America Vs Iran: డెడ్‌లైన్ ముగిసింది! యుద్ధమా? లొంగుబాటా?
- Follow Us :
-
-
Add as a preferred
source on google
ప్రపంచ ముడిచమురు సరఫరాను శాసించే అత్యంత కీలకమైన జలసంధి… ఇప్పుడు అంతర్జాతీయ రాజకీయ చదరంగంలో పెను యుద్ధభూమిగా మారింది! జూన్ 17న కుదిరిన చారిత్రక 60 రోజుల అమెరికా-ఇరాన్ ఒప్పందం నిన్నటితో ముగిసింది. యుద్ధం ఆగలేదు సరికదా, ట్రంప్ దూకుడు ప్రకటనలు, ఇరాన్ సైనిక హెచ్చరికలతో పశ్చిమాసియా మరో పెను సంక్షోభం అంచున నిలిచింది. అసలు ఈ 60 రోజుల్లో ఏం జరిగింది? 300 బిలియన్ డాలర్ల ప్యాకేజీ నుంచి చమురు దిగ్బంధం దాకా… ఇరాన్-అమెరికా మధ్య జరుగుతున్న ఈ మైండ్ గేమ్ వెనుక ఉన్న అసలు రహస్యాలేంటి?
నెలల తరబడి సాగిన తీవ్ర యుద్ధం తర్వాత, జూన్ 17న అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్, ఇరాన్ అధ్యక్షుడు మసూద్ పెజెష్కియాన్ మధ్య ఒక అవగాహన ఒప్పందం కుదిరింది. సైనిక చర్యలను శాశ్వతంగా నిలిపివేసి, 60 రోజుల్లో తుది పరిష్కారం కనుగొనడమే దీని లక్ష్యం. నిబంధనల ప్రకారం, 30 రోజుల్లో వాషింగ్టన్ తన నావికా దిగ్బంధాన్ని ఎత్తివేయాలి, ఆంక్షలు సడలించాలి, ఇరాన్ నిధులను విడుదల చేయాలి. అంతేకాకుండా ఇరాన్ పునర్నిర్మాణానికి కనీసం 300 బిలియన్ డాలర్ల భారీ ప్యాకేజీని సమకూర్చాలి. దీనికి బదులుగా ఇరాన్ హార్ముజ్ జలసంధిలోని మైన్లను తొలగించి, 60 రోజుల పాటు వాణిజ్య నౌకలను ఉచితంగా అనుమతించాలి. అణు విస్తరణను నిలిపివేయాలి.
అయితే, ఈ ఒప్పందం కాగితాలకే పరిమితమైంది. పరస్పర అనుమానాలు, విరుద్ధమైన ప్రకటనలతో జూలై 7 నాటికే ట్రంప్ ఈ ఒప్పందం ముగిసిపోయిందని ప్రకటించారు. వాషింగ్టన్ ఆంక్షలు ఎత్తివేయలేదని ఇరాన్, జలసంధిని తెరవలేదని అమెరికా ఒకరిపై ఒకరు ఆరోపణలు చేసుకున్నాయి. జూలై 18న ఇరాన్ సుప్రీం లీడర్ మొజ్తబా ఖమేనీ తీవ్రంగా స్పందించారు. ట్రంప్ సంతకానికి ఎలాంటి విలువా లేదని, అది నమ్మకద్రోహమని తేల్చిచెప్పారు. అమెరికా దురాశను అంగీకరించేది లేదని, తమ ప్రాంతీయ మిత్రదేశాలతో కలిసి పాఠం చెబుతామని హెచ్చరించారు.
Also Read
ఈ వివాదానికి కేంద్ర బిందువు ‘స్ట్రెయిట్ ఆఫ్ హార్ముజ్’. ప్రపంచవ్యాప్తంగా దాదాపు ఐదో వంతు చమురు, LNG సరఫరా సాగే ఈ మార్గంపై పట్టు కోసం తీవ్ర ఉద్రిక్తత నెలకొంది. ఇరాన్‌ను ఓడించిన తర్వాత హార్ముజ్‌ను అమెరికా భూభాగంగా ప్రకటిస్తానని శుక్రవారం ట్రంప్ సంచలన వ్యాఖ్యలు చేశారు. తమ నావికా దిగ్బంధం ‘ఉక్కు గోడ’ లాంటిదని అభివర్ణించారు. దీనికి ఇరాన్ ఘాటుగా బదులిచ్చింది. ట్రంప్ ట్వీట్లతోనో ఎయిర్‌క్రాఫ్ట్ క్యారియర్లతోనో హార్మూజ్ జలసంధిని స్వాధీనం చేసుకోలేరని, హద్దులు దాటితే కాళ్లు విరగ్గొడతామని ఇరాన్ స్పష్టం చేసింది.
