరారు చేశారు. ఇక మే 30న, నవంబర్ 7, 2011న ముజఫర్‌నగర్‌లో జరిగిన 15 ఏళ్ల నాటి డబుల్ మర్డర్ కేసులో నిందితుడు రహీస్‌కు మరణశిక్ష విధించారు. 30 ఏళ్ల రాజేష్ దేవి, ఆమె ఆరేళ్ల కుమారుడు హిమాన్షును చెరకు తోటలోకి తీసుకెళ్లి ఇటుకలతో కొట్టి చంపిన ఈ కేసును ‘రేరెస్ట్ ఆఫ్ ది రేర్’ కేసుగా పరిగణించారు.
Also Read
జూన్ నెలలోనూ ఇదే కఠిన వైఖరి కొనసాగింది. జూన్ 20న రాజేంద్ర సైనీ హత్య కేసులో గజేంద్ర, రామ్‌కిరణ్ అనే ఇద్దరికి మరణశిక్ష విధించగా.. జూలై 2న మరో కీలక తీర్పు వెలువడింది. జూన్ 4, 2020న ఒక వ్యక్తి తన తల్లిని కొడుతుండగా కాపాడేందుకు వెళ్లిన డ్యూటీలో ఉన్న హోంగార్డు రతీరామ్ను పొడిచి చంపిన కేసులో దీపక్ అనే నిందితుడికి మరణ శిక్ష విధిస్తూ ఉరి ఖరారు చేశారు. అలాగే జూలై 6న, ఆగస్టు 24, 2010 నాటి పంచాయతీ ఎన్నికల కక్షల కేసులో 60 ఏళ్ల రాజ్బీర్ సింగ్‌ను కాల్చి చంపిన మాజీ గ్రామ సర్పంచ్ ప్రమోద్, అతని అనుచరుడు సహదేవ్లకు మరణశిక్ష విధించారు. జూలై 17న, ఆగస్టు 20, 2011న శామ్లీ జిల్లాలో మోటార్‌సైకిల్‌పై వెళ్తున్న రైతు రాజ్ సింగ్‌ను దోపిడీ యత్నంలో కాల్చి చంపిన కేసులో నలుగురు నిందితులకు ఉరిశిక్ష విధిస్తూ తీర్పునిచ్చారు.
ఆగస్టు నెలలోనూ పాత కేసులకు సత్వర న్యాయం పేరిట మరణశిక్షలు కొనసాగాయి. ఆగస్టు 12న, డిసెంబర్ 9, 1999న 5 లక్షల నష్టపరిహారం కోసం కలప వ్యాపారి సలీమ్‌ను కిడ్నాప్ చేసి చాపర్ అడవుల్లో గొంతు కోసి చంపిన కేసులో 27 ఏళ్ల తర్వాత నిందితుడు షానవాజ్‌కు మరణశిక్ష విధించారు. ఇక ఆగస్టు 13న, జూలై 14, 2014న శామ్లీ జిల్లాలో పాత కక్షలతో పవన్ కుమార్ ఇంట్లోకి చొరబడి కాల్పులు జరిపి హత్య చేసిన 12 ఏళ్ల నాటి కేసులో రాంవీర్, రాజీవ్, రాహుల్, హరేందర్ కుమార్ అనే నలుగురికి ఉరిశిక్షతో పాటు రూ. 1.70 లక్షల జరిమానా విధించారు.
నేరస్థులకు చట్టం విధించే అత్యున్నత శిక్ష ఒక హెచ్చరికగా ఉండాలన్నది ఒక వాదనైతే, ప్రతి కేసునూ ఒకే మూసలో చూస్తూ మరణశిక్షలను సర్వసాధారణం చేయడం రాజ్యాంగం ప్రసాదించిన న్యాయ సమీక్షా స్ఫూర్తికి విరుద్ధమన్నది న్యాయ నిపుణుల ఆందోళన. నాలుగు నెలల్లో 22 ఉరిశిక్షలు విధించిన న్యాయమూర్తి నుంచి 100 కేసులను ఉన్నపళంగా బదిలీ చేయడం వెనుక ఉన్న న్యాయపరమైన సంకోచాలు.. భారత న్యాయవ్యవస్థలో శిక్షల సమతుల్యతపై సరికొత్త చర్చకు తెరలేపాయి.
:- CLN RAJU (EDITOR-NTV DIGITAL)
తాజావార్తలు
-
OTR : హిందూపురం గడ్డ మా అడ్డా! బాలయ్య ఇలాకాలో లోకల్ వార్ మొదలైందా?
-
Story Board : BRICS సదస్సు ప్రధాన ఉద్దేశమేంటి..? భారత్ ఎలాంటి సందేశం ఇస్తుంది..?
-
Telangana Assembly : తెలంగాణ అసెంబ్లీకి ఒకరోజు పొడిగింపు.. బుధవారానికి వాయిదా
-
Greenfield Highway : గ్రీన్‌ఫీల్డ్ హైవేపై మృత్యుఘోష.. ఒకే రోజు మూడు ప్రమాదాలు
-
Happy Journey : వందల ఫోన్ నెంబర్లున్నా మాట్లాడుకోలేని ఒంటరితనం.. మనందరి కథే ‘హ్యాపీ జర్నీ’..
ట్రెండింగ్
-
Ganesh Chaturthi AI Prompts: మీ స్వంత ఫొటోలతో AI ఉపయోగించి గణపతి శుభాకాంక్షలు చెప్పండి.. ప్రాంప్ట్స్ ఇదిగో మీకోసం..!
-
Moto Buds 2 Fusion: 55dB ANC, 13 గంటల ప్లేబ్యాక్‌తో సెప్టెంబర్ 15న భారత్‌లో లాంచ్ కానున్న Moto Buds 2 Fusion.!
-
1 Crore Investment Plan: రూ. కోటి సంపాదించడానికి ఎంత సమయం పడుతుంది.? SIPలో ఎంత పెట్టుబడి పెట్టాలి?
-
Lemon Storage Tips: రసం తగ్గకుండా, రుచి మారకుండా నిమ్మకాయలు నెల రోజులు తాజాగా ఉండాలంటే ఈ సింపుల్ ట్రిక్స్ ఫాలో అయితే చాలు.!
-
BRICS Summit 2026: బ్రిక్స్ వేదికగా ఇరాన్‌తో భారత్ దౌత్యం.. చాబహార్‌తో కొత్త ట్రేడ్ రూట్.!