ఈ మాటల యుద్ధం క్షేత్రస్థాయిలో తీవ్ర ప్రభావం చూపుతోంది. అంతర్జాతీయ వాణిజ్యం కుంటుపడుతోంది.మునుపటి వారాంతంలో హార్మూజ్ గుండా 31 నౌకలు ప్రయాణించాయి. కానీ శనివారం కేవలం 5 కమోడిటీ నౌకలే హార్మూజ్ ను దాటాయి. ఆదివారం నాటికి ఆ సంఖ్య సున్నాకు పడిపోయింది. యూఏఈకి చెందిన మూడు ADNOC నౌకలపై దాడులు జరిగినట్లు వార్తలు కూడా వచ్చాయి. దీని ప్రభావంతో బ్రెంట్ ముడిచమురు ధర మళ్లీ పెరిగింది. ఇరాన్ అణ్వాయుధాన్ని అడ్డుకోవడానికి, కాస్త భారమైనా పెట్రోల్ కొనాలంటూ అమెరికన్ ప్రజలకు ట్రంప్ పిలుపునిచ్చారు.
రెండు దేశాల మధ్య ప్రత్యక్ష దౌత్యానికి బ్రేక్ పడింది. అయితే థర్డ్ పార్టీల ద్వార ఇప్పటికీ ఇరు దేశాలూ సమాచార మార్పిడి చేసుకుంటూ ఉండడం కాస్త ఊరటనిచ్చే అంశం. ఖతార్, పాకిస్థాన్, ఒమన్ తదితర దేశాల ద్వారా అమెరికా, ఇరాన్ తెరవెనుక సమాచార మార్పిడి చేసుకుంటున్నాయి. ప్రస్తుతం ఒమన్‌తో కలిసి కొత్త నౌకా మార్గాలపై ఇరాన్ పనిచేస్తోంది. అమెరికా ఆంక్షలు సడలిస్తేనే మార్గం సుగమమవుతుందని విదేశాంగ మంత్రి అబ్బాస్ అరాఘ్చీ తేల్చిచెప్పారు. అటు అమెరికా ట్రెజరీ సెక్రటరీ స్కాట్ బెస్సెంట్ మరింత తీవ్రమైన ఆర్థిక ఆంక్షలతో పాటు పోర్టుల దిగ్బంధాన్ని కొనసాగిస్తామని హెచ్చరిస్తున్నారు.
ఆగస్టు 17తో ఒప్పందం ముగిసింది… కానీ ముగింపు లేని యుద్ధ తంత్రం ఇప్పుడే మొదలైంది! అటు ట్రంప్ ఆర్థిక ఆంక్షలు, నావికా దిగ్బంధం ద్వారా ఇరాన్‌ను పూర్తిగా లొంగదీసుకోవాలని చూస్తున్నారు. ఇటు మొజ్తబా ఖమేనీ నాయకత్వంలోని ఇరాన్ హార్ముజ్ జలసంధిని తమ వ్యూహాత్మక అస్త్రంగా వాడుతోంది. ఇది పూర్తి స్థాయి యుద్ధమూ కాదు, సంపూర్ణ శాంతీ కాదు… ప్రపంచ ఆర్థిక వ్యవస్థను ఉక్కిరిబిక్కిరి చేసే దీర్ఘకాలిక భౌగోళిక యుద్ధం. ఇది ఇప్పట్లో ముగుస్తుందని ఆశించడం అత్యాశే!
:-CLN RAJU (EDITOR-NTV DIGITAL)
తాజావార్తలు
-
Huawei Mate 90 Pro Max: హువావే Mate 90 Pro Max లాంచ్.. 200MP RYYB కెమెరా, 6,800mAh బ్యాటరీ, 6.9 అంగుళాల డిస్ప్లే
-
Smit Machchhar & Sandra Samuel: అప్పట్లో సాండ్రా శామ్యూల్, ఇప్పుడు స్మిత్ మచ్ఛార్..
-
BC Reservation: బీసీ రిజర్వేషన్లపై హైకోర్టు సంచలన తీర్పు.. జీవోలు కొట్టివేత
-
Asian Games 2026: వైభవ్ మెరుపులు.. ఇషాన్ ఊచకోత..! శ్రీలంక టార్గెట్ ఎంతంటే.?
-
ATF Price Hike: విమాన ప్రయాణికులకు షాక్.. జెట్ ఫ్యూయల్ ధరలు పెంపు..
ట్రెండింగ్
-
Instant Dosa Recipes: పులియబెట్టే పని లేకుండా.. అప్పటికప్పుడు నోరూరించే వివిధ రకాల దోశలు ఇలా సింపుల్‌గా చేయండి ఇలా..!
-
Rohit Sharma Celebration: అది నా కోసం మాత్రమే, నేను చెప్పను.. జాగింగ్ సెలబ్రేషన్స్‌పై రోహిత్ ఆసక్తికర వ్యాఖ్యలు!
-
8,000mAh బ్యాటరీ, Full HD+ AMOLED డిస్ప్లేతో Oppo K15s, K15x లాంచ్.. ధర ఎంతంటే.?
-
భారీ బ్యాటరీ, ఇమర్సివ్ డిస్ప్లేతో అక్టోబర్ 6న Vivo S2 FE లాంచ్‌కు రెడీ..!
-
POCO Big Billion Days Sale 2026: రూ.11,999 నుంచే స్మార్ట్ఫోన్లు.. X8 సిరీస్‌పై భారీ డిస్కౌంట్లు.!